ప్రయోగాల వేళ…. యువ ఆటగాళ్లకు సత్తా చాటే ఛాన్స్

న్యూజిలాండ్ గడ్డపై రెండు టీ20 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఐదు టీ20ల సిరీస్‌ని 3-0 తో చేజిక్కించుకున్న భారత్ శుక్రవారం వెల్లింగ్టన్ వేదికపై జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌లో మరోసారి న్యూజిలాండ్ తో తలపడనుంది.తొలిసారి కివీస్ పై టీ20 సిరీస్‌ గెలిచిన భారత్ జట్టు రిజర్వ్ బెంచ్ యువ ఆటగాళ్లను పరీక్షించటానికి సిద్ధమవుతోంది.ఈ మ్యాచ్‌కి భారత్ తుది జట్టులో మూడు మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో మహమ్మద్ షమీ అద్భుత బౌలింగ్ తో సూపర్ ఓవర్ కు దారితీసిన మూడో టీ20లో ఓపెనర్ రోహిత్ శర్మ కొట్టిన రెండు భారీ సిక్సర్లతో ఓటమి అంచు నుంచి గెలుపు బాటలో పయనించిన భారత ఆటగాళ్లలో ఉత్సాహం ఉరకలేస్తుంది.

తొలి రెండు టీ20లలో నిరాశపరిచిన రోహిత్ శర్మ జరిగిన ఇదే వేదికపై మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియాని ఒంటి చేతితో గెలిపించి ఫామ్ లోకి వచ్చాడు.మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా రాణిస్తున్నాడు.కెప్టెన్ విరాట్ కోహ్లీ బాగానే ఆడుతున్నప్పటికీ కనీసం ఒక అర్ధ సెంచరీ కూడా కొట్టలేదు.ఇక బ్యాటింగ్ లో మనీష్ పాండే,శివం దూబే లు తమ సత్తా నిరూపించుకోవాలి.

స్థానాన్ని మారిస్తే విఫలమౌతున్న అయ్యర్:
యువ ఆటగాళ్లకు బ్యాటింగ్ అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో కోహ్లీకి బదులుగా శ్రేయాస్ అయ్యర్ ను పంపిన ప్రతిసారి విఫలమవుతున్నాడు.గత నాలుగు సిరిస్ లే కాక న్యూజిలాండ్ తో జరిగిన తొలి రెండు టీ20లలో కూడా వరుసగా58,44 పరుగులు చేసి నాలుగో స్థానంలో రాణించాడు.నాలుగో స్థానంలో నిలకడగా రాణిస్తున్న ఈ యువ క్రికెటర్‌ హామిల్టన్ టీ20లో ఐదో స్థానంలో ఆడి 17 పరుగులకే ఔటైపోయాడు.బ్యాటింగ్ లో కీలకమైన నాలుగో స్థానంలో శ్రేయాస్ ను ఆడించటం జట్టుకు ప్రయోజనకరం.

సైనీ,వాషింగ్టన్ లకు తుది జట్టులో ఛాన్స్:
తొలి రెండు టీ20ల్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచి న్యూజిలాండ్ బౌన్సీ పిచ్లపై ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ విఫలమౌతున్నాడు. మూడో టీ20లో కొంతమేర రాణించి 3 ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆశించిన స్థాయిలో బౌలింగ్ ప్రదర్శన చేయకపోవడంతో అతడిపై వేటు వేసి 140 – 150 కి.మీ. వేగంతో యార్కర్ లు సంధించే నైపుణ్యంగల నవదీప్‌ సైనీకి అవకాశమివ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది.న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌లో లెగ్ స్పిన్నర్ చాహల్ అంచనాల్ని అందుకోలేక ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లపై పూర్తిగా తేలిపోయాడు.దీంతో మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ని నాలుగో టీ20లో ఆడించాలని కెప్టన్ కోహ్లీ భావిస్తున్నాడు. బౌలర్‌గానే కాకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న వాషింగ్టన్ జట్టు అవసరాలకు ఉపయోగపడతాడు.

ఆందోళన పరుస్తున్న బుమ్రా బౌలింగ్:
రీ ఎంట్రీలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు.మూడో టీ20లో బుమ్రా బౌలింగ్‌ని కివీస్ బ్యాట్స్‌మెన్‌లు ఉతికారేశారు.కీలకమైన సూపర్ ఓవర్‌లో బుమ్రా ఏకంగా 17పరుగులు సమర్పించుకోవడం జట్టును ఆందోళన పరుస్తుంది. ఈ మ్యాచ్లోనైనా బుమ్రా బౌలింగ్ గాడిలో పడి పదునైన యార్కర్ బంతులతో విరుచుకుపడి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ లను కట్టడి చేయాలని జట్టు యాజమాన్యం ఆశిస్తుంది.

గత ఏడాది టెస్టుల్లో అద్భుతంగా బంతులు వేసి వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీ మూడో టీ20లో తన అనుభవాన్ని రంగరించి చివరి ఓవర్‌లో కివీస్ విజయానికి.9 పరుగులు అవసరమైన దశలో కేవలం 8 పరుగులే ఇచ్చిన షమీ రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను టై గా మార్చాడు. ఫలితం కోసం సూపర్ ఓవర్ వైపుకు నడిపిన ఇలాంటి బౌలింగ్ ప్రదర్శనను జట్టు కోరుకుంటుంది.

Show comments