Idream media
Idream media
రాజకీయాల్లో ఎప్పుడు ఏ పార్టీ దూసుకెళ్తుందో చెప్పలేం. అనూహ్యంగా కొన్ని ఘటనలు సమీకరణాలను మార్చేస్తాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే వాళ్లే రాజకీయాల్లో రాణిస్తుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ కోవకే చెందుతారు. ఎలాంటి రాజకీయ పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకోవడం కేసీఆర్ తర్వాతే ఎవరైనా అనడంలో సందేహం లేదు. అయితే అలాంటి కేసీఆర్.. తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను మార్చి తనకు అనుకూలం చేసుకునేందుకు ఏ విధమైన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతారన్నది ఆసక్తి గా మారింది.
ఒకవైపు చేరికలతో బీజేపీ బలోపేతం అవుతోంది. ఉప ఎన్నికల్లో వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. అలాగే, కాంగ్రెస్ నాయకులు కూడా సమిష్ఠిగా ముందుకు కదిలేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎమ్మెల్సీ కోడ్ ముగిశాక వరుస కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లి మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో.. ఆ పార్టీకి మరింత కొత్త ఉత్సాహం వచ్చినట్టయ్యింది. ఇదే జోష్‌తో టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు ముందుకు సాగుతోంది బీజేపీ.
అదే సమయంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు వరి కొనుగోళ్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. వరుసగా మీడియా సమావేశాలు పెట్టి కేంద్రం పేరుతో బీజేపీని చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇప్పుడు వరుస చేరికలతో ఉత్సాహంగా ఉన్న బీజేపీని నిలువరించేందుకు కేసీఆర్ ఏం చేయనున్నారనే చర్చ అయితే మొదలైంది.
ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ నుంచి ఉద్యమకారులు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మేలుకోకపోతే పార్టీకి నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యమకారులతో త్వరలోనే సమావేశమై వారి సాధకబాధకాలను వినేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ రూపకల్పనలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వరి కొనుగోళ్ల విషయంలో స్పష్టత ఇచ్చేవరకు బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టబోమని.. వారిని వెంటాడతామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ సైలెంట్ అయినట్టు కనిపిస్తోంది. వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రం తమ వైఖరిని స్పష్టం చేయడంతో.. సీఎం కేసీఆర్ వారిపై పోరాటం చేస్తామని మరోసారి ప్రకటన చేసి రంగంలోకి దిగుతారా ? లేక మరో అంశాన్ని తెరపైకి తీసుకుని వస్తారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read : Telangana, BJP – ఉద్యమకారుల చూపు బీజేపీపైనే ఎందుకు?