Idream media
Idream media
హుజూరాబాద్ ఉప ఎన్నిక సీరియస్ విషయం కాదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల ఓ సమావేశంలో పేర్కొన్నారు. ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు మాత్రం వేడిపుట్టిస్తున్నారు. ఈటెల రాజేందర్, బీజేపీ టార్గెట్ గా పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజేందర్ రాజకీయ వైఫల్యాలను వెలుగులోకి తెస్తూ ఆయనకు ఓటేస్తే వృథానే అన్న విధంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు కూడా పంథా మార్చుతున్నారు. ప్రచారం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ కు కౌంటర్లు పెంచుతున్నారు.
ఈటెల రాజేందర్ ను గెలిపిస్తే ఏమొస్తదని.. అదే టీఆర్ఎస్ ను గెలిపిస్తే హుజూరాబాద్ లో అభివృద్ధి జరుగుతుందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి విమర్శలకు ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చాడు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలతో ఢీ అంటే ఢీ అనే ఎంపీ అరవింద్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కేసీఆర్ కూతురునే నిజామాబాద్ లో ఓడించిన అరవింద్ తగ్గేదేలే అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా తనదైన శైలిలో దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు యువ ఎంపీ.
ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు కొత్త ప్రచారానికి తెరతీశారు. ఏడున్నరేళ్లలో ఈటెల రాజేందర్ చేసిందేమీ లేదని.. ఇప్పుడు గెలిచి ఆయనేం చేస్తారని విమర్శిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో తమ పార్టీనే ఉందని.. ఈ ఒక్క సీటులో ఈటెల గెలిస్తే ఏమొస్తదంటూ ఎద్దేవా చేస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటెల గెలిస్తే ఆయనకు మినహా నియోజకవర్గంలో ఎవరికి ఏ ప్రయోజనం ఉండదని చెప్పే ప్రయత్నం బలంగా చేస్తోందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఈటెల గెలిస్తే ఏమొస్తదంటూ టీఆర్ఎస్ మొదలెట్టిన ప్రచారంపై ఘాటుగా స్పందించారు ఎంపీ అరవింద్. తన స్టైల్లో సాలిడ్ పంచ్ ఇచ్చారని.. ఈ మధ్య ప్రతోడు ఈటెల గెలిస్తే ఏమొస్తది.. ఏమొస్తది అంటున్నాడని.. ఈటెల గెలిస్తే గదే వచ్చేదంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈటెల గెలిస్తే కేసీఆర్ సర్కారు చేసిన వాగ్ధానాలన్నీ యాదికొస్తాయ్ అని అర్వింద్ అన్నారు.
మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఇళ్లే ప్రజలకు పంచలేని ఈటెల.. వేరే పార్టీ నుంచి గెలిస్తే ఇంకేం చేస్తారో ఆలోచించుకోండి అని అంటున్నారు. స్వప్రయోజనాలే ఆయన ఎజెండా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలా టీఆర్ఎస్, బీజేపీ నేతల మాటల తూటాలతో ప్రచారం వేడుక్కుతోంది.
Also Read : Telangana Congress Bhatti Vikramarka -భట్టిపై టీఆర్ఎస్ గురి.. కారెక్కేస్తారా?