Idream media
Idream media
పేరుకు ఉప ఎన్నికే అయినప్పటికీ, తెలంగాణలోని రాజకీయ పార్టీలు అన్నీ హుజూరాబాద్ తోనే తమ భవితవ్యం ముడిపడి ఉందని అంచనా వేసుకుంటున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ అయితే ఆ సీటుతోనే రాష్ట్రంలో అధికారం అన్నట్లుగా గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఉప ఎన్నికే అని లైట్ గా తీసుకోకుండా ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలు ఆ నియోజకవర్గం గురించే చర్చలు జరుపుతున్నారు. ఆ ప్రాంత నేతలు, ప్రజలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక బీజేపీ నుంచి ఈటల రాజేందర్ అయితే ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఓడిపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాళ్లు విసురుతున్నారు. నేతలందరూ ఇంతలా అగ్గిలంమీద గుగ్గిలం కావడానికి కారణమైన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడనేది ఇంత వరకూ క్లారిటీనే లేదు.
అయితే, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో భేటీ కావటం.. ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై ఆరా తీయటం.. వ్యాక్సినేషన్ లెక్క అడగటం.. కరోనా కేసుల లెక్కల వివరాల్ని సేకరించటం ఇదంతా చూస్తే.. ఉప ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు పడినట్లేనని చెప్పాలి. వాస్తవానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించటానికి గడువు డిసెంబరు వరకు ఉంది. మూడో వేవ్ వార్తల నేపథ్యంలో ఉప ఎన్నిక నిర్వహణ ఎప్పుడన్న దానిపై స్పష్టత లేదు. ఇలాంటివేళ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సమీక్షను నిర్వహించటం.. వివరాల్ని సేకరించటం.. రాష్ట్రాల వారీగా పరిస్థితులపై ఆరా తీయటం చూస్తే.. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యాక్సినేషన్ జరిగిన వివరాల్ని.. కరోనా కేసుల నమోదు తెలంగాణ వ్యాప్తంగా కంట్రోల్ లో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఖాళీ అయిన స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు ఆర్నెల్ల గడువు ముంచుకొస్తున్న వేళలో.. ఈ సమీక్ష జరిగినట్లుగా చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం చూస్తే.. ఉప ఎన్నికల్ని అక్టోబరు లేదంటే నవంబరులో నిర్వహించే వీలుందని చెబుతున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ తన పార్టీ పదవికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా నిర్వహించిన సమీక్షతో ఉప ఎన్నిక దగ్గర్లోకి వచ్చేసినట్లే అన్నఅంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : కేసీఆర్ కు మోదీ అపాయింట్ మెంట్ పై బీజేపీలో టెన్షన్