iDreamPost
iDreamPost
ప్రపంచ సినిమాలకు ప్రామాణికంగా భావించే ఐఎండిబి రేటింగ్స్ కి ఆడియన్స్ ఎంత విలువిస్తారో తెలిసిందే. దర్శక నిర్మాతలు సైతం అందులో వచ్చే నెంబర్ ని తమ ప్రమోషన్ల కోసం వాడుకోవడం చాలా సార్లు చూసాం. తాజాగా ఆ సైట్ నుంచి టాప్ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ అఫ్ 2022 లిస్టు విడుదలయ్యింది. అందులో మన టాలీవుడ్ నుంచి ముగ్గురు ఉండటం విశేషం. అవేంటో చూద్దాం. మొదటి స్థానంలో ధనుష్ ఉన్నాడు. మారన్, నేనే వస్తున్నా, నెట్ ఫ్లిక్స్ గ్రే మ్యాన్, తిరులో నటనకు గాను సింహాసనం దక్కింది. సెకండ్ ప్లేస్ అలియా భట్ కు దక్కింది. బ్రహ్మాస్త్ర, గంగూబాయి, డార్లింగ్స్, ఆర్ఆర్ఆర్ విజయాలతో తన గ్రాఫ్ మాములుగా లేదు
అనూహ్యంగా ఐశ్వర్య రాయ్ కి పొన్నియన్ సెల్వన్ 1కు గాను ఈ జాబితాలో చోటు దక్కడం ట్విస్టు. ఆర్ఆర్ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులర్ అయిన రామ్ చరణ్ మీద ఆచార్య డిజాస్టర్ ప్రభావం పడలేదు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమంతా అయిదో ప్లేస్ ని తీసుకుంది. చేసింది విక్రమ్ వేదా ఒకటే అయినా హృతిక్ రోషన్ మరోసారి జట్టు కట్టాడు. కియారా అద్వానీ సెవెంత్ ప్లేస్ లో ఉంది . భూల్ భూలయ్యా 2 బ్లాక్ బస్టర్, జగ్ జగ్ జియో విజయాలు తన ఖాతాలో ఉన్నాయి. కొమరం భీం గా అదరగొట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఎనిమిది, పుష్ప 1తో రష్యా దక్కా వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తొమ్మిది ప్లేసులు దక్కాయి
కెజిఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ అయినా అంతర్జాతీయంగా ఎక్కువ రీచ్ చేరకపోవడంతో యష్ టెన్ తో సరిపెట్టుకున్నాడు. ఈ ఐఎండిబి లిస్టులో మన సౌత్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం ఏడుగురు తమిళ తెలుగు ప్రతినిధులు కావడం గమనార్హం. ఇప్పటికే మన సక్సెస్ చూడలేక రగిపోతున్న బాలీవుడ్ బ్యాచ్ కి ఇప్పుడీ ప్రకటన గాయం మీద కారం చల్లినట్టే. రాబోయే రోజుల్లో మన ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. కార్తికేయ 2 లాంటి సినిమాలతో నిఖిల్ లాంటి చిన్న హీరోలు సైతం గుర్తింపు తెచ్చుకుంటున్న ట్రెండ్ లో హిందీ పరిశ్రమ స్థానం మన తర్వాతే ఉంటూ మనల్నే అనుసరించే రోజులు దగ్గరలో ఉన్నాయి