iDreamPost
iDreamPost
పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ తో అదిరిపోయే హీరో క్యారెక్టరైజేషన్ ని పీక్స్ లో చూపించిన సినిమాల పేర్లు చెప్పమంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి బాషా, ఇంద్ర, సమరసింహారెడ్డి లాంటివేగా. కానీ వీటికి గైడ్ బుక్ లా నిలిచిన బాలీవుడ్ మూవీ ఒకటుంది. ఆ విశేషాలు చూద్దాం. 1990. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కెరీర్ కొంచెం మందగమనంలో ఉంది. హిట్లు రెండు పడితే ఫ్లాపులు ఐదొస్తున్నాయి. అభిమానుల్లో కలవరం. మైనే ప్యార్ కియాతో సల్మాన్ ఖాన్ లాంటి కొత్త రక్తం ఉరకలెత్తుతోంది. మిథున్ చక్రవర్తి అప్పటికే సగం 80 దశకాన్ని డామినేట్ చేశాడు. అమీర్ ఖాన్ కు డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ దక్కింది. ఇలాంటి సమయంలో అమితాబ్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు.
భారీ అంచనాలతో చేసిన అగ్ని పథ్ జాతీయ అవార్డు తెచ్చింది కానీ కమర్షియల్ గా ఆశించిన స్థాయికి వెళ్ళలేదు. షెహెన్షా తర్వాత హ్యాట్రిక్ డిజాస్టర్లు పలకరించాయి. ముద్దుల మావయ్య రీమేక్ ఆజ్ కా అర్జున్ ఓ మోస్తరు విజయం సాధించింది. అప్పుడు కలిసిన దర్శకుడే ముకుల్ ఎస్ ఆనంద్. అగ్నిపథ్ లో ఆయన టేకింగ్ మెచ్చిన అమితాబ్ మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రవి కపూర్ – మోహన్ కౌల్ సంయుక్తంగా చెప్పిన కథ వీళ్లకు బాగా నచ్చింది.దాంతో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. రజనీకాంత్-గోవిందాలు తమ్ముళ్ల పాత్రలకు ఎంపిక కాగా కిమీ కిట్కర్-శిల్పా శిరోద్కర్(మహేష్ బాబు సతీమణి నమ్రతా సోదరి)హీరోయిన్లుగా ఫిక్స్ అయ్యారు.
సుప్రసిద్ధ సంగీత ద్వయం లక్ష్మి కాంత్ ప్యారేలాల్ సంగీతం సమకూర్చగా ప్రముఖ నటుడు కాదర్ ఖాన్ సంభాషణలు అందించారు. షిప్ యార్డ్ లో పనిచేసే టైగర్(అమితాబ్)తన ఆవేశం వల్ల విలన్ సామ్రాజ్యాన్ని నాశనం చేసి తమ్ముళ్లను అజ్ఞాతంలోకి తీసుకెళ్లి పెంచుతాడు. కొన్నేళ్ల తర్వాత ఇతని గతం వెంటాడుతుంది. పాత శత్రువులు బయటికి వస్తారు. ఇదే కథలో మెయిన్ పాయింట్. 1991 ఫిబ్రవరి 1 విడుదలైన హమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా చుమ్మా చుమ్మా దేదే పాట క్లాసు మాసు తేడా లేకుండా అందరికీ ఎక్కేసింది. బాక్సాఫీస్ దగ్గర 17 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆ ఏడాది టాప్ 4గా నిలబడింది. ఇదే కథను కీలకమైన మార్పులు చేయించి రజినీకాంత్ బాషాగా తీస్తే అది ఏకంగా ఎంత చరిత్ర సృష్టించిందో అందరికీ తెలిసిందే
Also Read : Prematho Raa.. :ప్రేమ పండక హిట్లకు బ్రేక్ వేసిన రా – Nostalgia