Idream media
Idream media
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనదేనా? వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కోట బద్దలు కొట్టి పార్టీ జెండా ఎగురవేస్తామంటున్న రేవంత్ రెడ్డి అక్కడెందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఓటమి ముందే తెలిసిపోయిందా లేక బాధ్యత దామోదర రాజనర్సింహకు అప్పగించడంతో తనపని అయిపోయిందని భావిస్తున్నారా? హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే.. మినీ సంగ్రామాన్ని తలపిస్తున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల మధ్యే పోటీ అంటే.. వాటిలో కాంగ్రెస్ పేరు వినిపించడం లేదు. కాదు.. కాదు.. వినిపించేలా ఆ పార్టీ నాయకులెవరూ పని చేయడం లేదు. దీంతో అభ్యర్థి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఎన్నికలంటే విజయావకాశాలు బేరీజు వేసుకోవాలి. ప్రత్యర్థి పార్టీల బలాబలాలను అంచనా వేయాలి. ప్రచార తీరును పరిశీలించాలి. అనంతరం.. వాటికి భిన్నంగా గెలుపు కోసం పోరాడాలి. జనాల్లోకి దూసుకెళ్లాలి. కానీ హుజూరాబాద్ లో కాంగ్రెస్ వైపు ఇవేమీ కనిపించడం లేదు. అవతలి పార్టీలో బలమైన అభ్యర్థులు ఉంటే.. వారి బలహీనతలపై ఫోకస్ చేయాలి. వాటిని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆకర్షించే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో… కాంగ్రెస్లో ఇవేమీ కనిపించట్లేదు. దీంతో ఆ పార్టీ నేతలు ముందుగానే ఓటమిని అంగీకరించినట్లుగా కనిపిస్తోంది.
Also Read : కాంగ్రెస్, బీజేపీల నేతలు టీఎంసీలోకి ఎందుకు వెళుతున్నారు..?
ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బలమైన అభ్యర్థి… ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు గతంలో టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేసినప్పటికీ అధికార పార్టీ అండదండలున్నాయి. ముగ్గురు మంత్రులు హుజురాబాద్లోనే మకాం వేసి.. హామీలు కురిపిస్తున్నారు. వాస్తవానికి ఈ రెండు పార్టీలను ఎదుర్కోవడం కాంగ్రెస్ కు కష్టమే అయినా.. ఒక జాతీయ పార్టీగా ఎదుర్కోవడానికి ప్రయత్నం మాత్రం చేయాలి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా బల్మూరి వెంకట్ ను ప్రకటించి ప్రచారంలో మాత్రం కనిపించడం లేదు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సీనియర్ నేత జానారెడ్డి పోటీలో నిలబడినప్పటికీ ఓటమి తప్పలేదు. ఆయనను గెలిపించేందుకు పార్టీ ప్రముఖులందరూ శక్తివంచన లేకుండా కృషి చేశారు. మరి ఆ కృషి హుజూరాబాద్ లో ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికలో విజయం సాధించాలని అనుకుంటే సరిపోదు. అభ్యర్థి గెలుపు కోసం పోరాడాలి. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా దామోదర రాజనర్సింహను నియమించడం వరకు బాగానే ఉన్నా.. పార్టీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి కూడా అభ్యర్థి తరఫున ఎన్నికల రణరంగంలోకి రావాలి. కానీ ఇప్పటి వరకు ఆ ప్రయత్నాలు జరగడం లేదు. అస్సలు అగ్ర నాయకులకు కాంగ్రెస్ హుజూరాబాద్ లో పోటీ చేస్తుందనే సోయే ఉండడం లేదని స్థానిక కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. లేదా రేవంత్ ఇక్కడ ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారానికి రావడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Also Read : మోత్కుపల్లి నిరీక్షణ ఫలించబోతోందా..?