Idream media
Idream media
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ పనిలో పడ్డాయి. అయితే ఏ దేశం కూడా ఒక నిర్థిష్ట సమయం చెప్పలేకపోతుంది. ఒక్కో దేశం ఒక్కో రకంగా స్పందిస్తుంది. ఎక్కువ దేశాలు ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కోన్నాయి. డబ్ల్యుహెచ్ఓ కూడా దాదాపు అదే పేర్కొంది. అయితే భారత్‌లో మాత్రం ఆగస్టు 15 కల్లా తీసుకొస్తామని ఐసిఎంఆర్ పేర్కొంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పేరుతో దేశంలో బాబా రామ్‌దేవ్, తదితరులు హడావుడి చేసి విమర్శలకు గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఐసిఎంఆర్ చేసిన ప్రకటన విమర్శలకు గురైంది.
ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి ట్రయల్స్ ప్రారంభం అవ్వకుండానే, ఆగస్టు 15లోపు కోవిడ్ వ్యాక్సిన్ విడుదల చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) చేస్తున్న హడావుడి ఆరోగ్య రంగ నిపుణులను, యావత్ వైద్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది ‘అనైతికం’ అని పలువురు పేర్కొన్నారు. దీనిపై సామాజిక మీడియాలోనూ దుమారం రేగుతున్నది. ”సైన్స్‌ను రాజకీయం శాసిస్తోంది” అన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
ఈ వివాదానికంతటికీ కేంద్ర బిందువు ఈనెల 3న ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ 12 ఆస్పత్రులకు రాసిన లేఖ. త్వరితగతిన క్లినికల్ ట్రయల్స్, వాటి ఆమోదం పొందేలా చూడాలని, ఈ ఆదేశాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని, వ్యాక్సిన్ ప్రభుత్వానికి ”అత్యంత ప్రాధాన్యత” అని లేఖలో పేర్కొన్నారు. ”అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని ఆగస్టు 15 నాటికి ప్రజారోగ్యం కోసం వ్యాక్సిన్‌ను విడుదల చేయాలని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
మరోవైపు.. ఐసిఎంఆర్, హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ కోవాక్సిన్‌కు మానవ ట్రయల్స్ కోసం జూన్ 29 నుంచి మాత్రమే అనుమతి లభించింది. అంటే క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ విడుదలకు కేవలం నెలన్నర రోజుల మాత్రమే వ్యవధి ఉంది. ఆరు మాసాలు పట్టే ట్రయల్స్‌ను నెల రోజుల్లో పూర్తి చేయాలని చూడడమే తప్పు అని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి సుజాతా రావు దీనిపై స్పందిస్తూ ”వ్యాక్సిన్ బయటకు వచ్చే ప్రక్రియ గురించి డిజికి ఎవరో ఒకరు వివరించాలి. భారత బయోటెక్‌కు ఫేజ్ 1, 2కే అనుమతి లభించింది. మూడవ దశ పూర్తికావడానికి కనీసం 4 నెలలు సమయం పడుతుంది. ఆరు వారాల్లోనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఐసిఎంఆర్ దగ్గర మంత్రదండం ఏమైనా ఉందా” అని ప్రశ్నించారు. అలాగే, క్లినికల్ ట్రయల్స్ దశ దాటకుండానే వ్యాక్సిన్ విడుదలకు తొందరపడ్డంలో వైద్య విలువలను ప్రముఖ వైద్యులు, పరిశోధకులు, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బయోటెక్స్ మాజీ అధ్యక్షులు అనంత భన్ పేర్కొన్నారు.
ఆ లేఖ ప్రకారమే వ్యాక్సిన్ ప్రీ-క్లినికల్ అభివృద్ధి దశలో ఉందని చెబుతున్నారు. మరి ఏ విధంగా క్లినికల్ ట్రయల్స్ జులై 7 నుంచి ప్రారంభమవు తాయి?, ఆగస్టు 15న ఎలా విడుదల చేస్తారు? కేవలం ఒక నెల కన్నా తక్కువ వ్యవధిలోనే వ్యాక్సిన్ పరీక్షలు పూర్తి చేస్తారా అని అనంత భన్ ప్రశ్నించారు. క్లినికల్ ట్రయల్ ప్రదేశాలను ఎంచుకోవడంపై ప్రమాణాలను కూడా ఆయన ప్రశ్నించారు. వీటిలో కొన్ని చిన్ని ఆస్పత్రులు కూడా ఉన్నాయని అన్నారు.
