Idream media
Idream media
సుబ్బారావు లేడు, కరోనా తీసుకెళ్లింది. జయించాడు, కానీ మెల్లిగా ఓడించింది. కరోనాతో మనమంతా గెలుపోటముల ఆట ఆడుతున్నాం. ఇంతకీ సుబ్బారావు ఎవరు? రచయిత, కళాకారుడు కాదు, వ్యాపారి కాదు, డబ్బున్న వాడు అసలే కాదు. ఒక సాదాసీదా జర్నలిస్టు. తన పని తాను చేసుకున్న వాడు. అసూయ తెలియని వాడు, అహంకారం లేనివాడు. మంచి తప్ప , చెడ్డ మాట్లాడ్డం చూడలేదు. సెలెబ్రెటీలు ఇలా జీవించలేరు. వాళ్లకంటే సుబ్బారావు గొప్పవాడు.
ఆంధ్రజ్యోతి సంస్థలో తొలి రోజుల్లో ప్రూఫ్ రీడర్‌గా చేరాడు. జీవితమనే పుస్తకంలో కూడా అచ్చు తప్పులు సహించని వాడు. సాధారణమైన సుబ్బారావుకి లెక్కల్లో అసాధారణమైన తెలివి. బచావత్ వేజ్ బోర్డులో 1990లో జర్నలిస్టులకి జీతాలు పెరిగాయి. (తర్వాత వచ్చిన వేజ్ బోర్డులన్నీ చెత్త బుట్టలో చేరాయి. కార్మికుల హక్కుల కోసం వ్యాసాలు రాసే పత్రికలు తమ సంస్థలోని కార్మికులని గుర్తించని గురివిందలు). అకౌంట్స్ సెక్షన్‌లో లెక్కలు రానివాళ్లనే చేర్చుకుంటారు. ఈ కారణంగా ఉద్యోగులకి రావాల్సిన బకాయిల్ని ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ఇచ్చారు. మన లెక్కల మేస్టారు ఇది కనిపెట్టాడు. ఉద్యోగులకి వచ్చింది తక్కువే అయినా అందరి మీద లెక్కలు తీస్తే సంస్థకి లక్షల్లో నష్టం. అన్నం పెట్టిన సంస్థకి తెలిసీ మోసం చేయడం అన్యాయమని సుబ్బారావు మనసు ఒప్పుకోలేదు. నేరుగా జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్లాడు.
“సార్ మీతో మాట్లాడాలి”
ఆఫ్ట్రాల్ ప్రూఫ్ రీడర్ తనతో మాట్లాడడమా?
“మళ్లీ రా, బిజీగా ఉన్నాను”
“బచావత్ లెక్కల్లో తప్పులున్నాయి”
సుబ్బారావుకి లెక్కల పిచ్చి ఉందని ఆయనకి తెలుసు. ఏదో ఫిటింగ్ పెడుతున్నాడనుకుని “బాగానే ఇచ్చాం కదా, ఇంకెంత ఇవ్వాలి” అన్నాడు.
“ఎక్కువ ఇచ్చారు” జీఎం. షాక్.
చిరాగ్గా చూసి “చాదస్తం మానుకో సుబ్బారావు. మన అకౌంట్స్‌లో ఉన్నది మామూలోళ్లు కాదు, ఎక్స్‌ఫర్ట్‌లు. వాళ్లకు తెలియంది నీకు తెలుసా” అన్నాడు.
“నిరూపించలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోతా”
మూడు రోజులు ఇంటికి వెళ్లకుండా అకౌంట్స్‌లో కూచున్నాడు. తప్పు జరిగిందని నిరూపించాడు. అందరూ తేలు కుట్టిన దొంగలు. మరుసటి నెల జీతాల్లో కోత. ఉద్యోగుల్లో సుబ్బారావు మీద కోపం. అప్పట్నించి బచావత్ సుబ్బారావుగా ఆయనకి పేరు.
సంస్థ బాగు కోరినంత మాత్రాన , ఉద్యోగుల బాగు కోరాలని రూలు లేదు. కోరవు కూడా! ఫొటో టైప్ తర్వాత ప్రూఫ్ రీడర్ల అవసరం పోయింది. సుబ్బారావుని రాజీనామా చేయమన్నారు. పిల్లలున్నారు, బతకలేను అన్నాడు. తిరుపతికి బదిలీ చేశారు. విజయ వాడ నుంచి కుటుంబాన్ని మార్చలేడు కాబట్టి జాబ్ మానేస్తాడని అంచనా. రేణిగుంటలో ఒక చిన్న గదిలో ఉంటూ, సైకిల్‌పై ఆఫీస్‌కి వస్తూ మెస్‌లో తింటూ జీవించాడు. కొంత కాలం ఏ పనీ చెప్పలేదు. టైంకి వచ్చి వెళుతుండేవాడు. వేధింపులు మౌనంగా భరించాడు.
