ములాయం సింగ్ యాదవ్ కి అస్వస్థత

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (80) బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను లక్నో నగరంలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆయన ఉదరకోశ సమస్య, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని చికిత్స తర్వాత కోలుకున్నట్లు మేదాంత ఆసుపత్రి డైరెక్టరు,డాక్టర్ రాకేష్ కపూర్ తెలిపారు. అనారోగ్యముతో బాధపడుతున్న ములాయంకు అన్ని రకాల వైద్యపరీక్షలు చేశామని డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు. ప్రస్తుతం ములాయం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, అతను బాగానే ఉన్నాడని వైద్యులు ప్రకటించారు.

ములాయంను పరామర్శించేందుకు అతని సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్ లు ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం ములాయం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు. 

ఆయన అనారోగ్యం గురించి సమాచారం తెలిసిన వెంటనే ములాయం కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, అతని తమ్ముడు, మాజీ రాష్ట్ర మంత్రి శివపాల్ సింగ్ యాదవ్, పార్టీ నాయకులు గురువారం ఆసుపత్రిలో ఆయనను సందర్శించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నట్లు ఓ పార్టీ ప్రతినిధి తెలిపారు.

Show comments