iDreamPost
android-app
ios-app

పదవుల పంట.. కారును గమన్యానికి చేర్చునా..?

పదవుల పంట.. కారును గమన్యానికి చేర్చునా..?

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇప్పటి వరకు మూడు ఉప ఎన్నికలు జరిగాయి. హుజురాబాద్‌ నాలుగోది. హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలకు భిన్నంగా హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నిక హుజురాబాద్‌ నియోజకవర్గ నేతలకు పదవుల పంట పండిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనను సవాల్‌ చేసిన ఈటల రాజేందర్‌ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో గులాబీ అధినేత కేసీఆర్‌ సామధానబేధదండోపాయాలను ప్రయోగిస్తున్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నిన్న బండ శ్రీనివాస్‌.. నేడు కౌషిక్‌ రెడ్డి..

తాజాగా హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కౌషిక్‌ రెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు కేసీఆర్‌. కౌషిక్‌ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. పది రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. చేరిన పది రోజుల్లోనే ఆయనకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కిందంటే అందుకు రాబోయే ఉప ఎన్నికే కారణం. గత నెలలో హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన బండ శ్రీనివాస్‌కు ఎస్పీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు గులాబీ బాస్‌. తెలంగాణ ఉద్యమం నుంచి బండ శ్రీనివాస్‌ ఈటల రాజేందర్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఏకంగా రాష్ట్ర స్థాయి పదవి బండ శ్రీనివాస్‌కు దక్కడం గమనార్హం.

Also Read : కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ సంతోష‌మే కానీ..?

మరికొన్ని పదవులు..

హుజురాబాద్‌ ఉప ఎన్నిక వేల పదవుల పండుగ ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి, ఎస్సీ సామాజికవర్గాల నేతలకు పదవులు దక్కగా.. నియోజవర్గంలోని బలమైన ఇతర సామాజికవర్గాల నేతలకు కూడా నామినేటెడ్‌ పదవులు దక్కుతాయనే ప్రచారం గులాబీ శిబిరంలో సాగుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన పొనగంటి మల్లయ్య గతంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. నియోజవకర్గంలోని అత్యధిక గ్రామాల్లో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఈయనకు ఏదో ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం సాగుతోంది.

గతంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌కు గట్టిపోటీ ఇచ్చిన వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు కూడా ఉప ఎన్నిక లోపు నామినేటెడ్‌ పదవి కట్టబెడతారనే చర్చ జరుగుతోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణమోహన్‌రావుకు 41,717 ఓట్లు వచ్చాయి. 56,752 ఓట్లు పొందిన ఈటల రాజేందర్‌ 15,035 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈటలకు అతి స్వల్ప మెజారిటీ ఇదే కావడం గమనార్హం. బీసీ ఉద్యమ నేతగా ఆర్‌ కృష్ణయ్యతో కలసి పని చేసిన కృష్ణమోహన్‌రావు గతంలో బీసీ కమిషన్‌ సభ్యుడుగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన్ను బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అందరినీ కవర్‌ చేసినట్లే…

మల్లయ్య, కృష్ణమోహన్‌రావులకు కూడా పదవులు కట్టబెడితే.. నియోజకవర్గంలో ప్రధాన సామాజికవర్గాల నేతలకు పదవులు దక్కినట్లే. ఇప్పటికే ఎస్సీ, రెడ్డి సామాజికవర్గాల నేతలకు పదవులు దక్కాయి. ఇక కాపు, బీసీ సామాజిక వర్గాల నేతలు లైన్‌లో ఉన్నారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వచ్చే వరకూ హుజురాబాద్‌ నియోజకవర్గంలో పదవుల పండుగ కొనసాగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ పదవుల పండుగ కారును గమ్యానికి చేర్చుతుందా..? లేదా..? వేచి చూడాలి.

Also Read : హుజూరాబాద్ లో అంతకుమించి..!