Idream media
Idream media
చిన్నప్పుడు విపరీతమైన దేశభక్తి. పాడవోయి భారతీయుడా పాటకి ఒళ్లు పులకించేది. ఆ రోజుల్లో ఆగస్టు 15న ఈ పాటకి పిల్లలు డ్యాన్స్ చేసేవాళ్లు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఒకటే సంబరం. స్కూల్ ఉండదు. ఉదయం కాసేపు వెళితే రెండు చాక్లెట్లు లేదా పిడికెడు బొరుగులు ఇస్తారు. ఇవి కాకుండా చొక్కాకి జెండా, గాంధీబొమ్మ బ్యాడ్జ్ పెట్టుకోవచ్చు (బ్యాడ్జ్ వెల అర్ధరూపాయి, స్కూల్లోనే అమ్మేవాళ్లు).
రాయదుర్గం లక్ష్మీబజారు నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకూ పిల్లల ఊరేగింపు. బోలో స్వాతంత్ర భారత్‌కి జై, మహాత్మా గాంధీకి జై అని నినాదాలు చేస్తూ వెళితే అక్కడ గ్రౌండ్‌లో ఎండకి కూచోపెట్టేవాళ్లు. ఊళ్లోని మున్సిపల్ స్కూల్స్ పిల్లలంతా గుంపుగా చేరేవాళ్లం.
వేదిక మీదున్న వక్తలు మైకులు కుయ్యోమని అరిచే వరకూ మాట్లాడేవాళ్లు. మైక్ సిస్టమ్ సరిగా ఉండేది కాదు. ఎన్నిసార్లు మైక్ టెస్టింగ్ చేసినా , అపుడప్పుడు పిచ్చి కుక్కల్లా అరిచేవి. దాంతో వక్తలు కంగారు పడేవాళ్లు. పిల్లలం గొల్లున నవ్వితే అయ్యవార్లు చింతబరికెలతో రెడీగా వుండేవాళ్లు. మున్సిపాలిటీ వాళ్లు నెలనెలా జీతాలు ఇచ్చేవాళ్లు కాదు. చాలా మంది అయ్యవార్లు ఉగ్రనరసింహల్లా పిల్లల్ని ఉతికే వాళ్లు.
ప్రైవేట్ స్కూళ్లు లేకపోవడం వల్ల డాక్టర్ కూతురు సుమిత్ర, ఇల్లిల్లు తిరిగి పాలు పోసే మల్లమ్య కొడుకు గోపాల్, నూనె మిల్లు తిప్పేస్వామి మనవడు లోకనాథ్, ఐస్‌క్రీమ్‌లు అమ్మే నజీర్‌సాబ్ కొడుకు రహమతుల్లా అందరికీ ఒకే స్కూల్ ఒకే నేల. మనుషులెప్పటికీ సమానం కారని నాకప్పుడే తెలుసు. క్లాస్‌లో దెబ్బలు తినని బ్యాచ్ డబ్బున్న వాళ్ల పిల్లలు. తినే బ్యాచ్ మేము. డబ్బున్న వాళ్ల పిల్లల క్రమశిక్షణ కోసం మాకు మరిన్ని దెబ్బలు పడేవి.
మైకులు మూలుగుతూ పని చేసినప్పుడు వక్తలు మా పని పట్టేవాళ్లు. పెద్దైన తర్వాత దేశ భక్తి లేకుండా పోవడానికి చిన్నప్పుడు విన్న ఈ ఉపన్యాసాలే కారణమని నా బలమైన నమ్మకం. గాంధీ స్వరాజ్యం ఎలా తెచ్చాడో, నెహ్రూ ఎలా మన కలలు పండించాడో , ఇందిరమ్మకీర్తి గురించి చెప్పి ముగించేవాళ్లు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్కూల్లో పేద పిల్లలు మాత్రమే ఎందుకు దెబ్బలు తింటారో అర్థమయ్యేది కాదు. అర్థమైన తర్వాత స్వాతంత్ర్యానికి అర్థం పోయింది. మనుషులంతా ఎప్పటికీ ఏదో రకంగా బానిసలే. మన నెత్తిన ఎప్పుడూ ఎవడో ఒకడుండి బెత్తంతో తంతూనే వుంటారు.
ఎంత పెద్ద ఉపన్యాసమైనా ముగించక తప్పదు కాబట్టి ముగిసేది. లైన్‌లో నిలబెట్టి పిప్పిర మెంట్లు అయితే నాలుగు, చాక్లెట్లు అయితే రెండు మున్సిపాలిటీ మరీ దివాళా స్థితిలో వుంటే గుప్పెడు బొరుగులు. తర్వాత ఎవరిళ్లకు వాళ్లు. వచ్చే ఏడాది మళ్లీ ఉపన్యాసాలు.
హైస్కూల్‌లో కొంచెం లెవెల్ మారింది. నాలుగు చాక్లెట్లకు ఎదిగింది స్వాతంత్ర్యం. ఇంటర్, డిగ్రీల్లో అసలు వెళ్లిన గుర్తే లేదు. యూనివర్సిటీల్లో బానిసత్వం అనుభవించే రీసెర్చ్ స్కాలర్లకి తప్ప మాలాంటి వాళ్లకి స్వాతంత్ర్యంతో పనే లేదు.
పత్రికాఫీసుల్లో కూడా మొక్కుబడిగా జెండా ఎగరేసేవాళ్లు. కానీ నేను వెళ్లింది లేదు. గాడిద చాకిరీ చేయించే వాళ్లు కూడా స్వాతంత్రం గురించి మాట్లాడితే ఎట్లా? లేనిది ఉన్నట్టు మాట్లాడడమే జర్నలిజం.