iDreamPost
android-app
ios-app

కోర్టులో పరిష్కారం కోరిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు

కోర్టులో పరిష్కారం కోరిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు

జనవరి 6,1847 న వాగ్గేయకారుడు త్యాగరాజు మరణించాక ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటున్న శిష్యులు ఆయనను కావేరీనది ఒడ్డున ఖననం చేసి, సమాధి నిర్మించి, ఆయన నేర్పించిన విద్యతో తమ భవిష్యత్తు వెతుక్కుంటూ తలో వైపుకి వెళ్లిపోయారు. సరైన ఆలనాపాలనా లేక ఆయన సమాధి చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి శిధిలావస్థకు చేరుకుంది. ఆయన మరణించిన యాభై ఆరు సంవత్సరాల తర్వాత 1903లో ఆయన శిష్యులు కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్ తాము మరణించేలోపు ఒకసారి గురువు గారి సమాధి దర్శించుకోవాలని వచ్చి అక్కడ పరిస్థితి చూసి ఖిన్నులయ్యారు. సమాధి ఎక్కడుందో కూడా తెలియకుండా పెరిగిన పిచ్చిమొక్కలు, దాదాపు నేలమట్టమైన సమాధిని చూసి ఆవేదన చెందిన ఆ ఇద్దరు శిష్యులు సమాధిని పునరుద్ధరించి, ప్రతి సంవత్సరం గురువు గారు వైకుంఠప్రాప్తి పొందిన పుష్యమాసం బహుళ పంచమి నాడు ఆ సమాధి వద్ద ఆరాధనోత్సవాలు నిర్వహించాలని సంకల్పించారు.

1905లో మొదటిసారిగా తంజావూరు జిల్లాలోని తిరువాయూరు త్యాగరాజు వర్ధంతి నాడు ఆయన కీర్తనలతో మారుమోగిపోయింది. నలుమూలల నుంచి వచ్చిన ఎందరో సంగీతకారుల కీర్తనలు, వేద మంత్రాలు, నిత్యాన్నదానాలతో ఆ ఉత్సవాలను పండగలా నిర్వహించారు ఆ శిష్యులు. ఇందుకు ఆ శిష్యుల సంకల్పానికి తోడుగా ఆర్థిక సహకారం అందించారు ఇద్దరు సోదరులు తిలైస్థానం నరసింహ భాగవతార్, తిలైస్థానం పుంజు భాగవతార్.

అయితే ఏడాది తిరక్కుండానే ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో1906 నుంచి ఇద్దరు రెండు వేర్వేరు ఉత్సవాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చే సంగీతకారులు కూడా రెండు బృందాలుగా విడిపోయారు. అన్నగారి ఉత్సవాలను పెద్ద కచేరీ అని, తమ్ముడు నిర్వహించే ఉత్సవాలను చిన్న కచేరీ అని పిలవసాగారు. ఇద్దరూ ఎవరికివారే త్యాగరాజు మీద అమిత భక్తి శ్రద్ధలతో వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తుండటంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఆరాధనోత్సవాలు నిర్విఘ్నంగా జరుగుతున్న సమయంలో సోదరులిద్దరూ ఒకరి తర్వాత మరొకరు మరణించారు.

అప్పుడు పెద్ద కచేరి వయోలిన్ నిపుణుడు గోవిందస్వామి పిళ్ళై ఆధ్వర్యంలోకి, చిన్న కచేరి హరికథకుడు వైద్యనాధ్ భాగవతార్ ఆధ్వర్యంలోకి రావడంతో ఇద్దరూ కలిసి త్యాగరాజు వర్ధంతికి నాలుగు రోజుల ముందు చిన్న కచేరీ ప్రారంభం చేసి, వర్థంతి నాడు ముగించేలా, ఆ తరువాత నాలుగు రోజులు పెద్ద కచేరీ నిర్వహించేలా మొత్తం తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేలా ఒప్పందం చేసుకున్నారు.

