Idream media
Idream media
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద చేపడుతోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రకాశం జిల్లాకు నష్టమంటూ.. ఆ ప్రాజెక్టును ఆపాలని ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి, పర్చూరు, కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రకటనలు చేయడం ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం కొనసాగుతున్న తరుణంలో చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే ఈ ముగ్గురు ఎమ్మెల్యే రాయలసీమ లిఫ్ట్‌ను వ్యతిరేకిస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ ముగ్గురు.. ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతుండడమే విడ్డూరంగా ఉంది.
సదరు ముగ్గురు నేతలు అన్నట్లుగా.. ప్రకాశం జిల్లా తీవ్ర కరువు ప్రాంతమే. కానీ ఈ ముగ్గురు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు తూర్పు ప్రకాశంలో ఉంటాయి. నాగార్జున సాగర్ కెనాల్, పలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, గుండ్లకమ్మ నది ఉన్న ఈ ప్రాంతం ఏ మాత్రం కరువు ప్రాంతం కాదు. పశ్చిమ ప్రకాశంలో ఉన్న యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలు తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలు. ఈ ప్రాంత ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు 45 టీఎంసీల సామర్థ్యం గల వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే తీరుతాయి. వెలిగొండ ప్రాజెక్టుకు కూడా శ్రీశైలం నుంచే నీళ్లు రావాలి.
శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్‌కు, అక్కడ నుంచి పులిచింతలకు.. ఆ తర్వాత కృష్ణా బ్యారేజీకి వచ్చే కృష్ణమ్మ.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న డెల్టాను సస్యశ్యామలం చేస్తోంది. గోదావరి నదీ మాదిరిగా.. కృష్ణా నదిలో నిరంతర ప్రవాహం ఉండదు. ఎగువన కర్ణాటక, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ నిండిన తర్వాతే దిగువకు కృష్ణమ్మ వస్తోంది. ఫలితంగా పలు ఏడాదుల్లో శ్రీశైలం, సాగర్‌లు నిండని పరిస్థితి. ఫలితంగా సాగర్ పరిధిలోని ఆయకట్టులో సాగుచేయలేని దుస్థితి గతంలో నెలకొంది. ఈ దుస్థితిని తప్పించేందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని సంకల్పంచారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. కృష్ణా డెల్టా స్థిరీకరణతోపాటు రాయలసీమకు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సమృద్ధిగా నీరు అందుతుంది.
Also Read : బాబు చేయాల్సినవి, చేయలేనివి జగన్ ను చేయమంటున్న తమ్ముళ్లు..!
పోలవరం ప్రాజెక్టు కుడి కాలవ ప్రకాశం బ్యారేజీలో కలుస్తుంది. గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి చేరడం వల్ల.. కృష్ణా డెల్టాను గోదారమ్మ తడుపుతుంది. కృష్ణా డెల్టాకు వినియోగించే కృష్ణా జలాలను శ్రీశైలంలో ఆపి రాయలసీమ, ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టులను నింపవచ్చు. మరికొన్ని జలాలు నాగార్జున సాగర్ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళుతున్న సాగర్ జవహర్ కెనాల్ ద్వారా రెండు జిల్లాలోని 4.37 లక్షల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా నీరు అందుతుంది. పైగా.. నికర జలాలు మిగిలి ఉంటే.. దశాబ్ధాల తరబడి ప్రకాశం జిల్లా వాసుల డిమాండ్‌గా ఉన్న సాగర్ కాలువ పొడిగింపు గురించి కూడా ప్రజా ప్రతినిధులు ఆలోచన చేయవచ్చు.
వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. తమ నియోజకవర్గాలకు, ప్రకాశం జిల్లాకు ఏ మాత్రం సంబంధంలేని రాయలసీమ లిఫ్ట్ వల్ల నష్టమంటూ మాట్లాడితే చరిత్రహీనులవుతారు తప్పా.. ప్రజల మెప్పు పొందలేరు. రాజకీయ ప్రయోజనాల కోసం బాబు వేసే ఎత్తుల్లో ఇది కూడా ఒక భాగమే. రాయలసీమ లిఫ్ట్‌ను ఎవరు వ్యతిరేకించినా.. ఆ ప్రాంత ప్రజల దృష్టిలో వారు విలన్లే. సీమ, పశ్చిమ ప్రకాశంలో టీడీపీ పరిస్థితి అధ్వాన్నం. ఇప్పుడు ప్రకాశంలోని తమ పార్టీ ఎమ్మెల్యే ద్వారా రాయలసీమ లిఫ్ట్‌ను వ్యతిరేకింపజేస్తే.. సీమ వాసుల దృష్టిలో ప్రకాశం జిల్లా విలన్‌గా కనిపిస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరించి.. రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన బాబు.. ఆ తరహా రాజకీయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండని రుజువైనా.. బాబుకు ఆ అస్త్రం తప్పా.. ప్రజల మనస్సులను గెలుచుకునేందుకు మరేదీ లేనట్లుగా అర్థమవుతోంది. బాబు రాజకీయానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బలయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.
Also Read : చంద్రబాబు మరోసారి పవన్ తో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నాడా?