iDreamPost
iDreamPost
పార్టీ నాయకత్వ మార్పు, సమూల ప్రక్షాళన వంటి అంశాలపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెసులోని అసంతృప్త సీనియర్ నేతలకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు షాక్ ఇచ్చారు. పార్టీ నేతల డిమాండ్ మేరకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ప్రారంభమైంది. పార్టీ నేతలు రాహుల్, ప్రియాంకతోపాటు పార్టీ తీరుపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జీ 23 నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేసిన సోనియాగాంధీ మాట్లాడుతూ అసంతృప్త నేతలకు చురకలు పెడుతూనే పలు సూచనలు చేశారు..సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం తాత్కాలిగా అధ్యక్షురాలిగా ఉన్న తాను మీరంతా అనుమతిస్తే పూర్తిస్థాయి అధ్యక్షురాలిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించి బాంబ్ పేల్చారు. నాయకత్వ మార్పుల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు.
పార్టీలో మార్పులకంటే ఇవి ముఖ్యం
పార్టీలో మార్పులు అవసరమే.. సంస్థాగత ఎన్నికల ద్వారానే అది సాధ్యం అవుతుంది. కానీ సంస్థాగత మార్పుల కంటే పార్టీలో క్రమశిక్షణ, బీజేపీపై పోరాటం అంతకంటే ముఖ్యమని సోనియా వ్యాఖ్యానించారు. ముందు వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీకి తాను తాత్కాలిక అధ్యక్షురాలినేనని.. 2019 నుంచి తాను అలా కొనసాగుతున్న విషయం తనకు గుర్తు ఉందని సోనియా పరోక్షంగా జీ 23 నేతలకు చురకలు వేశారు. అక్కడితో ఆగకుండా మీరందరూ అనుమతిస్తే పూర్తిస్థాయి అధ్యక్షురాలిగా పని చేయడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలతో అధ్యక్ష ఎన్నిక ఇప్పట్లో ఉండదని స్పష్టమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
జీ 23 నేతలకు చురకలు
తన ప్రసంగంలో జీ 23 నేతల తీరుపై సోనియా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్కర్షగా, సూటిగా నేతలు చేసే సూచనలను ఆహ్వానిస్తానంటూనే గత కొన్నాళ్లుగా కొంతమంది నేతలు బయట ఏవేవో మాట్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విపరీత వ్యాఖ్యలతో రచ్చకెక్కుతుండటాన్ని తప్పు పట్టారు. నాయకత్వ మార్పు, సంస్థాగత ఎన్నికల విషయంలో సీడబ్ల్యూసీ సమావేశంలో, నాలుగు గోడల మధ్య జరగాల్సిన చర్చలను బయట మరో రకంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించడం విశేషం. కాగా పార్టీ అధ్యక్ష ఎన్నిక వచ్చే ఏడాది వరకు జరిగే అవకాశం లేదని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి వరకు కార్యవర్గ ఎన్నికలు జరువుకొంటూ వచ్చేసరికి ఆ సమయం పడుతుందంటున్నారు.
Also Read : Likhimpur Farmers Death -లిఖింపూర్ ఘటన : విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!