iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా తలపడే రెండు ప్రాంతీయ పార్టీలతో పాటుగా జనసేన వంటి మరో ప్రాంతీయ పార్టీ కూడా ఉంది. ఈ మూడు పార్టీల తర్వాతనే మరో పార్టీ ఉనికి కనిపిస్తూ ఉంటుంది. జాతీయ పార్టీలుగా చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కూడా ఏపీలో ఉనికి కోసం పాట్లు పడాల్సిందే. ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో కలిసి సాగాల్సిందే. వారి అండదండలతో ఒకటో రెండో సీట్లు సాధించాల్సిందే. లేదంటే చిరునామా కోసం కూడా వెదుక్కోవాల్సిందేనన్నట్టుగా రాజకీయ పరిణామాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన మినహా మరో పార్టీకి విజయం దక్కిన ఆనవాళ్లు కూడా లేవన్నది అందరికీ తెలిసిందే. గెలిచినప్పటికీ జనసేన అసెంబ్లీలో తన గొంతు వినిపించే ఛాన్స్ నిలబెట్టుకోలేకపోయిందన్నది వేరే వ్యవహారం.
ఎన్నికలు ముగిసిన రెండున్నరేళ్ల తర్వాత రాజకీయ పరిస్థితి చూస్తుంటే మొత్తంగా జగన్ వర్సెస్ అదర్స్ అన్నట్టుగానే మారింది. పార్టీలు ఎన్ని ఉన్నా రెండే వాదనలకు కట్టుబడినట్టు కనిపిస్తోంది. సహజంగా జగన్ చేసే ప్రతీ పనిని వ్యతిరేకించడమే టీడీపీ కార్యక్రమంగా ఉంటోంది. అది ప్రజానుకూలమా, వ్యతిరేకమా అనేదానితో పొంతన లేకుండా జగన్ చేస్తున్నాడా అయితే అడ్డుకోవాల్సిందేనన్నట్టుగా ఆపార్టీ తీరు ఉంది. మొదట ఒక ప్రకటన చేయడం, దాని చుట్టూ అర్థసత్యాలతో పచ్చ మీడియాలో కథనాలు రాయడం, అప్పటికీ ఆశించినట్టు జరగకపోతే హైకోర్టులో పిటీషన్ వేయడం, చివరగా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుకాకుండా చేయడమే టీడీపీ ఎజెండాగా కనిపిస్తోంది.
ఇక జనసేన, కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలు కూడా టీడీపీ ఎజెండానే తమ కార్యాచరణగా మార్చుకున్నాయి. చంద్రబాబు చెప్పినదే ఈ మూడు పార్టీల నేతలు వల్లించడం నిత్యకృత్యంగా మారింది. టీడీపీ మాటలనే తమ సొంత పదాల్లో వల్లించడానికి వీరంతా అలవాటుపడినట్టు కనిపిస్తోంది. దాంతో పేరుకే వేర్వేరు పార్టీలయినా దాదాపుగా అన్ని అంశాల్లోనూ టీడీపీ ఎజెండా అమలు చేయడమే జనసేన, కాంగ్రెస్, సీపీఐ కర్తవ్యంగా మారింది. చివరకు స్థానిక ఎన్నికల్లో అనేక చోట్ల బహిరంగంగానే పొత్తులు పెట్టుకున్న అనుభవం కూడా ఈ రెండున్నరేళ్లలో అందరూ చూశారు. నిజానికి బీజేపీతో పొత్తుతో జనసేన ఉంది. కాంగ్రెస్ ఒంటరిగా పనిచేస్తున్నట్టు చెబుతోంది. సీపీఐ మనిసిపల్ ఎన్నికల్లో టీడీపీతో వెళ్లి చేతులు కాల్చుకుంది. కానీ ఎక్కడ, ఎవరితో ఉన్నా అంతిమంగా బాబు ఎజెండా భుజాన మోయడమే ఈ పార్టీల విధానంగా అత్యధికులు భావించే పరిస్థితి వచ్చింది.
Also Read : రేపు విశాఖకు జగన్.. సర్వత్రా ఆసక్తి
బీజేపీ కూడా కొంతకాలం పాటు సొంత ఎజెండాతో సాగింది. అనేక అంశాల్లో జగన్ తో పాటుగా టీడీపీని కూడా తప్పుబట్టడానికి ప్రయత్నించింది. పాలక పక్ష తప్పిదాలను, చంద్రబాబు వైఫల్యాలను నిందించడానికి ప్రాధాన్యతనిచ్చింది. కానీ స్వతంత్ర్యంగా వ్యవహరించే యత్నం చేసిన సోము వీర్రాజు కూడా ఇటీవల బీజేపీలో బాబు బృందం ఒత్తిడికి తలొగ్గినట్టు కనిపిస్తోంది.
బీజేపీలో ఉంటూ చంద్రబాబు లక్ష్యాల సాధనకోసం యత్నిస్తున్న వారి అడుగుల్లో సాగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం మీద ఒంటికాలిపై లేచేందుకు ప్రాధాన్యతనిస్తూనే ప్రధాన ప్రతిపక్షం వైపల్యాన్ని విస్మరిస్తున్నారు. ఇరువురిని తప్పుబట్టడం ద్వారా తాము ఎదగాలని ఆశించిన బీజేపీ రూటు కూడా చివరకు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. అనివార్యంగా చంద్రబాబు స్కెచ్ అమలు చేసే నేతల ప్రభావం బీజేపీ మీద బలంగా కనిపిస్తోంది. ఏపీ బీజేపీ కూడా బాబు ఎజెండా అమలులో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రాధాన్యతనిస్తున్న తీరు దానికి తార్కాణంగా చెప్పవచ్చు.
సీపీఎం కొంత సొంతంగా సాగేందుకు ప్రయత్నించినా ఆపార్టీ ప్రభావం నామమాత్రంగా మారింది. గతంలో తాము వ్యతిరేకించిన అమరావతి అంశంలో చివరకు బాబు బాటలో సాగుతోంది. ఇతర అంశాల్లో మాత్రం టీడీపీ ని దూరం పెడుతున్నట్టు కనిపిస్తోంది. లోక్ సత్తా వంటి పార్టీలు పెద్దగా మనుగడలో కనిపించడం లేదు. ఇక వ్యక్తులుగా మిగిలిన రాజకీయ నేతల్లో కూడా చంద్రబాబు ఆశయాలను అమలుచేసే బాధ్యతను నెత్తిన వేసుకుంటున్న వైనం కనిపిస్తోంది. టీడీపీ రాజకీయ వ్యూహాలకు బలం చేకూర్చేలా కొందరు చేస్తున్న ప్రయత్నాలతో ఏపీ రాజకీయాల్లో జగన్ వర్సెస్ అదర్స్ అన్న చందంగా తయారయ్యింది. ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులు ఎలా ఉన్నా రోజువారీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం జగన్ ని వ్యతిరేకించడమే టీడీపీ ఎజెండాగా ఉండగా, టీడీపీ వాదనను వినిపించడమే దాదాపుగా అందరి లక్ష్యంగా మారడం విశేషమే.
Also Read : ఏపీ బాటలో మహారాష్ట్ర