ఒక చెట్టు కూలింది, వందల పక్షులు నేలకొరిగాయి: కేరళ రహదారి విస్తరణలో కాంట్రాక్టర్ల నిర్వాకం

  • Updated - 08:28 AM, Sun - 4 September 22
ఒక చెట్టు కూలింది, వందల పక్షులు నేలకొరిగాయి: కేరళ రహదారి విస్తరణలో కాంట్రాక్టర్ల నిర్వాకం

కేరళలోని మలప్పురం జిల్లా. నేషనల్ హైవే 66 పక్కనే వీకే పడి అనే ఊరు. ఆ ఊర్లో రోడ్డు వెంబడి చాలా చెట్లున్నాయి. కానీ ఆ ఒక్క చెట్టూ చాలా ప్రత్యేకం. ఎందుకంటే కొన్ని వందల పక్షులు గూళ్ళు కట్టుకుని ఆ చెట్టు నీడన హాయిగా బతికేస్తున్నాయి. వాటిలో ఇండియన్ కార్మోరెంట్ (Indian Cormorant) అంటే నీటి కాకులే ఎక్కువ. వీటిని మళయాళంలో “నీర్ కక్కా” అంటుంటారు. జూన్ నుంచి నవంబర్ వరకు నీటి కాకులు గుడ్లు పెట్టి పొదిగే కాలం. అప్పుడు ఈ ప్రాంతం, మరీ ముఖ్యంగా ఈ చెట్టు చాలా సందడిగా ఉంటాయి. ఆరోజు కూడా ఎప్పట్లానే నీటి కాకులతో చెట్టు చాలా కోలాహలంగా ఉంది. ఇంతలో బుల్ డోజర్ రూపంలో మృత్యువు విరుచుకుపడింది. చెట్టు నిలువునా కూలిపోయింది. చెట్టును నమ్ముకుని పక్షులు కట్టుకున్న గూళ్ళు చెదిరిపోయాయి. గుడ్లు చితికిపోయాయి. బుజ్జి పిట్టలు చెట్టు కింద పడి నలిగిపోయాయి. తల్లి పిట్టలు ఆ చెట్టు చుట్టూ ఎగురుతూ హృదయవిదారకంగా కేకలు పెట్టాయి. ఇంతటి విధ్వంసానికి కారణం నేషనల్ హైవే విస్తరణ! దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను కుదిపేశాయి. మనుషులు తమ స్వార్థం కోసం మిగతా జీవుల నెలవుల్ని ఎలా ఆక్రమిస్తారంటూ నెటిజెన్లు ప్రశ్నించారు. రక్షిత జాబితాలో ఉన్న పక్షుల గూళ్ళను, అవి గుడ్లు పెట్టే కాలంలోనే చిదిమేయడం కంటే క్రూరత్వం ఉంటుందా అని దుమ్మెత్తిపోశారు. అటు టీవీ ఛానెళ్ళలోనూ దీనిపై తీవ్ర స్థాయిలో డిబేట్లు నడిచాయి.


జనాగ్రహానికి దిగి వచ్చిన కేరళ అటవీశాఖ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కాంట్రాక్టర్ మీద కేసు పెట్టింది. గుడ్లు పొదిగే కాలం తర్వాతే ఆ చెట్టును కూల్చాలని చెప్పినా కాంట్రాక్టర్ వినలేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కేరళ అటవీశాఖ మంత్రి శశీంద్రన్ దీన్ని క్రూరమైన ఘటనగా అభివర్ణించారు. కేరళ ప్రజా పనుల శాఖా మంత్రి పి.ఏ. మొహమ్మద్ రియాజ్ నేషనల్ హైవే అథారిటీ అధికారుల నుంచి దీనిపై వివరణ కోరారు.
ఇదే జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇంతకుముందు కూడా ఇలాగే ఓ భారీ చెట్టును కూల్చారు. అప్పుడు కూడా వందలాది పక్షి పిల్లలు చనిపోయాయి. వీటిలో చాలా వరకు “హెరోన్” అనే వలస పక్షులే ఉన్నాయి.

Show comments