iDreamPost
android-app
ios-app

పెళ్లి కాని జంటలకు పుట్టిన పిల్ల‌లు ఎందుకు బాధపడాలి? వాళ్ల‌కూ పూర్వీకుల ఆస్తిపై హక్కు

  • Published Jun 16, 2022 | 5:43 PM Updated Updated Jun 16, 2022 | 5:43 PM
పెళ్లి కాని జంటలకు పుట్టిన పిల్ల‌లు ఎందుకు బాధపడాలి? వాళ్ల‌కూ పూర్వీకుల ఆస్తిపై హక్కు

సుప్రీం కోర్టు చాలామంది సంప్ర‌దాయ కుటుంబాలు మాట్లాడుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని అంశంలో సంచ‌ల‌నాత్మ‌క తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకోలేదు. సహజీవనం ద్వారా సంతానం పొందిన హిందూ జంటల పిల్లలకుకూడా, కుటుంబ ఆస్తిలో వాటా ఉంటుంద‌న్న‌ది సుప్రీం తీర్పు. జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్ ఈ తీర్పునిచ్చారు. ఇప్ప‌టిదాకా పెళ్లికాకుండా సహజీవన జంట‌ పిల్ల‌ల‌కు కుటుంబ ఆస్తిలో వాటా లేద‌న్న కేరళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు స‌వ‌రించింది.

ఇప్పుడున్న కుటుంబ వ్య‌వ‌స్థ‌లో, అక్ర‌మ‌సంతానానికి ఆస్థిలో హ‌క్కులేద‌ని ఎక్కువ‌మంది భావిస్తారు. స‌హ‌జీవనానికి ఇంకా స‌మాజ ఆమోదంలేదు.

పిటిషన్‌లో పేర్కొన్న మ‌గాడు, మహిళ చాలా కాలంగా సహజీవనం చేసినట్లు ఆధారాలున్నాయి. వాళ్లు పెళ్ల‌యిన‌వాళ్లులాగే సంబంధాన్ని సాగించారు. అందువల్ల వాళ్ల పిల్ల‌ల‌కు, తాత‌ల‌నాటి ఆస్తిలో న్యాయమైన వాటా లభిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. స‌హ‌జీవ‌న జంట‌ల‌కు భ‌రోసానిచ్చింది.

నిజానికి, కేరళలోని ఈ కేసుపై ,పెళ్లి లేకుండా కలిగిన పిల్ల‌ల‌కు ఆస్తిపై హక్కు ఉంటుందని దిగువ న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. హైకోర్టు మాత్రం కింది కోర్టు తీర్పును కొట్టివేసింది. సుప్రీంకోర్టు మాత్రం దిగువ కోర్టు ఇచ్చిన తీర్పునే స‌మ‌ర్ధించింది.

కట్టుకండి ఇడతిల్ కన్రన్ వైద్యర్‌కు ఆస్తి ఉంది. ఆయనకు నలుగురు పిల్లలు. దామోదరన్, అచ్యుతన్, శేఖరన్, నారాయణన్. శేఖరన్ కుర్ర‌వ‌య‌స్సులోనే చ‌నిపోయాడు. నారాయణన్‌కు ఒక కూతురు. ఆమెకు పిల్ల‌లు లేరు. ఆమె కూడా చ‌నిపోయింది. అచ్యుతన్‌కు కరుణాకరన్ అనే కొడుకు ఉన్నాడు

దామోద‌ర‌న్ చిరుత‌కుట్టితో స‌హ‌జీన‌వం చేశాడు. ఇప్పుడు ఆ జంట కొడుకు, మ‌న‌వ‌డు ఇద్ద‌రూ ఇడతిల్ కన్రన్ వైద్యర్ ఆస్తితో సగం వాటా తమకు రావాలని కోర్టులో కేసువేశారు. కాని దామోదరన్, చిరుతకుట్టి ల వివాహం చెల్లుబాటు కాదు. కాబ‌ట్టి ఉమ్మడి భూమిలో వాటా ఇవ్వ‌లేమ‌ని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. పిటీష‌నర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. త‌మ త‌ల్లిండ్రులు వివాహితులుగానే కొన‌సాగార‌ని కొడుకు ఆధారాల‌ను చూపించాడు.

సాక్ష్యాల‌ను ప‌రీక్షించిన సుప్రీం, దామోదరన్, చిరుతకుట్టి అనే ఈ ఇద్దరు కలిసి ఉన్నారనే నమ్ముతున్నట్లు చెప్పింది. వారిద్దరూ వివాహం చేసుకోలేదని నిరూపించడంలో ప్రతివాదులు విఫలమయ్యారని కోర్టు స్ప‌ష్లం చేసింది..

దామోదరన్, చిరుతకుట్టి భార్యాభర్తల్లా బ‌తికిన‌ట్లు సాక్ష్యాధారాలున్నాయి కాబ‌ట్టి ఆస్తిలో వాటానిచ్చింది సుప్రీం. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన‌ తీర్పు, పిల్లల హక్కులను గుర్తించింద‌ని నిపుణులు అంటున్నారు. ఇలాంటి తీర్పు ఇదే మొద‌టిసారి కాదు. అక్రమ సంతానం అనిపించుకున్న వారికీ ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కూడా. అందువ‌ల్ల ఇది పాత తీర్పు. కాక‌పోతే పెళ్లికాకుండా చాలా జంట‌లు స‌హ‌జీవ‌నం చేస్తున్నాయి. వాళ్ల భాగ‌స్వామికి, వాళ్ల‌కు పుట్టే పిల్ల‌ల‌కు న్యాయ‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ గురించి చాలా సందేహాలున్నాయి. సుప్రీం తీర్పుతో స‌హ‌జీవ‌నంలో ఉన్నవారికి పుట్టిన బిడ్డకు, జీవితంపై న‌మ్మ‌కం వ‌స్తుంది.

హిందూ వారసత్వ చట్టంలో, సొసైటీ కాస్త త‌క్కువ‌గా చూసే అక్రమ సంతానంగా చెప్పేవారికీ, ఆస్తి హక్కులు కల్పించే నిబంధన ఉంది. హిందూ వారసత్వ చట్టం ప్ర‌కారం, అలాంటి పిల్లలకు చ‌ట్ట‌ప‌రంగా ఆస్తితోపాటు ఇతర హక్కులు కల్పించాలి.

పేరేంట్స్ పెళ్లి చేసుకోకుండానే పిల్ల‌ల‌ను క‌న్నారు. ఇందులో పిల్లల తప్పు ఏంటి? సుప్రీం నిర్ణ‌యంతో వాళ్ల‌కూ హ‌క్కులు వ‌స్తాయి. ఇక‌పై స‌మాజానికి అక్ర‌మ‌సంతం, స‌హ‌జీన‌వం సంతానంపై త‌మ ధోర‌ణిని మార్చుకోవాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది.