Idream media
Idream media
హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను అధికార పార్టీ నుంచి మంత్రి హరీశ్‌రావు తన భుజాన వేసుకున్నారు. షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచే… నియోజకవర్గంలో కలియ తిరుగుతూ నేతలందరినీ సంఘటితం చేస్తున్నారు. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉంది. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ వల్ల టీఆర్ఎస్ కు బలం వచ్చిందా, లేక టీఆర్ఎస్ వల్ల రాజేందర్ బలం పెరిగిందా అనేది ఈ ఎన్నికతో తేలనుంది. దీంతో బీజేపీ అభ్యర్థి రాజేందర్ కూడా గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు హరీశ్ మాత్రం ఎన్నికల లోపు బీజేపీ ఖాళీ కాబోతోందంటూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. దీంతో హరీశ్ ఎత్తుగడ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచీ కరీంనగర్ జిల్లా రాజకీయాలు మరింత హీటెక్కాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ ఎస్- బీజేపీ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ప్రతీ ఓటరును నేరుగా కలిసేలా పక్కాగా ప్రణాళికలు రూపొందించిన ఆయా పార్టీలు ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇంటింటి ప్రచారానికి ఈసీ షరతులతో అనుమతి ఇవ్వడంతో దానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఇంటింటికీ వెళ్లి గెలిస్తే తాము చేసేంది ఏంటో చెబుతున్నాయి. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిన వేళ భారీ బహిరంగ సభలు, ఇండోర్ సభల కంటే ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరినీ కలవడం కలిసి వస్తుందని ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఈ విషయంలో ఈటల ఓ అడుగు ముందుకు ఉండడంతో హరీశ్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు.
Also Read : మోత్కుపల్లి నిరీక్షణ ఫలించబోతోందా..?
ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ హుజారాబాద్ లో విజయమే లక్ష్యంగా దాదాపు 16 వారాలుగా నియోజకవర్గంలోనే మకాం వేశారు. ఆయనకు తోడుగా మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి నారదాసు లక్ష్మణరావు ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ సుంకె రవిశంకర్ సతీశ్బాబు బాల్క సుమన్ కోరుకంటి చందర్ తో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్లు ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచ్ లు వార్డు సభ్యులు మండల-గ్రామ-వార్డు కార్యకర్తలతో మెగా బృందమే పని చేస్తోంది. వీరందరి లక్ష్యం ఈటల వెనుక ఉన్నప్రధాన నాయకులను ఆకర్షించడం అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ దిశలో టీఆర్ ఎస్ విజయం సాధిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.
నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతునిస్తూ టీఆర్ఎస్ లో చేరడం ఆసక్తిగా మారుతోంది. జమ్మికుంట కమలపూర్ మండలాలలోని లక్షాపురం భీంపెల్లి నర్సక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో తెరాసలో చేరారు. లక్ష్మాపురం బీజేపీ గ్రామ అధ్యక్షులు సంపత్ రావు మాజీ ఉపసర్పంచి శ్రీనివాస్ వారితో పాటు 20 మంది బీజేపీ కార్యకర్తలు తెరాస నేత శంకర్ రావు నేతృత్వంలో తెరాసలో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హుజూరాబాద్ మండలం రంగాపరం గ్రామానికి చెందిన వంద మంది పద్శశాలీలు రంగాపూర్ గ్రామ తెరాస ఇన్ఛార్జి దుర్గా రెడ్డి నేతృత్వంలో బీజేపీ పార్టీ నుండి తెరాసలో చేరారు.
Also Read : సునీల్ – మూడు ఎన్నికలు మూడు పార్టీలు , అయినా ఎందుకు గెలవలేకపోయాడు?
అంతేకాకుండా.. నూట యాభై మంది వరకు ముదిరాజులు బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి టీఆర్ఎస్ లో చేరారు. ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు జి. సుధాకర్ నేతృత్వంలో కమలాపూర్ మండలం పూసల సంఘం వారు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే తమ ఓటని మంత్రి హరీశ్ రావును కలిశారు. తెరాసలో చేరతామని ప్రకటించారు. దీనికి తోడు ఎన్నికల నాటికి హుజూరాబాద్లో బీజేపీ ఖాళీ అవుతుందంటూ హరీశ్ ప్రకటనలు సంచలనంగా మారుతున్నాయి. సై అంటే సై అనే రీతిలో ఈటల రాజేందర్ పోరాడుతున్న సమయంలో హరీశ్ వ్యూహాలకు బీజేపీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపించేసరికి సమీకరణాలు ఎలా మారనున్నాయో వేచి చూడాలి.