Idream media
Idream media
మంచి సినిమాకి 3 విషయాలు అవసరం అంటాడు ఆల్‌ఫ్రెడ్‌హిచ్‌కాక్. 1.స్క్రిప్ట్ 2.మంచి స్క్రిప్ట్ 3.గొప్ప స్క్రిప్ట్. హిచ్‌కాక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పుడు విపరీతమైన అల్లరి చేస్తుంటే ఆయన తండ్రి ఒక కాగితం ఇచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చి రమ్మన్నాడు. అది చూసిన ఇన్‌స్పెక్టర్ 5 ఏళ్ల వయసున్న హిచ్‌కాక్‌ని సెల్‌లో వేసి అల్లరి పిల్లలకి ఇదే శిక్ష అన్నాడు. అప్పుడు అనుభవించిన భయాన్ని జీవితాంతం ప్రేక్షకులకి పంచాడు హిచ్‌కాక్.
రచయితలోంచి కథ పుడుతుంది. అది ప్రేక్షకుడికి చేరుతుంది. విద్యుత్ తీగల నుంచి ప్రవహించి బల్బుని వెలిగించినట్టు. కథ అనేక తీగల నుంచి (కెమెరా, ఎడిటింగ్, సంగీతం) ప్రేక్షకున్ని వెలిగిస్తుంది.
కథకి ఒక కాలం ఉంటుంది. గతాన్ని చెప్పే కథలు. సైరా గత కాలం. మగధీర గతాన్ని, వర్తమానాన్ని కలిపే కథ. భవిష్యత్ గురించి చెప్పే కథలు అరుదుగా ఉంటాయి. 2050లో ఏం జరిగిందో చెప్పాలంటే చాలా కల్పన కావాలి. తీయడానికి బడ్జెట్ కూడా ఎక్కువే. వర్తమానాన్ని దాటి పక్కకి వెళితే అది చాలా ఖర్చుతో కూడిన విషయం (1949లో జార్జిఆర్యెల్ 1984 అనే పుస్తకాన్ని రాశాడు రాజకీయాలు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో ఊహించాడు. ఊహకంటే అధ్వానంగా ఉన్నాయి).
మంచి కథలో ప్రేక్షకుడు లీనమై పోతాడు. జీవితం గురించి చెప్పడం మాత్రమే కాదు, జీవిత అనుభవాన్ని కూడా ఇస్తుంది. ఆ కథ మన లైఫ్‌లో జరగకపోవచ్చు. కానీ జరుగుతుందేమోనని భయం కలిగితే కూడా మంచి కథే. దృశ్యం సినిమా ఎందుకు అన్ని భాషల్లో ఆడిందంటే ఆడపిల్లల అమ్మానాన్నలకి అది షాక్ కలిగించింది. జరిగింది హత్యే అయినా , హంతకుల వైపు ప్రేక్షకులు ఉంటారు. ఇది చాలా అరుదు. హీరో నేరస్తుడు. అయినా అతన్ని మనం ప్రేమిస్తాం.
కుటుంబం కోసం నేరస్తుడైతే అది దృశ్యం. సమాజం కోసం నేరస్తుడైతే జెంటిల్‌మెన్. కథని సరళంగా చెప్పడం పాత పద్ధతి. దాగుడుమూతలు (హైడ్ అండ్ సీక్) ఆడడం కొత్త పద్ధతి. శవాన్ని పోలీస్‌స్టేషన్‌లో పాతి పెట్టాడని ఆఖరి వరకు తెలియదు. గుప్పెట మూస్తూ తెరుస్తూ కథ చెప్పడం మంచి టెక్నిక్. మూయడం తెరవడం సరిగ్గా తెలియకపోతే గందరగోళంగా మారి ప్రేక్షకుడు పారిపోతాడు.
ఫీల్‌తో పాటు , తెలివికి పరీక్ష కూడా ఉంటే అది మంచి కథ. సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటికి కొన్ని వేల కథలు వచ్చి ఉంటాయి. మరి కొత్త కథ ఎక్కడి నుంచి వస్తుంది. కొత్త కథ ఉండదు. కథని కొత్తగా చెప్పడమే చేయాల్సింది.
జీవితమంటేనే నాటకం. డ్రామాలేని జీవితం ఉండదు. డ్రామాని హైట్స్‌కి తీసుకెళ్లడమే సినిమా. వాస్తవ జీవితానికి కొంచెం నాటకాన్ని జోడిస్తుంది. జీవితాన్ని పచ్చిగా ( Raw ) చూపిస్తే బాగుండదు. కెమెరా యాంగిల్స్, సంగీతం లైఫ్‌లో ఉండవు.
కథని కొన్ని పాత్రల ద్వారా చెబుతాం. చాలా సినిమాల్లో హీరోతోనే కథ. మాయాబజార్‌లో ఎవరు హీరోనో చెప్పలేం.
NTR, ANR, SVR , సావిత్రి అందరూ హీరోలే. బాహుబలిలో కూడా ప్రభాస్ , రమ్య, తమన్నా, అనుష్క, రానా, సత్యరాజ్ అందరికీ సమాన పాత్ర ఉంటుంది. నిజానికి ఈ కథని తమన్నాతోనే ప్రారంభిస్తాడు. ఆమెని వెతుక్కుంటూ వెళ్లడం వల్లే అసలు కథ మొదలవుతుంది. లేకపోతే ప్రభాస్ ఆ పల్లెలో పెరిగి జీవించేవాడు.
రూల్స్ లేకపోతేనే సినిమా కథ. కానీ రూల్స్ లేకపోవడం కూడా ఒక రూలే.
గల్లీలో క్రికెట్ ఆడిన, స్టేడియంలో ఆడినా ఒక బ్యాట్ , బాల్, మూడు చెక్కముక్కల వికెట్స్ ఉండాల్సిందే. సినిమా అంటే ఏదో ఒక కథ, కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ ఉండాల్సిందే.
పక్కన ఏం జరుగుతుందో , పట్టించుకోకుండా జీవిస్తున్న ఈ కాంలో ఒక కథని చెప్పి థియేటర్‌లో వందల మందిని కూచోపెట్టాలంటే నిజంగా చాలా పెద్ద విషయం.
ప్రేక్షకుడికి కొత్త ప్రపంచం చూపాలంటే ముందు రచయితకి కొత్త ప్రపంచం తెలియాలి.