iDreamPost
android-app
ios-app

అల్లోప‌తి వ‌ర్సెస్ ఆయుర్వేదం : రాందేవ్ బాబా ఇప్పుడేం చేస్తారో?

అల్లోప‌తి వ‌ర్సెస్ ఆయుర్వేదం : రాందేవ్ బాబా ఇప్పుడేం చేస్తారో?

క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల్లోలాన్నే కాదు.. కొత్త క‌ల‌హాల‌నూ తెస్తోంది. కేంద్ర‌, రాష్ట్రాల ప్ర‌భుత్వాలు, ఆస్ప‌త్రులు, ప్ర‌జ‌ల మ‌ధ్యే కాదు.. వైద్య శాస్త్రాల మ‌ధ్య కూడా చిచ్చుపెడుతోంది. అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు రాందేవ్ బాబా చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల వేడి కొన‌సాగుతూనే ఉంది. ఆయుర్వేద వైద్య విధానం వర్సెస్ అల్లోపతి వైద్యం అన్నట్లుగా రాందేవ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. రాజ‌కీయ నాయ‌కులు కూడా రంగంలోకి దిగారు.

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కూడా రాందేవ్ బాబాపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. దీంతో రాందేవ్ బాబా క్ష‌మాప‌ణ‌లు చెబుతూనే.. కొన్నింటికి అలోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలు సంధించ‌డం మ‌రింత వివాదం రేపింది.

బీపీ, మధుమేహానికి అలోపతిలో ఎందుకు శాశ్వత చికిత్స లేదు? థైరాయిడ్‌, ఆర్థరైటిస్‌, కోలిటిస్‌, ఉబ్బస వ్యాధుల శాశ్వత నివారణకు ఫార్మా కంపెనీల వద్ద మందులు ఉన్నాయా?, కాలేయ వ్యాధి చికిత్సకు, గుండెలో అడ్డంకులకు, కొవ్వుకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?, పార్శపు నొప్పి, మతిమరుపు, పార్కిన్‌సన్‌ వ్యాధులను ఏ విధంగా నయం చేస్తారు?, అలోపతి సర్వగుణ సంపన్నమని భావించకూడదు. ఎందుకంటే దీని వయసు 200 ఏళ్లే..వీటితోపాటు మరిన్ని ప్రశ్నలనూ సంధించారు. అల్లోపతికి కేవలం 2 వందల ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని.. ఆయుర్వేదానికి శతాబ్దాల చరిత్ర ఉందని రాందేవ్ బాబా గుర్తు చేశారు. అల్లోపతి అన్నింటికీ సమాధానమైతే..వైద్యులకు ఎటువంటి రోగమూ రాకూడదని రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు.

అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు బాబా రాందేవ్‌పై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ), ఉత్తరాఖండ్‌ రూ.1,000 కోట్లకు పరువునష్టం దావా వేసింది. 15రోజుల్లోగా ఆయన లిఖిత పూర్వక క్షమాపణలు తెలపాలని, లేకుంటే వెయ్యి కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపింది. బాబా రాందేవ్‌పై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి, సీఎ్‌సకు లేఖ రాశామని ఐఎంఏ(ఉత్తరాఖండ్‌) సెక్రటరీ అజయ్‌ ఖన్నా చెప్పారు. కాగా, బాబా రాందేవ్‌ సంస్థ ఉత్పత్తి చేసిన కరోనిల్‌ యాంటీ కొవిడ్‌ కిట్‌ అద్భుత విజయంతో అల్లోపతి వైద్యుల్లో ఆందోళన మొదలైందని, అందుకే ఈ అంశాన్ని వారు పక్కదారి పట్టిస్తున్నారని పతంజలి ఆయుర్వేద సంస్థ చైర్మన్‌ ఆచార్య బాలకృష్ణ మండిపడ్డారు. ఇలా అల్లోప‌తి, ఆయుర్వేదం మ‌ధ్య క‌రోనా వివాదానికి కార‌ణ‌మైంది.