ఎంపిక చేసిన 12 ఆస్పత్రులపై రాజకీయ వేత్తలు, ఆరోగ్య ఉద్యమ వేత్తలు కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక వార్తా సంస్థ కథనం ప్రకారం క్లినికల్ ట్రయల్ రిజస్ట్రరీ ఆఫ్ ఇండియాకు భారత బయోటెక్ స్వయంగా తెలిపిన సమాచారం ప్రకారం ట్రయల్స్ కాల వ్యవధి ఒక సంవత్సరం మూడు నెలలు పడుతుంది. ట్రయల్స్ ప్రారంభం కాకుండానే వ్యాక్సిన్ మార్కెట్‌లోకి అందుబాటు గురించి ప్రకటనలు రావడం ఎప్పుడూ వినలేదు. కనలేదని ప్రముఖ అంటురోగ వైద్య నిపుణులు తన్మరు మహపాత్ర పేర్కొన్నారు.
కోవిడ్-19కు ఈ ఏడాదిలో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఊహించవద్దని సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) హైదరాబాద్ డైరెక్టర్ రాకేష్ కె మిశ్రా తెలిపారు. వ్యాక్సిన్ తయారీ క్లినికల్ ట్రయల్స్, డెటా పరీక్షల్లో అనేక ప్రక్రియలు ఉంటాయని చెప్పారు. ఐసిఎంఆర్ లేఖ అంతర్గత వినియోగం కోసమేనని, క్లినికల్ హ్యుమన్ ట్రయల్స్‌కు సిద్ధం చేయడం కోసం ఆస్పత్రులపై ఒత్తిడి తీసుకునిరావడం ఈ లేఖ లక్ష్యమని చెప్పారు. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే వ్యాక్సిన్ విడుదలకు ఆరు నుంచి ఎనిమిది మాసాలు పడుతుందని అన్నారు. పరీక్ష అంటే ఒక రోగికి ఔషధం ఇచ్చి కోలుకున్నారో లేదో చూడ్డం లాంటిది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆగస్టు 15లోపు కోవిడ్ వ్యాక్సిన్ విడుదలకు ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ 12 ఆస్పత్రులకు, వైద్య సంస్థలకు రాసిన లేఖపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆ సంస్థ దీనిపై శనివారం వివరణ ఇచ్చింది. ప్రపంచ ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూనే 1,2 దశల పరీక్షలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. అయితే లేఖపై ఇంత వివరణ ఇచ్చిన ఐసిఎంఆర్ ‘ఆగస్టు15’ తేదీని ఎందుకు సూచించాల్సి వచ్చిందో స్పష్టత ఇవ్వలేదు.
ఆగస్టు 15 నాటికి కోవిడ్-19 కి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని భారత్ బయోటెక్‌ను కేంద్రం ఆదేశించినట్లు వార్తలొస్తున్నాయి. అసలు ఆ వ్యాక్సిన్ రావడానికి ఇంకా ఏయే దశలు పూర్తి కావాలో చూద్దాం. ఈ వ్యాక్సిన్ కి భారత్ బయోటెక్ ‘కోవ్యాక్సిన్’ అని పేరు పెట్టింది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్ మొదటి దశలో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి (ఐసిఎంఆర్) ఈ ట్రయల్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని 12 కోవిడ్ ఆస్పత్రులను ఆదేశించింది. దీనిని బట్టి ఇప్పటికే జరగవలసిన ముందస్తు ప్రయోగాలు – అంటే, జంతువుల మీద చేసే ప్రయోగాలతో సహా- అన్నీ పూర్తై వుండాలి. ఐతే అందుకు సంబంధించిన సమాచారమేదీ ప్రజలకు అందుబాటులో లేదు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌లో కొద్దిమంది ఎంపిక చేసిన ఆరోగ్యవంతులైన మానవులమీద ఈ వ్యాక్సిన్ ను ప్రయోగిస్తారు. వైరస్‌పై పోరాడేందుకు వీలుగా ఇమ్యూనిటీని ( రోగనిరోధకశక్తిని) ఈ వ్యాక్సిన్ ప్రేరేపించగలుగుతున్నదీ, లేనిదీ ఈ మొదటి దశలో నిర్ధారిస్తారు.
మొదటిదశ విజయవంతమైతే రెండో దశలో కొన్ని వందలమంది మీద ప్రయోగం జరుగుతుంది. వీరిలో అన్ని రకాల వారూ ఉంటారు. వ్యాధి తీవ్రంగా సోకినవారు కూడా ఉంటారు. వీరిలో సగం మందికి వ్యాక్సిన్ ఇస్తారు. తక్కిన సగం మందికీ ప్లేసిబో (రోగిమనసును సంతృప్తి పరచడానికి ఇచ్చే ఉత్తుత్తి మందు) ఇస్తా రు. ఎవరిమీద ఎటువంటి ప్రభావం ఉందో పరిశీ లిస్తారు. క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రజల సమాచారం నిమిత్తం ఇచ్చిన వివరాలను బట్టి ఈ రెండో దశలో వ్యాక్సిన్ ప్రయోగ ప్రభావాన్ని 14వ రోజున, 28వ రోజున, 104వ రోజున, 194వ రోజున పరిశీలిస్తారు. అంటే కనీసం ఆరు మాసాలు పడుతుంది. భారత్ బయో టెక్ స్వయంగా ప్రకటించిన దానిని బట్టి మొత్తం ఈ ప్రక్రియకు కనీసం 15 మాసాలు పడుతుంది. సాధారణంగా ఈ రెండో దశ తరువాత మూడో దశ కూడా ఉంటుంది.
