Idream media
Idream media
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయాడు. దేశంలోనే పొలిటికల్ స్త్రాటజిస్ట్ గా మంచి పేరున్న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా ప్రశాంత్ కిషోర్ విషయంలో ఆలోచనలో పడింది. దేశంలో వరుసగా పరాజయాలను చవి చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ని ట్రాక్ లో పెట్టి 2024 ఎన్నికల టార్గెట్ గా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని, తన ఆలోచనలను అమలుచేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టటం సాధ్యమవుతుందని పీకే సూచిస్తున్నారు.
నాలుగురోజుల్లో మూడుసార్లు సోనియాగాంధీతో భేటీ అయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి,పార్టీని విజయపథంలో నడిపించడానికి సుముఖంగా ఉన్నారు. ఇక దీనిపై సోనియాగాంధీ పార్టీ ముఖ్యనేతలతో తర్జనభర్జనలు జరుపుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా భావించి కాంగ్రెస్ పార్టీ నేతలు కెసిఆర్ ను, టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తమ పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి అన్నదానిపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు.
పార్టీని బలోపేతం చేయడానికి వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం లేకపోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర నాయకులకు మాత్రం ఈ ఎపిసోడ్ పెద్ద తలనొప్పిగా తయారైంది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్న దానిపై అందరిలో టెన్షన్ పట్టుకుంది. కేంద్రంలో ఉన్న బిజెపి ని ఢీ కొట్టాలంటే ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవాలని ప్రశాంత్ కిషోర్ అధిష్ఠానానికి సూచిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు ఉండబోతాయో అన్నది అర్ధంకాకుండా ఉంది.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరితే టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందా అనే అనుమానం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఈ విషయంలో క్లారిటీ కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో రాహుల్ గాంధీ టూర్ తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న నేపథ్యంలో ఈ విషయంపై స్పష్టమైన క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నారు. పార్టీ నేతలకు అటు ప్రజలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించేలా చూడాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారు.