Idream media
Idream media
కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. ఆ తర్వాత కూడా పొడిగించాలా? లేదా? అన్న విషయంపై కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. దాదాపుగా లాక్‌డౌన్ కొనసాగింపునకే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఒక వేళ లాక్‌డౌన్ ఎత్తేస్తే పరిస్థితి ఏంటి? రోజురోజుకూ దేశంలో కేసులు రెట్టింపు అవుతున్న దశలో ప్రభావం ఎలా ఉంటుంది? అన్న దానిపై జాతీయ వైద్య పరిశోధన మండలి ఒక అధ్యయనం చేసింది. ఇందులో పలు భయంకర వాస్తవాలు వెల్లడయ్యాయి. లాక్‌డౌన్ లేకపోవడం, భౌతిక దూరం పాటించకపోతే ఒక కరోనా వ్యాధికి గురైన వ్యక్తి నుంచి నెల రోజుల్లో దాదాపు 406 మందికి ఇది వ్యాపిస్తుందని పేర్కొంది.
దీన్ని బట్టి కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఆర్థికంగా, వైద్య పరంగా ఎంతో ముందంజలో ఉన్న చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, లండన్ లాంటి దేశాలే కరోనా ధాటికి విలవిల్లాడుతున్నాయి. అత్యధిక జనసాంద్రత కలిగిన మన దేశంలో ఇది విస్తృతమైతే అడ్డుకోవడం అసంభవం. అందుకే మనలాంటి దేశంలో కరోనా అడ్డుకట్టకు ఉన్న ఏకైక ఆయుధం లాక్‌డౌన్, భౌతిక దూరం పాటించడమే. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు కూడా మొన్న విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ప్రధాని మోదీతోనూ ఇదే విషయాన్ని తాను చెప్పానని వివరించాడు. దాదాపు 90 శాతం రాష్ట్రాలు లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి కేంద్రం మదిలో ఏముందో తెలియాల్సి ఉంది.
బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో 773 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 32 మరణించారు. మొత్తంగా దేశంలో పాజిటివ్‌ల సంఖ్య 5,194కు చేరాయి.