(ఆ రోజుల్లో తిరుపతి ఫనీష్మెంట్ సెంటర్. నచ్చని వాళ్లని ఇక్కడికి తోసేవాళ్లు. చౌదరి అనే రిపోర్టర్ ముక్కుసూటిగా మాట్లాడుతుంటే మద్రాస్ ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయనకి తమిళం, ఇంగ్లీష్ రాదు. ఒక చాప, దిండు వేసుకుని ఆఫీస్‌లో నిద్రపోయేవాడు. పైగా గురక కూడా పెట్టేవాడు. వచ్చిన జనం జడుసుకునే వాళ్లు. భరించలేక తిరుపతికి పంపారు. రోజుకి ఒకటే ప్రెస్‌నోట్ రాసేవాడు. తిరుపతిలో ఉన్నాడని తెలిసి కొండ దర్శనం కోసం వ్యాగన్లలో బంధువులు రాసాగారు. రెండు నెలల్లో తిరుక్షవరం. ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడు. ఆంధ్రజ్యోతి చేయలేని పని వెంకన్న చేశాడు. మనం తిరుపతిలో ఉంటే మన ఫోన్ నంబర్, బంధువులు, స్నేహితులు అందరితో ఉంటుంది)
సుబ్బారావుతో పాటు మధుసూధనరాజు అనే ఆయన్ని కూడా ఇదే రకంగా వేధించారు. కోర్టులో కేసు వేశారు. ప్రూఫ్ రీడర్లని సబ్ ఎడిటర్లగా తీసుకోవాలని ఉత్తర్వు. సుబ్బారావుని నా డెస్క్‌లో వేశారు. ఆ రోజుల్లో తెలుగు ఎక్కువైన విలేకర్లు ఉండేవారు. సగం అక్షరాల్ని గొలుసు కట్టులో రాసేవాళ్లు. వాళ్ల కాపీలు సుబ్బారావుకి ఇచ్చేవాన్ని. బ్రహ్మ రాతని డీకోడ్ చేయడం తెలుసు. అప్పట్లో వార్తలు ప్రింటవుట్‌లో వస్తే, వాటిని కత్తిరించి చేత్తో పేజీలో అతికించేవాళ్లు. సుబ్బారావు ప్రత్యేకత ఏమంటే కత్తెరతో కట్ చేసిన సగం వార్తని ఎక్కడో పారవేసేవాడు. దాన్ని వెతకడం పెద్ద పని. కాంగ్రెస్ నాయకుడు ప్రెస్‌మీట్‌లో TDP నాయకుల స్టేట్‌మెంట్లు కలిసి వార్తలుగా అచ్చు అయ్యేవి (కట్ చేసిన పేపర్ ముక్కల తారుమారు వల్ల).
దాంతో కోపంతో తిట్టేవాన్ని. నొచ్చుకునే వాడు కాదు. విజయవాడలో పెరిగినా ఆయన పల్లెటూరి అమాయకుడు. దెయ్యాలున్నాయని నమ్మేవాడు. ఎలుగుబంటి మనిషితో కాపురం చేసిన కథని చెప్పేవాడు.
1997లో నేను చిత్తూరు జర్నలిస్టు యూనియన్ ప్రెసిడెంట్‌గా గెలిచా. అప్పుడప్పుడే ప్రొహిబిషన్ పాక్షికంగా ఎత్తేశారు. కౌంటింగ్ ముగిసి గెలుపు ప్రకటించే సరికి రాత్రి 9.
చంద్రగిరిలో ఒక వైన్ షాప్ షట్టర్లు బాదితే , ఇంపీరియల్ బ్లూ అనే ఒక నికృష్ణమైన విస్కీ దొరికింది. సరుకు మొత్తం ఆటోలో ఎక్కించి చంద్రగిరి మైదానంలో పార్టీ. ఒక మెస్ వాడిని బతిమలాడితే ఇద్దరు పహిల్వాన్లు అటూఇటూ లాగినా , సాగడం తప్ప తెగడం తెలియని పరోటాలు, అప్పటికప్పుడు చికెన్‌ని రబ్బర్‌లా సాగే విధంగా వండి ఇచ్చాడు.
పెద్ద పార్టీ. సుబ్బారావు హుషారుగా రెండు పెగ్గులు వేశాడు. తర్వాత పెగ్గులు ఆయనకి గుర్తు లేదు, నా పాయింట్ ఏమంటే (ఆయన ఊత పదం) అని తెల్లవారే వరకూ స్పీచ్ ఇచ్చాడు. ఇప్పటికీ ఆ పాయింట్ ఏంటో నాకు తెలియదు. మరుసటి రోజు నుంచి డ్రింకింగ్ మానేశాడు. ఆ ఘనత నా పార్టీకి దక్కింది.
ఆంధ్రజ్యోతి మూసినప్పుడు పసిపిల్లాడిలా బాధ పడ్డాడు. తిరిగి తెరిస్తే సంబరం. కొంత కాలం తిరుపతిలో చేసి, ఆ తర్వాత గుంటూరులో రిటైర్ అయ్యాడు. నిజానికి ఆయనతో మాట్లాడి చాలా కాలమైంది. కానీ మనిషి ఉన్నాడంటే అదో తృప్తి. లేడు అంటే బాధ.
నీతులు, ఆదర్శాలు, ప్రవచనాలు చెప్పే చాలా మంది డొల్ల మనుషుల కంటే సుబ్బారావు గొప్పవాడు. నీతి సూత్రాలు తెలియవు, కానీ నీతిగా బతికాడు. ఇతరుల చెడ్డ కోరలేదు. పరాయి సొమ్ము ఆశించలేదు. సంస్థకి నష్టం జరిగితే అడ్డుకున్నాడు. అదే సంస్థపై కోర్టులో పోరాటం చేశాడు. కష్టాలకి భయపడలేదు. అందుకే అందరూ ఆయన్ని ప్రేమతో బాబాయ్ అని పిలుచుకున్నారు. మామూలు మనిషే , కానీ ఆయనలో విశిష్ట లక్షణాలున్నాయి.
బాధలు, చావులు జీవితంలో ఒక భాగంగా బతుకుతున్నాం. మన గురించి రాయాల్సిన అవసరం ఎవరికీ రాకుండా కొంత కాలం బతికితే చాలు.