iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ టార్గెట్ పూర్తి చేస్తుందా?

  • Published Aug 21, 2021 | 2:06 AM Updated Updated Aug 21, 2021 | 2:06 AM
హైదరాబాద్ టార్గెట్ పూర్తి చేస్తుందా?

సెకండ్ వేవ్‌ను దాదాపు దాటేశాం.. కరోనా కేసులు తగ్గుతున్నాయి.. వ్యాక్సినేషన్‌ జోరందుకుంది. దేశంలో 100 శాతం టీకాలు వేసిన తొలి నగరంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ నిలిచింది. ఇప్పుడు ఆ జాబితాలో చోటు సంపాదించేందుకు హైదరాబాద్‌ కూడా పోటీ పడుతోంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 18 ఏళ్లు పైబడిన వారికి 97 శాతం మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. రెండో డోస్‌ కూడా 35 శాతం మందికి వేసినట్లు చెబుతున్నారు. రెండు వారాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని టార్గెట్లు పెట్టుకున్నట్లు పేర్కొంటున్నారు. అయితే అధికారులు చెబుతున్నట్లుగా 97 శాతం మందికి తొలి డోసు వేశారా? 15 రోజుల్లో టార్గెట్‌ను పూర్తి చేస్తారా?

ఇప్పటిదాకా ఎంతమందికి వేశారంటే..

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 18 ఏళ్లు పైబడిన వాళ్లు 26,66,426 మంది ఉన్నారని, అందులో మొదటి డోస్‌ను 25,96,143 మందికి వేశామని, రెండో డోస్‌ను 9,23,040 మందికి వేశామని అధికారులు వెల్లడించారు. రోజూ 50 కేంద్రాల దగ్గర సగటున 15 వేల మందికి టీకాలు ఇస్తున్నామని, మరో 90 మొబైల్‌ వ్యాక్సిన్‌ వాహనాల ద్వారా మరో 20 వేల మందికి వేస్తున్నామని అంటున్నారు. అంటే ఆ లెక్కన హైదరాబాద్ పరిధిలో రోజూ 35 వేల మందికి అటుఇటుగా టీకాలు వేస్తున్నారు. వచ్చే నెల 9వ తేదీకల్లా నగరంలో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వాళ్లు చెబుతున్నారు. కానీ రోజుకు 35 వేల మందికి వేస్తూ పోతే.. టార్గెట్‌ ను చేధించడం కష్టమే. అందుకే మొబైల్‌ వ్యాక్సిన్‌ వాహనాలను 150కు పెంచనున్నట్లు పేర్కొంటున్నారు. ఆ లెక్కన మరో 13 వేల మందికి వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంది. మొబైల్‌ వాక్సినేషన్‌కు మంచి స్పందన వస్తోందని, ఇంటింటికీ తిరిగి 18 ఏళ్లు పైబడిన వారందరినీ గుర్తించాలని, వ్యాక్సినేషన్‌ను ఉద్యమంగా చేపట్టాలని అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు.

97 శాతం మంది వ్యాక్సిన్ వేశారా?

దేశంలో అధిక జన సాంద్రత గల మెట్రో సిటీల్లో హైదరాబాద్ ఒకటి. 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.09 కోట్లు కాగా, 2011 మార్చి లెక్కల ప్రకారం 3.52 కోట్లు. ఆ ప్రకారం ప్రస్తుత జనాభా 4 కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. ఇక 2011 లెక్కల ప్రకారం హైదరాబాద్ జనాభా 68 లక్షలు. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే కనీసం కోటి మంది జనాభా ఉండే అవకాశం ఉంది. కోటి మందిలో 70 శాతం దాకా 18 ఏళ్లు పైబడిన వాళ్లే ఉంటారు. అంటే 60 లక్షల నుంచి 70 లక్షల దాకా టీకా వేసుకునేందుకు అర్హులు. కానీ ప్రభుత్వ అధికారులు చెబుతున్న వ్యాక్సినేషన్ లెక్కలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. 26,66,426 మందికి మొదటి డోసు వేశారని చెబుతున్న అధికారులు.. ఇది హైదరాబాద్ జనాభాలో 97 శాతం అని అంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన సెటిలర్లు, వలస కార్మికులను పరిగణనలోకి తీసుకోలేదా? అని ప్రశ్న వినిపిస్తోంది.

వ్యాక్సిన్‌కు ఇక్కట్లు

ఆగస్టు నెల ప్రారంభం దాకా హైదరాబాద్ సహా తెలంగాణలో వ్యాక్సిన్ వేయించుకోవడం పెద్ద ప్రయాస. ఎక్కడ చూసినా ‘నో స్టాక్’.. ‘వ్యాక్సినేషన్‌కు హాలిడే’ బోర్డులు కనిపించేవి. కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్లినా ఇదే పరిస్థితి. చాలా మంది ఫస్ట్ డోసు వేయలేదు. సెకండ్ డోసు మాత్రమే వేస్తున్నామని చెబుతూ వెనక్కి పంపేశారు. కొందరికి వ్యాక్సిన్ వేయకముందే వేసినట్లు మెసేజీలు వచ్చాయి. మరికొందరికి అసలు మెసేజ్‌లే రాలేదు. ఇంకొందరికి వ్యాక్సిన్ వేసుకున్న నెల రోజులకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఫస్ట్ డోసు వేసుకున్న వాళ్లు సెకండ్ డోసు కోసం అదనంగా మరో నెల రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. టీకా కేంద్రంలో ఫస్ట్ డోసు వేసుకున్న మెసేజ్ చూపిస్తే తప్ప సెకండ్ డోసు వేయడం లేదని చెబుతున్నారు. హైదరాబాద్‌లో 100 శాతం వ్యాక్సిన్ వేశామని అధికారులు రేపు గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ వాస్తవ లెక్కలు వేరుగా ఉన్నాయన్నది మాత్రం నిజం.

Also Read : ఈ ‘బుల్లెట్టు బండి…’ పాట ఎందుకింత సంచలనం అయింది?