తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే బిడ్డలకు ఇకపై జైలు శిక్ష?

తమ కోసం, తమ ఉన్నతి కోసం కాయ,కష్టం చేసి అహర్నిశలు కష్టపడిన తల్లిదండ్రులను, ముదసలి వయస్సు వచ్చే సరికి వేరు కాపురాలు పెట్టడం, వారిని ఇంటి నుండి గెంటేయడం, వృద్ధాశ్రమాల్లో పడేయడం లేదంటే ఆస్తుల కోసం దాడి చేయడం వంటి చర్యలకు దిగుతున్నారు పిల్లలు. ఇకపై అలా చేస్తే

తమ కోసం, తమ ఉన్నతి కోసం కాయ,కష్టం చేసి అహర్నిశలు కష్టపడిన తల్లిదండ్రులను, ముదసలి వయస్సు వచ్చే సరికి వేరు కాపురాలు పెట్టడం, వారిని ఇంటి నుండి గెంటేయడం, వృద్ధాశ్రమాల్లో పడేయడం లేదంటే ఆస్తుల కోసం దాడి చేయడం వంటి చర్యలకు దిగుతున్నారు పిల్లలు. ఇకపై అలా చేస్తే

తన కడుపులో నలుసు పడిన దగ్గర నుండి భూమిపైకి బిడ్డగా వచ్చేంత వరకు సరిగా కంటి మీద కునుకు వేయదు తల్లి. కాన్పు అనేది తనను మరణం అంచుల వరకు తీసుకెళుతుందని తెలిసినా కూడా తన ప్రాణం కన్నా.. బిడ్డే ముఖ్యమని భావిస్తోంది. ఇక తండ్రి.. పసిగొడ్డుగా ఈ లోకంలోకి అడుగుపెట్టిన నాటి నుండి మరింత బాధ్యతలను భుజాలపై మోస్తాడు. తన బిడ్డల్ని గట్టెక్కించేందుకు అహర్నిశలు కష్టపడతాడు. కానీ అడ్డాల నాడు బిడ్డలు కానీ, గడ్డాలా నాడా అన్నట్లుగా.. పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యాక మాత్రం కన్న తల్లిదండ్రులను భారంగా ఫీలవుతూ.. వారిని వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు పిల్లలు. ఒంటరిగా వదిలేయ్యడం, వృద్ధాశ్రమంలో పడేయడం ఒకటైతే.. వారి ఆస్తుల కోసం, నగలు, డబ్బు కోసం దాడి చేయడం, హింసించడం మరో కోణం.

ఇటీవల కాలంలో ఇటువంటి కేసులు ఎక్కువయ్యాయి. ఆస్తులు రాయించుకునేంత వరకు ప్రేమ ఒలకబోస్తూ.. అంతా అయిపోయాక.. వారిని ఇంటి నుండి గెంటేయడం, దాడి చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయట పోలీసులకు. ముఖ్యంగా వైజాగ్ నగరంలో ఈ విధమైన కంప్లయింట్స్ వస్తున్నాయట. అటువంటి పిల్లలకు (ముఖ్యంగా కుమారులకు) బుద్ది చెప్పాలని భావిస్తున్నారట పోలీసు బాస్‌లు. తల్లిదండ్రులు, వృద్ధులను పిల్లలను సరిగ్గా చూసుకోనట్లయితే.. వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. గతంలోనే ఉన్న ఓ చట్టానికి పదును పెడుతున్నారు. ఇకపై అటువంటి పిల్లలపై తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007 కింద కేసులు బుక్ చేస్తారు. సీనియర్ సిటిజన్ తన స్వంత సంపాదన లేదా ఆస్తిని కాపాడుకోలేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.

ఆ వివరాలను ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు పంపిస్తారు. వారిపై చర్యలు తీసుకోవడానికి అభ్యర్థనతో ఆర్డీఓ అధ్యక్షతన ఉన్న ట్రిబ్యునల్ నివేదికనను పంపడం, ట్రిబ్యునల్ ను ఆశ్రయించేలా ఫిర్యాదుదారుని మార్గనిర్దేశం చేస్తారు. ఒక వేళ ఆరోపణలు నిజమని తేలితే.. 2007 చట్టం కింద కేసు నమోదు చేస్తారు. సీఆర్పీసీ నివేదికను కోర్టులో దాఖలు చేస్తారు. విచారణలో నిజ నిర్ధారణ కనుక అయితే.. తల్లిదండ్రులను హింసించే పిల్లలకు మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 5 వేల జరిమానా విధిస్తారు. గత రెండేళ్లలో విశాఖలో ఈ తరహా కేసులు 7నమోదయ్యాయట. ఇలాంటి ఇబ్బందులకు గురైతే సీపీ వాట్స్ నంబర్ 9493336633కు, పోలీసు హెల్ప్ లైన్ 112 ,నేషనల్ సీనియర్ సిటిజన్స్ హెల్ప్ లైన్ నంబర్ 14567 కు తెలియజేయాలని సీపీ పేర్కొన్నారు.

Show comments