iDreamPost
iDreamPost
AFC ఆసియాకప్ క్వాలిఫయింగ్‌లో భాగంగా నిన్న భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత గ్రౌండ్ లో యుద్ద వాతావరణం తలపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోల్‌కతాలోని వీఐబీకే స్టేడియంలో శనివారం రాత్రి భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. మొదటి నుంచి కూడా ఆసక్తిగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ కి చెందిన సునీల్ చెత్రీ సేన 2-1 తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. ఆఖరి వరకు డ్రా దిశగా సాగిన ఈ మ్యాచ్‌లో చివర్లో గోల్ కొట్టడంతో ఇండియా ఉత్కంతపోరులో గెలిచింది. అయితే ఓడిపోయామన్న బాధను అఫ్గన్ ఆటగాళ్లు జీర్ణించుకోలేక మ్యాచ్ అనంతరం గ్రౌండ్ నుండి వెళ్ళిపోతున్న భారత ఆటగాళ్ల వైపు వచ్చి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.
దీనికి భారత్ ఆటగాళ్లు కూడా కౌంటర్ ఇవ్వడంతో ఒకరినొకరు తోసుకున్నారు. మిగిలిన ఆటగాళ్లు కూడా అక్కడ గుమిగూడటంతో ఒకరినొకరు తోసుకోవడంతో గొడవ పెద్దదిగా మారి ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరిని ఒకరు కొట్టుకునే వరకు వెళ్లిపోయారు. ఈ గొడవని గమనించిన అధికారులు గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చి ఆటగాళ్లను విడదీసి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ గొడవకి కారణమేంటి, ఇందులో తప్పెవరిది, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.