Idream media
Idream media
పదవి కోసం, అధికారం కోసం నేతలు.. గ్రామాల్లో గ్రూపులు ప్రోత్సహించేవారు. అన్నదమ్ములు, బంధువులే శత్రువులుగా మారిన రోజులున్నాయి. దశాబ్ధం కిందట ఉన్న స్థాయిలో ప్రస్తుతం గ్రామాల్లో గ్రూపులు, ప్రజల మధ్య వివాదాలు లేవనే చెప్పాలి. నేతలు తమ స్వార్థం కోసం చేసిన రాజకీయాలను, తాము కొట్టుకుంటుండగా.. ఇరు పార్టీలకు చెందిన నేతలు సఖ్యతగా ఉండడం ప్రజలు గమనించడం, చదవుకున్న వారి శాతం పెరగడం వల్ల ఈ తరహా రాజకీయాలు గ్రామాల్లో దాదాపు కనుమరుగయ్యాయి. అయితే ఇంకా అక్కడక్కడ నాటి ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ గ్రామ స్థాయి నేతల హత్యలే ఇందుకు నిదర్శనం.
పంచాయతీ సర్పంచ్ పదవీ పంపకంలో ఏర్పడిన వివాదం.. అనంతరం పెద్దదై హత్యలకు దారితీసిందని తెలుస్తోంది. కారణాలు ఏమైనా ఇలాంటి ఘటనలను ఎవరూ హర్షించరు. సమాజం ఒప్పుకోదు. చట్టం శిక్షించకుండా మానదు. అయితే సదరు ఘటనను కూడా బడా నేతలు తమ రాజకీయాలకు వాడుకోవడమే ఇక్కడ అభ్యంతరకరం. ఆ క్రమంలో నేతలు విచక్షణ మరచి మాట్లాడుతుండడం ఆశ్చర్యంగా ఉంది.
కర్నూలు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడు.. ప్రభుత్వం, పోలీసులను నిందించారు. నష్టపోయిన వారు ఇలా మాట్లాడడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించడం అభ్యంతరకరం. ఇలాంటి హెచ్చరికలు ఈ రెండేళ్లలో టీడీపీ నేతలు పలుమార్లు చేశారు. అయితే ఆయా సందర్భాలు వేరు. ఇక్కడ హత్యలు జరిగాయి. ఇప్పుడు కూడా అన్నీ రాసిపెట్టుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. అంటే అర్థం ఏమిటి..?
టీడీపీ అధికారంలోకి వస్తే.. వైసీపీ నాయకులను హత్యలు చేయిస్తారా..? ఇప్పుడు ఇద్దరు చనిపోయారు కాబట్టి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామానికి చెందిన వైసీపీ నేతలు నలుగురుని హతమారుస్తారా..? హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తారా..? ఆలోచించి మాట్లాడారా..? లేక ఆవేశంలో మాట్లాడారో గానీ అచ్చెం నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. ఈ తరహాలో మాట్లాడడం వల్ల ప్రత్యర్థులను ఇంకా రెచ్చగొట్టిన వారవుతారు. అధికారంలో ఉన్న వారిని రెచ్చగొట్టడం వల్ల జరిగే ఘటనలను తిరిగి తమ రాజకీయాలను వాడుకోవాలన్న ఆలోచన టీడీపీ నేతలకు ఉందనే అనుమానం అచ్చెం నాయుడు చేసిన వ్యాఖ్యలతో కలగకమానదు.
Also Read : టీడీపీకి అక్కడ కూడా తలనొప్పులే, వైస్సార్సీపీ కి సంపూర్ణ ఆధిక్యం