iDreamPost
android-app
ios-app

వరద సాయంపై జనంలో అసంతృప్తి

వరద సాయంపై జనంలో అసంతృప్తి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో వరద సాయం అధికార ప్రతిపక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. టీఆర్ఎస్ తో పాటు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వరద సాయం చుట్టూ పరస్పర విమర్శలు చేసుకున్నాయి. వరద సాయం కేవలం టీఆర్ఎస్ శ్రేణులకు మాత్రమే అందిందని ప్రతిపక్షాలు విమర్శిస్తే, బీజేపీ వల్లే వరద సాయం ఆగిపోయిందని టీఆర్ఎస్ ఎదురుదాడి చేసింది. గ్రేటర్ ఫలితాల తరువాత మరోమారు వరద సాయం చర్చకొచ్చింది.

హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 10వేల ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వచ్చింది. తొలిదశలో పలు ప్రాంతాల్లో వదర సాయాన్ని అందజేసింది. ఈ లోగా గ్రేటర్ ఎన్నికల నగారా మోగడంతో వరద సాయం నిలిచిపోయింది. వరద సాయం సాకుతో టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు పంపిణీ చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో వరద సాయాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో… బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాసిన లేఖ వల్లే వరద సాయం నిలిచిపోయిందని టీఆర్ఎస్ ఆరోపించింది. కాగా… టీఆర్ఎస్ ఆరోపణలపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. తన పేరుతో టీఆర్ఎస్ తప్పుడు లేఖను సృష్టించిందని బండిసంజయ్ ఆరోపించారు. తానే ఆ లేఖను రాశానని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో వరద సాయాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రయోగించింది.

ఈ నేపథ్యంలో ముంపుకు గురైన కుటుంబాలకు ఎన్నికల తరువాత వదర సాయాన్ని అందిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి మీ సేవా కేంద్రాల్లో వరద సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ వైఫల్యానికి వరద సాయంకూడా ఒక కారణమైందనే వాదన బలంగా ఉంది. బీజేపీ బలం పుంజుకున్న ప్రాంతాలు ఎక్కువగా వరద ముంపుకు గురైన ప్రాంతాలే కావడం గమనార్హం. ప్రజల్లో వరదసాయం అందలేదనే ఆగ్రహమే టీఆర్ఎస్ ఓటమికి కారణమైందనే అభిప్రాయాలు ఉన్నాయి.

గ్రేటర్ ఎన్నికల తరువాత తిరిగి వరద సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నగరంలో పలు మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. కానీ… వరద సాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి సైట్ ఓపెన్ కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ వరద సాయంపై క్లారిటీ ఇచ్చారు. వరద బాధితులెవరూ మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. వరద సాయం నేరుగా బాధితుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తెలిపారు. నేరుగా ఇంటింటికి తిరిగి భాదితుల వివరాలు సేకరిస్తామని, దృవీకరణ పూర్తయ్యాక నేరుగా వారి ఖాతాల్లో డబ్బును వేస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి సాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వరద సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.