Idream media
Idream media
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలలలో జరగాల్సిన టీ-20 వరల్డ్‌కప్‌ని 2022కి వాయిదా వేయబోతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వర్గాల నుంచి వార్తలు వెలువడుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా సెప్టెంబరు 30 వరకు పర్యాటక వీసాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది.అలాగే ఐసీసీ టోర్నీలో పాల్గొనే 16 జట్లు అక్టోబరులో కంగారుల గడ్డపై కాలు పెట్టిన తర్వాత రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచాల్సి ఉంది. పైగా ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాలలో ప్రపంచకప్‌ని నిర్వహించడం కష్టమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చేతులెత్తేసింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన టీ-20 వరల్డ్ కప్‌ను 2022కు వాయిదా వేస్తూ రీ షెడ్యూల్ చేయాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీ-20 వరల్డ్ కప్-2020 వాయిదా పడితే వచ్చే ఏడాది ఫిబ్రవరి,మార్చి నెలలో నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. కానీ ఐసీసీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2021 అక్టోబర్‌లో భారత్ వేదికగా టీ 20 ప్రపంచ కప్ పోటీలు జరగనున్నాయి.
ఒకవేళ పరిస్థితులు అనుకూలించి వచ్చే అక్టోబర్‌లో భారతదేశంలో ఐపిఎల్ జరిగితే, 6 నెలల వ్యవధిలో రెండు ఐపిఎల్‌ను,అలాగే 2021లో ఒకే ఫార్మేట్ యొక్క రెండు ప్రపంచ కప్‌లను ప్రసారం చేయడానికి బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఆందోళన చెందుతుంది.లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న మార్కెట్లు వాణిజ్య ప్రకటనల పరంగా సహకరించే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం.
ఇక ఐసీసీ నూతన షెడ్యూల్ ప్రకారం టీ-20 ప్రపంచ కప్‌కు 2021లో భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుండగా,2022లో ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత 2023లో భారత్ వన్డే ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.రేపు మే 28 న జరగనున్న ఐసిసి సమావేశంలో బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ కొత్త షెడ్యూల్‌నుఅంగీకరించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఐసీసీ రేపటి సమావేశం తర్వాతే స్పష్టత వస్తుంది.ఈ ఏడాది టీ-20 వరల్డ్‌కప్ వాయిదాపడితే ఐపీఎల్ పోటీలు అక్టోబర్,నవంబర్ మాసాలలో నిర్వహించాలని బీసీసీఐ ఆశిస్తోంది.