iDreamPost
android-app
ios-app

Huzurabad BJP Etela -హుజూరాబాద్ టు రాష్ట్రం : బీజేపీ ప్లాన్ వ‌ర్క్ అవుట్ అవుతుందా.?

Huzurabad BJP Etela -హుజూరాబాద్ టు రాష్ట్రం : బీజేపీ ప్లాన్ వ‌ర్క్ అవుట్ అవుతుందా.?

ద‌క్షిణాదిలో ప‌ట్టు పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ.. తెలంగాణ‌పై కూడా ప్ర‌ధానంగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా బండి సంజ‌య్ ను రంగంలోకి దింపి అధికార‌మే ల‌క్ష్యంగా పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింది. ఢిల్లీ అధిష్టానం వెనుక ఉండి ‘బండి’ని న‌డిపిస్తోంది. దుబ్బాక గెలుపుతో స్పీడు పెంచిన బీజేపీ.. ఆ త‌ర్వాత గ్రేటర్ ఫైట్ లోనూ అదే ఉత్సాహం చూపిన‌ప్ప‌టికీ, ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో చ‌తికిల‌ప‌డింది. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ ను అవ‌కాశంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ను పార్టీలోకి చేర్చుకుని ల‌క్ష్య‌సాధ‌న వైపు గురి పెట్టిన ఆ పార్టీ.. ఇప్పుడు ఉప ఎన్నిక‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించింది. ఇక్క‌డ గెలిచి.. అనంత‌రం అసెంబ్లీకి గురి పెట్టాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

అయితే.. హుజూరాబాద్ లో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ అని గాకుండా, ఈటెల వ‌ర్సెస్ టీఆర్ ఎస్ గానే పోరు న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ రాజేంద‌ర్ గెలిచినా అది పార్టీ ప‌వ‌ర్ అని చెప్పుకునే అవ‌కాశం ఉండ‌ద‌నే అంత‌ర్మ‌థ‌నంలో బీజేపీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ కు మించిన ల‌క్ష్యంతో పార్టీ ఆ దిశ‌గా గ‌ట్టి ప్ర‌ణాళిక‌లే ర‌చిస్తోంది. ఈటెల, టీఆర్ఎస్ మ‌ధ్యే ప్ర‌ధానంగా న‌డుస్తున్న పోరులో ఆయ‌న గెలిస్తే అందుకు పార్టీ పాత్రే ప్ర‌ధాన‌మ‌ని ప్ర‌చారం చేసుకునేలా పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే హుస్నాబాద్ లో బండి పాద‌యాత్ర ముగింపు స‌భ‌ను హుజూరాబాద్ ఎన్నిక‌ల భేరిగా ప్ర‌క‌టించుకుంది. అంతేకాకుండా అంత‌కు ముందు జ‌రిగిన బీజేపీ స‌భ‌లో పాల్గొన్న అమిత్ షా ఈటెల పేరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ.. ఆయ‌న‌కు త‌మ పార్టీ పూర్తి స‌హ‌కారాలు అందిస్తోంద‌ని పేర్కొన్నారు. మా రాజేంద‌ర్ ను గెలిపించుకుంటామ‌ని, ప్ర‌జ‌లు గెలిపించాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : Huzurabad By Poll -హుజూరాబాద్ : ఫ‌స్ట్ ప్లేస్ లో బీజేపీ.. లాస్ట్ లో టీఆర్ఎస్..!

దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తున్న బీజేపీకి ఈటెల ను ఆయువుపట్టు గా మార్చుకోవాల‌ని బీజేపీ య‌త్నిస్తోంది. కానీ, ఈ ఎన్నిక ఈటెల వర్సెస్ కేసీఆర్ గా మార‌డం ఆ పార్టీ కొంత క‌ష్టంగా భావిస్తోంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి.. ఈటెల విజయం సాధించినా అది బీజేపీ ఖాతాలో పడే అవకాశం లేదు. ఇది బీజేపీకి మొదట్లో నచ్చలేదనే ప్రచారం కూడా జరిగింది. అయినప్పటికే ఈటెెల లాంటి నేతను అడ్డంపెట్టుకుని రాష్ట్రంలో ఎలాగైన పాగా వేయాలనే బీజేపీ అనుకుంటోంది. అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అలాగే బీజేపీతో ఈటెల రాజేందర్ అనుబంధం కూడా ఎన్నికల చర్చలో కీలకంగా మారింది.

వాస్తవానికి ఈటెల తీవ్రవాద వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి. తన భావజాలానికి విరుద్ధమైన బీజేపీలో ఎందుకు చేరాల్సివచ్చిందో అందరికీ తెలుసు. భూ కుంభకోణం ఆరోపణలతో నుంచి బయపడాలంటే బీజేపీలో చేరటం ఒక్కటే మార్గమని బహుశా ఆయన భావించి వుండవచ్చు. బీజేపీకి కూడా ఈటెల అవసరం ఉంది. రాష్ట్రంలో పాగా వేయాలంటే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ క్రమంలోనే ఈటెల గతాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బీజేపీలో చేర్చుకున్నారు. పైగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలమైన పునాదులున్నాయి. గ్రామస్థాయిలో కమిటీలు కూడా ఉన్నాయి. అందులో ఉత్తర తెలంగాణలో మూడు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.

Also Read : కొత్త పాయింట్ : అభివృద్ధి టీఆర్ఎస్ దా? ఈట‌ల రాజేంద‌ర్ దా?

ఇక హుజురాబాద్ ఈటెల కంచుకోట. పైగా ఆయన సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది. హుజురాబాద్ లో ఈటెల కు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఇవన్నీ గెలుపుకు సహకరిస్తాయనే ధీమాతో బీజేపీ నేతలున్నారు. దీనికి తోడు ఎన్నిక స‌మీపించేలోపు పార్టీ పెద్ద‌ల‌ను రంగంలోకి గెలిస్తే విజ‌యాన్ని బీజేపీ ఖాతాలోకి మ‌ళ్లించుకునేలా బండి ప్లాన్ చేస్తున్నారు. హుజూరాబాద్ ను ఉప ఎన్నిక‌లా చూడ‌కుండా.. తెలంగాణ‌లో పాగా వేసేందుకు ఓ మార్గంగా భావించి ప్ర‌చారానికి వ‌చ్చేలా అగ్ర‌నేత‌ల‌తో సంజ‌య్ మంత‌నాల‌ను జ‌రుపుతున్నారు. అందుకు అధిష్ఠానం సిద్ధ‌ప‌డితే.. ఈ ఉప ఎన్నిక గ్రేట‌ర్ సంగ్రామాన్ని త‌ల‌పించే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రి ప్ర‌చారానికి ఎవ‌రు రానున్నారు? బీజేపీ ప్లాన్ ఎంత వ‌ర‌కు వ‌ర్క్ అవుతుంది అనేది ఆస‌క్తిగా మారింది.