మహిళలకు ప్రవేశం లేదు

అయితే ఈ ఉత్సవాల్లో మొదటినుంచి మహిళలకు ప్రవేశం కల్పించలేదు. అప్పట్లో సంగీతం నేర్చుకుని ప్రదర్శనలు ఇచ్చేవారు దేవదాసీలే ఎక్కువగా ఉండడం, వారి పట్ల సమాజంలో చిన్న చూపు ఉండడంతో ఈ ఉత్సవాలు మహిళల పట్ల వివక్ష చూపించాయి. మద్రాసులో ఉంటున్న బెంగళూరు నాగరత్నమ్మ అనే దేవదాసీ కళాకారిణి సంగీతం, నృత్యం, హరికథాగానంలో బాగా పేరు గడించి వాటివల్ల బాగా సంపద గడించింది. తను పాడే పాటల్లో త్యాగరాజ కృతులు ఎక్కువగా ఉండడంతో తన కీర్తికీ, సంపదకూ ఆయనే కారణమని భావించి, వయసు మళ్ళిన నాగరత్నమ్మ తిరువాయూరు వచ్చి త్యాగరాజు కోసం ఆలయం నిర్మించడం ప్రారంభించింది. 1925లో ప్రారంభమైన ఆలయం 1926లో పూర్తయింది. ప్రత్యేకంగా రూపొందించిన త్యాగరాజు శిల్పం అందులో ప్రతిష్ఠించారు.

ఆలయ నిర్మాణం పంచాయతీకి సంబంధించిన స్థలంలో జరిగినా, దైవకార్యం కావడంతో ఎవరూ అడ్డుచెప్పలేదు. అయితే ఆ సంవత్సరం ఆమె నిర్మించిన ఆలయంలో జరిగిన ఆరాధనోత్సవాలలో ఆమె పాడకుండా అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన స్థలంలో నిర్మించిన ఆలయంలో తమ మాటే చెల్లుబాటు కావాలని గ్రామస్తులు, ఉత్సవ నిర్వాహకులు పట్టుబట్టారు. కనీసం హరికథ అయినా చెప్తానని అడిగినా ఒప్పుకోలేదు. ఆమె నిరాశ చెందక గుడి వెనక కొంత స్థలం ఖరీదు చేసి, అందులో పోటీ ఉత్సవాలు మొదలు పెట్టింది. ఇందులో మహిళలకు పెద్దపీట వేసి, అన్నదానం లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆమె ఉత్సవాలకు ఎక్కువ ఆదరణ లభించింది.

ఇలా జరుగుతుండగానే తను నిర్మించిన ఆలయాన్ని తనకు స్వాధీనం చేయాలని నాగరత్నమ్మ కోర్టుమెట్లు ఎక్కింది. కేసు ఓడిపోయినా ఆరాధనోత్సవాలలో ప్రతిరోజూ ఆమె జరిపే ఉత్సవాలు కొంతసేపు ఆలయంలో జరుపుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో మళ్ళీ ఉత్సవాలు రెండుగా విడిపోయాయి. 1940 వరకూ ఇలా కొనసాగుతున్న ఉత్సవాలను 1940లో తంజావూరు కలెక్టర్ కృష్ణస్వామి ఇరు పక్షాల మధ్య సంధిచేసి ఒకటి చేశాడు. 1941లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఇప్పుడు మనం చూస్తున్న రూపం సంతరించుకున్నాయి.

పంచరత్న కీర్తనలు

1941 వరకూ ఈ ఉత్సవాలలో త్యాగరాజ కీర్తనలు అన్నీ పాడేవారు. అయితే ఆ సంవత్సరం హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్ త్యాగరాజ కీర్తనలలో ఎక్కువ మంది కలిసి ఒకేసారి గానం చేయడానికి అనువైన అయిదు కీర్తనలు ఎంపిక చేసి పంచరత్న కృతులు అని పేరు పెట్టారు. అప్పటినుంచి ఈ ఉత్సవాల్లో ఈ అయిదు కీర్తనలు గానం చేయడం ఆనవాయితీగా మారింది.

తన ఆస్తి మొత్తం త్యాగరాజ ఆలయానికి రాసి ఇచ్చిన బెంగళూరు నాగరత్నమ్మ తన శేష జీవితం అక్కడే గడిపి 1952లో మరణించింది. త్యాగరాజు సమాధి పక్కన ఆమెను సమాధి చేసి, ఆమె విగ్రహం అక్కడ ప్రతిష్ఠించారు.

విదేశాల్లో కూడా

అమెరికా లోని క్లీవ్ లాండ్ లో ప్రతి సంవత్సరం క్లీవ్ లాండ్ త్యాగరాజ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. మారిషస్ లో వ్యాస ధాలియా ఆశ్రమం ఆధ్వర్యంలో, 2007 నుంచి నైజీరియా రాజధాని లాగోస్ లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో, అలాగే ఇంగ్లాండు లోనూ ప్రతి ఏటా త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు.