iDreamPost
android-app
ios-app

సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 17

సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 17

క‌థ‌కి పునాది ఇతివృత్తం. పునాది స‌రిగా ప‌డితే బ‌లం. అయితే అది చాల‌దు బిల్డింగ్ క‌ట్టాలంటే ఇంకా చాలా కావాలి. థ్రిల్లింగ్‌గా లైన్ అనుకోవ‌డం సుల‌భం. ఉదాహ‌ర‌ణ‌కి హోంమంత్రి ప‌ర్య‌ట‌న ఉన్న‌ట్టు టీవీ న్యూస్‌లో చెబుతున్న‌ప్పుడు మినిస్ట‌ర్‌ని హ‌త్య చేస్తున్నా న‌ని విల‌న్ అన‌డంతో క‌థ ప్రారంభ‌మైతే ఆడియ‌న్స్‌కి నిజంగా థ్రిల్లింగే. అయితే ఈ లైన్ మీద 70 సీన్లు రాయాలంటే చాలా తెలివి కావాలి. సెంట్ర‌ల్ హోంమినిస్ట‌ర్‌కి ఏ రేంజ్ సెక్యూరిటీ ఉంటుందో తెలియాలి. ఎక్క‌డ లోపాలుంటాయో అక్క‌డ విల‌న్ ప్లాన్ చేస్తాడు. హీరో ఎలా క‌నిపెడ‌తాడు, విల‌న్‌కి ఏ ర‌కంగా చెక్ పెడ‌తాడో ఆస‌క్తిక‌రంగా రాయాలంటే ర‌చ‌యిత చాలా ప‌రిశోధ‌న చేయాలి.

Also Read: సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 10

మ‌న వాళ్లు ఏం చేస్తారంటే స‌గం సినిమా వ‌రకు హీరోయిన్ ల‌వ్‌ట్రాక్‌, పాట‌లు, కామెడీ బిట్స్‌తో నింపి, సెకెండాఫ్‌లో హీరో తెలివి తేట‌ల్ని వాడుతారు. చాలాసార్లు తెలివికి బదులు కండ‌బ‌ల‌మే ఉంటుంది. స్వామిరారాలో విలువైన విగ్ర‌హం చుట్టూ క‌థ‌. ఫ‌స్ట్ సీన్‌లోనే ఈ విష‌యం చెబుతాడు. అయితే హీరోహీరోయిన్ ఈ విగ్ర‌హానికి క‌నెక్ట్ కావ‌డానికి క‌నీసం గంట ప‌డుతుంది. టైమ్ వేస్ట్ చేయ‌కుండా మొద‌టి అరగంట‌లోనే క‌థలోకి వ‌స్తే ఇంకా గ్రిప్పింగ్‌గా ఉండేది. ఈ మ‌ధ్య వ‌చ్చిన అక్ష‌ర‌లో బిగినింగ్ విద్యా వ్య‌వ‌స్థ‌పై సినిమా అని Establish చేస్తారు. త‌ర్వాత పిండి తాతాజీ అనే పిచ్చ కామెడీలోకి క‌థ కాలుజారి మ‌ళ్లీ లేవ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతుంది.

Also Read: సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 11

అనుకున్న లైన్‌ని స‌క్సెస్‌ఫుల్‌గా రాయ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌. అమెరికా అధ్య‌క్షుడి కూతురు ఒక కాలేజీలో ఐడెంటిటీ బ‌య‌ట ప‌డకుండా చ‌దువుతూ ఉంటుంది. అక్క‌డ ఒక అబ్బాయి ల‌వ్‌లో ప‌డుతుంది. టెర్ర‌రిస్టులు తెలుసుకుని ఆమెని కిడ్నాప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. ల‌వ‌ర్ కాపాడుతాడు. అత‌నెవ‌రో కాదు… అండ‌ర్ క‌వ‌ర్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌. ప్రేమ క‌థ ఏమైంది? ఫ‌స్ట్ డాట‌ర్ (2004) క‌థ ఇది. దీనికంటే ప‌దేళ్ల ముందు 1994లో వ‌చ్చిన ప్రేమికుడు ఇలాంటి క‌థే. కానిస్టేబుల్ కొడుకు గ‌వ‌ర్న‌ర్ కూతుర్ని ప్రేమిస్తే? పాట‌లు, ప్ర‌భుదేవ డ్యాన్స్‌లు సినిమాని లాగేసాయి కానీ, క‌థ‌కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏమీ లేదు. క‌థ‌కి అనుకూలంగా గ‌వ‌ర్న‌ర్‌ని విల‌న్ చేశారు. సినిమాటిక్ లిబ‌ర్టీ. ఇదే క‌థ‌లో గ‌వ‌ర్న‌ర్‌కు బ‌దులు పోలీస్ అధికారి వ‌స్తే ఇడియ‌ట్‌. హీరోకి ప‌రిస్థితులు క‌లిసి రావ‌డం పాత ప‌ద్ధ‌తి. ఇంటెలిజెన్స్‌ని ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌తారు. డిటెక్టివ్‌, అభిమ‌న్యుడు కొంచెం సినిమాటిక్‌గా ఉన్నా ఎందుకు ఆడాయంటే జ‌నాల తెలివికి ప‌రీక్ష పెట్టాయి. హిచ్‌కాక్ సినిమాలు ఆడ‌డానికి కూడా ఇదే కార‌ణం.

Also Read: సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 12

కంచ‌ర‌పాలెంలో నేటివిటీతో క‌థ చెప్ప‌డ‌మే కాదు, 3 ప్రేమ క‌థ‌ల్ని చివ‌ర్లో క‌నెక్ట్ చేసిన ప‌ద్ధ‌తి థ్రిల్‌కి గురి చేసింది. ర‌చ‌యిత తెలివి ఇది. క‌థ‌లో ఇంటెలిజెన్స్ ఉండాలంటే ర‌చ‌యిత‌కి చాలా విష‌యాలు తెలియాలి. నాలుగు కొరియ‌న్ సినిమాల నుంచి సీన్స్ కొట్టుకొస్తే ఇది రాదు.

వేషాలు లేని న‌టుడు , ఉపాధి కోసం లేడీ గెట‌ప్‌లో ఆడిష‌న్‌కి వెళితే నాట‌కంలో సెలెక్ట్ అవుతాడు. మ‌గ‌వాడిన‌ని బ‌య‌ట ప‌డ‌కుండా మేనేజ్ చేయాలి. 1982లో వ‌చ్చిన టూట్సీ క‌థ ఇది. డ‌స్టిన్ హాఫ్‌మ‌న్ హీరో. 2 కోట్ల డాల‌ర్ల‌తో తీస్తే 17 కోట్లు వ‌చ్చింది. విడాకులు తీసుకున్న తండ్రి , పిల్ల‌ల కోసం ఆడ‌వేషం వేస్తే మిసెస్ డౌట్ ఫైర్ (1993). ఇదే క‌థ‌ని క‌మ‌ల్‌హాస‌న్ “భామ‌నే స‌త్య‌భామ‌నే” (1994) తీశాడు.

Also Read: సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 13

1991లో మ‌రాఠీ సినిమా ఆధారంగా చిత్రంభ‌ళారే విచిత్రం తీసారు. న‌రేష్ ఆడ‌వేషం వేసాడు. తాత్కాలికంగా ఆడ‌వేషం వేస్తే వ‌చ్చే ఇక్క‌ట్లు మేడ‌మ్ (1994). ఐడియా ఒక్కోసారి సుల‌భం. క‌థ‌ని డెవ‌ల‌ప్ చేయాలంటే ఎన్ని ర‌కాలు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి, హీరో ఎలా ఎదుర్కొన్నాడు? మ‌గ‌వాడు ఆడ‌వేషం వేస్తే ప్ర‌ధానమైన స‌మ‌స్య ఎవ‌రో ఒక‌రు ప్రేమ‌లో ప‌డి వేధిస్తారు. ఇది అంద‌రికీ వ‌చ్చే ఆలోచ‌నే. దీనికి మించి వ‌స్తే అది కొత్త క‌థ‌.

క‌థ‌లో వ‌చ్చే స‌వాళ్లు, ప‌రిష్కారాలు కూడా కొత్త‌గా ఉండాలి. పాత సినిమాల్లో క్లైమాక్స్ సీన్‌లో ఛేజ్ కోస‌మో బైక్ , గుర్ర‌బ్బండి హీరో కోసం సిద్ధంగా ఉన్న‌ట్టు సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకుంటే ప్రేక్ష‌కులు న‌వ్వుతారు. OTT లో అన్ని భాష‌ల సినిమాలు చూసి చూసి తెలివిమీరి పోయారు.

Also Read: సినిమా క‌థ రాయ‌డ‌మెలా? – 14

ఇతివృత్తం అనుకున్న‌ప్పుడే హీరో జ‌ర్నీలో ఎన్ని అడ్డంకులు వ‌స్తాయి. శ‌త్రువులు, మిత్రులు ఎంద‌రు? ఈ క్యారెక్ట‌ర్లు రాసుకోవ డం మొద‌లు పెడితే క‌థ న‌డ‌క సాగుతుంది. హీరో ఒక పోలీస్‌. అన్యాయంగా వ‌జ్ర‌పు దొంగ‌త‌నం మోపి జైలుకు పంపిస్తారు. తాను దొంగ కాద‌ని నిరూపించుకోవ‌డానికి పోలీసుల నుంచి పారిపోతాడు. మ‌న సినిమాల్లో అయితే వెంట‌నే విల‌న్ ఇంటికెళ్లి తుక్కుతుక్కుగా తంతాడు. ఇది పాత క‌థ‌. అత‌ను ఓ హోట‌ల్ భ‌వ‌నం (90 అంత‌స్తులు) ఎక్కి దూకేస్తాన‌ని బెదిరిస్తాడు. కొన్ని గంట‌లు పోలీసుల్ని టెన్ష‌న్‌లో పెడ‌తాడు. ఇది కొత్త ఆలోచ‌న‌. బెదిరించ‌డం వ‌ల్ల ఏం సాధిస్తాడు? దొంగ కాద‌ని నిరూపించ‌లేడు క‌దా! ఎలా నిరూపించాడ‌న్న‌దే Man on a ledge (2012). సినిమా అద్భుతం కాదు కానీ, ఒక కొత్త ఐడియా.