Idream media
Idream media
ఏడేళ్లుగా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ లో ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి. రాజకీయ వ్యూహకర్త పీకే రాక, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ మద్దతుతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కంటోంది. ఈ ఏడాదిలో ఆరంభంలో వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా లేకపోవడం కూడా కాస్త కాంగ్రెస్ లో ఆశలు రేపింది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ప్రణాళికలు రచిస్తున్న వేళ… మూడ్ ఆఫ్ ది పీపుల్ పేరుతో ఏబీపీ+సీ ఓటర్ సంస్ధలు కలిసి చేసిన సర్వే ఫలితాలు ఆ పార్టీకి షాక్ ఇచ్చాయి. వచ్చే ఏడాదిలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కదానిలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆ సర్వే తేల్చింది.
విచిత్రం ఏంటంటే.. ఇక్కడ ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిపోతోందని సంకేతాలు కనిపిస్తున్నాయి. యూపీలోని యోగా ఆదిత్య ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయినా కాంగ్రెస్ పుంజుకుంటున్న ఛాయలు ఎక్కడా కనబడకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంత వ్యతిరేకత ఉన్నా మళ్ళీ బీజేపీకే యూపీలో అధికారం దక్కబోతోందని సర్వేలో అర్ధమవుతోంది. బీజేపీకి 267 సీట్లు రావచ్చని అంచనా. తర్వాత స్ధానాల్లో ఎస్పీ బీఎస్పీలుండగా అట్టడుగున కాంగ్రెస్ ఉంది.
మోడి మీద దేశంలో ఇంత వ్యతిరేకత ఉందని చెప్పుంటున్నా జనాలు కాంగ్రెస్ పార్టీని ఎందుకని ఇంకా నమ్మటం లేదు ? సోనియాగాంధీ రాహుల్ గాంధి ప్రియాంక గాంధీలపై జనాలకు నమ్మకం పోయిందా ? అన్నదే అర్ధం కావటంలేదు. ఇక ప్రియాంక గాంధీ కూడా ఎక్కడా ఛరిష్మా చూపలేకపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఇపుడు అధికారంలో ఉన్న పంజాబ్ కూడా చేజారిపోయే అవకాశం ఉందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో అర్ధమవుతోంది. సరే సర్వే ఫలితాలన్నీ వాస్తవాలవుతాయని నమ్మేందుకు లేదు. అయితే జనాల మూడ్ ను బట్టి పార్టీల పరిస్ధితి ఏమిటో ఎవరికి వారుగా అంచనాకు రావచ్చు.
ఓవైపు భవిష్యత్ ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఢీ కొట్టేందుకు 19 ప్రతిపక్షాలతో కలిసి జాయింట్ కో ఆర్డినేషన్ కమిటీ (జేసీసీ) ఏర్పాటైంది. దీనికి దిగ్విజయ్ సింగ్ ను నాయకుడిగా ఎన్నుకున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జేఏసీ ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ జేఏసీలో తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఆర్జేడీ డీఎంకే ఝార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పెద్ద పెద్ద పార్టీలున్నాయి. వీటికి అదనంగా వామపక్షాలు ఎటూ ఉండనే ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో జేసీసీకి నేతృత్వం వహించాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఇంత బలహీనంగా ఉంటే మోదీని ఢీ కొట్టడం సాధ్యమేనా? అనే ప్రచారం జరుగుతోంది.