Idream media
Idream media
గల్వాన్ లోయ ఘటనపై భారత్, చైనాల మధ్య మూడు దఫాల చర్చల అనంతరం.. చైనా ఆధీనంలో ఉన్న పది మంది భారతీయ సైనికులు విడుదలయ్యారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం… ఇద్దరు ఉన్నతాధికారులతో సహా మొత్తం పది మంది భద్రతా సిబ్బంది భారత్‌కు చేరినట్లు తెలిసింది.
అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, 1962 తరువాత భారతీయ సైనికులు చైనాకు చిక్కటం ఇదే తొలిసారని పరిశీలకులు అంటున్నారు. జూన్ 16 నుంచి జూన్ 18 వరకు గల్వాన్ లోయలోని పెట్రోల్ పాయింట్ 14 వద్ద మేజర్ జనరల్ స్థాయి అధికారులు మూడు సార్లు భేటీ అయ్యారు.
జూన్ 18న మేజర్ జనరల్ అభిజిత్ బాపట్… అదే స్థాయి చైనా సైన్యాధికారితో చర్చలు జరిపారు. కాగా, ఈ అంశంపై ఇరు దేశాల్లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో.. చర్చకు వచ్చిన అంశాలు, ఫలితాలను గోప్యంగా ఉంచుతున్నారు.
జూన్ 15న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటి వరకు 20 మంది భారతీయ సైనిక సిబ్బంది మృతిచెందగా…76 మంది గాయపడినట్టు సమాచారం. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే వీరిలో ఎవరికీ తీవ్రగాయాలు కాలేదని, త్వరలోనే వారంతా విధుల్లో చేరనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో 18 మంది లేహ్‌లో చికిత్స పొందుతుండగా, వారికి 15 రోజుల్లోనే పోస్టింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. స్వల్పంగా గాయపడిన మిగతా జవాన్లు వారంలో విధులకు హాజరుకానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఘటనలో చైనా వైపు సైతం భారీ ప్రాణనష్టం జరిగినప్పటికీ ఆ దేశం వివరాలు వెల్లడించడం లేదు. దాదాపు 43 మంది చైనా సైనికులు మరణించి లేదా గాయపడి ఉంటారని భారత ఆర్మీ పేర్కొంటోంది. 35 మంది చైనా సైనికులు మరణించారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
అయితే కొందరు భారత సైనికులు చైనా బలగాల అధీనంలో ఉన్నారని ఊహాగానాలు వినిపించాయి. మన సైనికులు ఎవరూ చైనా అధీనంలో లేరని, ఈ ఘర్షణలో పాల్గొన్నవారు ఎవరూ గల్లంతు కాలేదని భారత ఆర్మీ స్పష్టం చేసింది.
ఇక వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా, భారత్‌లకు చెందిన సీనియర్ సైనికాధికారులు మే నుంచి ఇప్పటి వరకు పలుమార్లు భేటీ అయ్యారు.
గల్వాన్ లోయలో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని న్యాయంగా, నిజాయితీగా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు చైనా ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు దౌత్య, సైనిక మార్గాలతో సమాచార మార్పిడి చేసుకుంటున్నట్లు సదరు అధికారి తెలిపారు.
గల్వాన్ ఘటన తర్వాత చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల ద్వారా సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు.
‘‘ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. రెండు దేశాల నాయకుల మార్గదర్శకత్వంలో ఏకాభిప్రాయంతో సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి.. శాంతి, సామరస్యాలను కాపాడుతూ, ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునేందుకు చర్చలు జరుగుతాయని భావిస్తున్నాం’’ అని ఝావో తెలిపారు.