ఈ దశలో ఇంకా ఎక్కువ మంది పై ప్రయోగం జరుగుతుంది. అందులోనూ జయప్రదమైతేనే వ్యాక్సిన్ తయారీకి లైసెన్స్ మంజూరు చేస్తారు. దాని తరువాత కూడా నాలుగోదశ ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు ఈ వ్యాక్సిన్ ప్రభావం ఏవిధంగా ఉందో పరిశీలన చేస్తారు. మరి కేంద్రం ఆగస్టు 15 కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని ఆదేశిస్తోంది. బహుశా 2021 ఆగస్టు 15ని దృష్టిలో ఉంచుకున్నారేమో లేక 2022 ఆగస్టా? దీనిపై ఐసిఎంఆర్ స్పష్టత ఇవ్వలేదు.
స్వాతంత్య్ర దినోత్సవ రోజైన ప్రధాని ప్రకటించేందుకు వీలుగా కరోనా వ్యాక్సిన్ ను త్వరితగతిన ఉత్పత్తి చేసేందుకు భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) చేస్తున్న హడావిడిని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆక్షేపించారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టే శక్తివంతమైన, సురక్షితమైన, అందరికీ అందుబాటులో ఉండే వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్నదని ఏచూరి అన్నారు. అయితే ఆర్డరేయడం ద్వారా శాస్త్రీయ అభివృద్ధిని ఎన్నడూ సాధించలేమన్నారు. ప్రధాని ప్రకటించడం కోసమని ఆరోగ్య, భద్రతా నియమాలను తుంగలో తొక్కి క్లినికల్ పరీక్షలను మమ అనిపించేందుకు అత్యున్నత వైద్య పరిశోధనా మండలి యత్నించడం ఎంతమాత్రం తగదన్నారు.
వైద్య సంస్థలను బలవంతం చేసి ఆరోగ్య భద్రతా నిబంధనలను పాతరేయడం వల్ల మానవాళి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ఏచూరి హెచ్చరించారు. తన ఆదేశాలను అనుసరించి నిర్దిష్ట గడువులోగా పరీక్షలు పూర్తి చేయకుంటే దానిని తీవ్రంగా పరిగణిస్తామనడం వైద్య సంస్థలను బెదిరించడం కాదా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని నిమ్స్ వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వ వైద్య సంస్థలను క్లినికల్ ట్రయల్స్ కోసం వాడుకుంటున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వ అనుమతి ఉందా? అని ఏచూరి ప్రశ్నించారు. ”ఈ ట్రయల్స్‌లో ఎంత మంది వైద్యులు పాల్గొంటున్నారు? ఆగస్టు 14 నాటికల్లా 1, 2, 3వ దశ పరీక్షలు, విశ్లేషణ పూర్తవుతాయా? స్వతంత్ర డేటా భద్రత పర్యవేక్షణ కమిటీ (డిఎస్‌ఎంసి)లో ఉన్న సభ్యులెవరు? వంటి కొన్ని కీలక ప్రశ్నలకు జవాబివ్వాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.
“రెగ్యులేటర్ డిసిజిఐ భద్రత, సమర్థత, సాక్ష్యాలను అంచనా వేయకుండా టీకా ప్రయోగ తేదీని ఐసిఎంఆర్ ఎలా నిర్ణయిస్తుందని తప్పు బట్టారు. ఒక ప్రయివేటు సంస్థ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ పరీక్షలను ఆదరాబాదరాగా పూర్తి చేయాలనడం ఎంతవరకు కరెక్టు? అని ప్రశ్నించారు. ఈ టీకా ఐసిఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చేత వేరుచేయబడిన ఎస్‌ఎఆర్‌ఎస్-సిఒవి-2 బిందువు నుంచి తీసుకో బడిందని, ఈ టీకా ప్రీలినికల్, క్లినికల్ డెవలప్‌మెంట్ కోసం ఐసిఎంఆర్, బిబిఐఎల్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని ఐసిఎంఆర్ ప్రకటించింది. క్లినికల్ పరీక్షలపై తాము వ్యక్తం చేసిన ఆందోళనలను గమనించకపోవడం తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు. ఈ ప్రాజెక్టు పట్ల అధిక ప్రాధాన్యతతో వ్యవహరించాలి. ఇచ్చిన కాలపరిమితులలో ఎటువంటి లోపం లేకుండా వ్యాక్సిన్‌ను రూపొందించాలి” అని పలు వైద్య సంస్థలు లేఖ రాశాయని పేర్కొన్నారు.