iDreamPost
iDreamPost
పార్టీపరంగా జరిగే అన్ని ఎన్నికల్లోనూ పార్టీలకు ఎన్నికల గుర్తులే కీలకం. పోలింగులో వినియోగించే ఈవీఎంలలోనైనా బ్యాలెట్ పేపర్లలోనైనా అభ్యర్థి పేరు, ఎన్నికల గుర్తే ఉంటాయి తప్ప.. పార్టీల పేర్లు ఉండవు. ఆ గుర్తులను బట్టే ప్రజలు తమకు ఇష్టమైన పార్టీకి ఓటు వేస్తారు. ఇంత కీలకమైంది కనుకే పార్టీలు తమ ఎన్నికల గుర్తులను విస్తృతంగా ప్రచారంలో పెట్టి.. ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయేలా చేస్తుంటాయి. తమ ఎన్నికల గుర్తులకు దగ్గరి పోలికలున్న గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయిస్తే అభ్యంతరం చెబుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో జనసేన నిలబడితే ఆ పార్టీ అభ్యర్థికి ఎన్నికల గుర్తే పెద్ద సమస్యగా, మైనస్ గా మారనుంది. ఇంతవరకు ఆ పార్టీ ఉపయోగించిన గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం జనసేన నుంచి తప్పించి ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడమే దీనికి కారణం.
Also Read : బద్వేల్ లో ప్రతిపక్షాలు ఎక్కడ?
ముందు ఎవరు కోరితే వారికే..
జనసేన ఏర్పాటైన తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల బరిలోకి దిగి తాత్కాలికంగా ఎన్నికల కమిషన్ నుంచి గాజు గ్లాసును కామన్ గుర్తుగా పొందింది. దాంతో ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులందరూ గాజు గ్లాసునే ఉమ్మడి గుర్తుగా ఉపయోగించారు. గాజు గ్లాసు అంటే జనసేన గుర్తు అని జనాల్లో నాటుకుపోయింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో నిర్దేశిత ఓట్లు, సీట్లు సాధించడంలో జనసేన విఫలం కావడంతో ఆ పార్టీని కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే పరిగణించిన ఎన్నికల సంఘం కామన్ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును తొలగించి ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది.
అంటే ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర, గుర్తింపు లేని పార్టీల అభ్యర్థుల్లో ఎవరు ముందు కోరితే వారికి గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయిస్తారు. జనసేనకు వేరే గుర్తు ఇస్తారు. వాస్తవానికి ఏప్రిల్ లో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సమయంలోనే గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చారు. దానిపై అప్పట్లో జనసేన తరపున అభ్యంతరం తెలిపినా.. ఈసీ అధికారులు తిరస్కరించారు. అయితే ఆ ఎన్నికలో జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల ఇబ్బంది లేకపోయింది.
Also Read : వైఎస్సార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2001 బద్వేల్ ఉప ఎన్నిక గురించి తెలుసా..?
పోటీ చేస్తే గుర్తుతో ఇబ్బందే..
బద్వేలు ఉప ఎన్నికలో పోటీపై జనసేన ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. తన మిత్రపక్షం బీజేపీతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడుతుందా లేకపోతే రహస్య మిత్రపక్షమైన టీడీపీతో లోపాయికారీగా అంటకాగుతుందో తెలియదు. మూడు రోజుల క్రితం పవన్ మంగళగిరి వచ్చినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెళ్లి కలిశారు. బద్వేలు ఉప ఎన్నికలో పోటీపై చర్చలు జరిపారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసినందున బద్వేలులో జనసేన పోటీ చేయాలని ఆ చర్చల్లో సోము వీర్రాజు ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారు అని మాత్రమే చెప్పారు. జనసేన నుంచి మాత్రం ఎటువంటి స్పష్టత రాలేదు.
నామినేషన్ల ఘట్టం మొదలై రెండు రోజులు అయ్యింది. పోటీ విషయాన్ని.. అభ్యర్థిని తేల్చడం ఆలస్యం అయ్యే కొద్దీ ఆ పార్టీకే నష్టం. ఈ లోపు నామినేషన్లు వేసిన ఇతర అభ్యర్థులు ఎవరైనా గాజు గ్లాసు గుర్తు కోరుకుంటే నిబంధనల ప్రకారం వారికే కేటాయిస్తారు. అప్పుడు జనసేన వేరే కొత్త గుర్తుతో పోటీ చేయాల్సి ఉంటుంది. గాజు గ్లాసు జనసేన గుర్తు అని బాగా ప్రచారం అయినందున.. జనసేనకు వేయాలనుకున్నవారిలో చాలామంది తెలియక గాజు గ్లాసుపై ఓటు ముద్ర వేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తామన్న ఆశలు లేని జనసేనకు దక్కాల్సిన కొద్దిపాటి ఓట్లలోనూ కోత పడే అవకాశం ఉంది.
Also Read : కులానికి పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్.. అసలు లక్ష్యం ఏమిటి..?