Idream media
Idream media
రైస్ పుల్లింగ్ మోసం మనకి కొత్తకాదు. నటి జయచిత్ర కొడుకు రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేసాడని వార్తలు వస్తే మళ్లీ చర్చకొచ్చింది. అతను మోసం చేసాడో లేదో పోలీసులు తేలుస్తారు. కానీ రైస్ పుల్లింగ్ చెంబు ఇస్తానంటే 22 కోట్లు ఇచ్చిన వాడి అజ్ఞానం చూస్తే నవ్వూ జాలి రెండు కలుగుతాయి.
దురాశ, అజ్ఞానం కవల పిల్లలు. ఆశ వివేకాన్ని చంపేస్తుంది. కొంత కాలం క్రితం “లైఫ్ స్టయిల్” యజమాని ఇలాగే ఎవరో మాంత్రికుల్ని నమ్మి మోసపోయాడు. అంత పెద్ద చైన్‌స్టోర్స్ నిర్వహించే వ్యక్తి తెలివి తక్కువ వాడేం కాదు. కానీ ఆశ, దురాశ! పూజలో నోట్ల కట్టలు పెడితే రెట్టింపు అవుతాయని నమ్మాడు.
లేనిది వూహించుకోవడం మానవ స్వభావం. దేవుడు, దెయ్యం కూడా ఇందులో భాగమే. దైవశక్తులున్నాయని నమ్మేవాళ్లు, క్షుద్రశక్తులున్నాయని నమ్మేవాళ్లు ఎప్పుడూ వుంటారు. రాగితో ఇరిడీయం లోహం కలిస్తే దానికి బియ్యాన్ని ఆకర్షించే గుణం వుంటుందని ఓ నమ్మకం. అలా తయారైన కాయిన్ లేదా పాత్రని ఇంట్లో పెట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయని విశ్వాసం. మోసగాళ్లకి ఇదో వరంగా మారింది.
డబ్బులు బాగా వుండి, మానసిక శాంతి లేని వాళ్లకి వల వేస్తారు. రైస్ పుల్లింగ్ కాయిన్ ఇంట్లో వుంటే అన్ని తొలగిపోతాయని నమ్మిస్తారు. లక్షల్లో వూడ్చేస్తారు. మోసపోయిన వాళ్లు పరువు పోతుందని మూసుకుని కూచుంటారు. ఇంకో రకం మోసం ఏమంటే తమ దగ్గర కాయిన్ వుందని, అది నాసా వాళ్లకి అమ్మితే కోట్లు వస్తాయని నమ్మిస్తారు. దీనికి పెట్టుబడి పెట్టిస్తారు. నాసా వాడికేమైనా పిచ్చా కాయిన్స్ కొనడానికి.
దేశమంతా ఈ మోసం వున్నా తమిళనాడులో మరీ ఎక్కువ. వాళ్లు ఏకంగా అన్ని రాష్ట్రాల్లో దుకాణాలు తెరిచారు. రైస్ పుల్లింగ్ కాయిన్‌ని గవర్నమెంటే కోట్ల రూపాయలు ఇచ్చి కొనేస్తుందని నమ్మేవాళ్లు వున్నారు. Rice puller.com అనే వెబ్‌సైట్‌లో చర్చలు కూడా జరుగుతుంటాయి.
20 ఏళ్ల క్రితం ఈ కాయిన్ కోసం వెతుకుతున్న మిత్రుడు తగిలాడు. నేను నమ్మలేదు. రష్యా సాహిత్యం నేర్పిన శాస్త్రీయత అది. పైకి చెప్పలేదు కానీ, ఆ తర్వాత అతను కొంత డబ్బు పోగొట్టుకున్నాడని తెలిసింది.
ఇది కాకుండా పల్లెల్లో లంకె బిందెల ముఠా ఒకటి సంచరిస్తూ వుంటుంది. ఏదో ఒక రోజు పోలీసులకి వాళ్లు దొరుకుతారు కానీ, లంకె బిందెలు ఎప్పటికీ దొరకవు. పూజలో బంగారం పెట్టించి కొట్టేసేవాళ్లు కోకొల్లలు.
డబ్బు సంపాదించడమే కష్టం. పోగొట్టడానికి ఒక రైస్‌పుల్లింగ్ కాయిన్ చాలు. జయచిత్రని అందరూ మరిచిపోతున్నపుడు కొడుకు వల్ల మళ్లీ వార్తల్లోకి వచ్చింది.