iDreamPost
iDreamPost
నలుగురినీ వెక్కిరించే గురివింద గింజ తన నలుపు ఎరగదన్నట్లు చంద్రబాబు తనయుడు లోకేష్ ఎగిరెగిరి పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను రంధ్రాన్వేషణ చేసి చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపించి తానేదో సాధించినట్లు బిల్డప్ ఇవ్వడం ఆయనకు పరిపాటి అయ్యింది. దుబాయ్ పరిశ్రమల ఎక్స్ పో లో ఏపీ స్టాల్ పెట్టడంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు నవ్వు తెప్పిస్తున్నాయి. గతంలో టీడీపీ హయాంలో పెట్టుబడుల సదస్సుల పేరుతో గాలిలో మేడలు కట్టి బొమ్మ చూపించిన ఘనతను తన వద్దే ఉంచుకుని.. ప్రస్తుత ప్రభుత్వం దుబాయ్ లో ఒక స్టాల్ పెడితే.. దాని వల్ల ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు.
స్టాల్ ఏర్పాటు ఉద్దేశం ఏమిటో తెలుసా?
ఆయాచితంగా వచ్చిన మంత్రిపదవి అనుభవించిన లోకేష్ కు అంతర్జాతీయ స్థాయిలో జరిగే పెట్టుబడుల సదస్సులు, ఎక్స్ పో ల్లో రాష్ట్రాలు ఎందుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తాయన్నది తెలుసా అన్న అనుమానాన్ని ఆయన వ్యాఖ్యలు రేకెత్తిస్తున్నాయి. ఇటువంటి సదస్సులో తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించి, పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి రాష్ట్రాలు స్టాల్స్ పెడుతుంటాయి. వాటి లక్ష్యం రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడమే. ఉన్నఫళంగా ఎవరూ పెట్టుబడులు పెట్టేయరు. ఈ విషయంలో లోకేష్ బాబుకు అవగాహన లేదేమో. అందుకే దుబాయ్ వెళ్లి రూ. 3 వేల కోట్లే సాధించారా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఖాళీ కుర్చీల ముందు ప్రసంగించడానికి వెళ్లారా అని వెటకారం చేస్తున్నారు. అది బహిరంగసభ కాదు.. వేలమంది రాలేదు,విఫలమయ్యారని విమర్శించడానికి. అది అంతర్జాతీయ ఎక్స్ పో పరిమిత సంఖ్యలోనే ఆహ్వానితులు ఉంటారు. వారిలోనూ సంబంధిత రంగానికి చెందిన వారే హాజరవుతారు. అయినా లోకేష్ రాజకీయానికి ఇవన్నీ అవసరం లేదు. విమర్శించడానికి చిన్న అంశం దొరికితే చాలు అన్న రాజకీయ దుగ్ద ఆయనగారిది.
గతంలో మీరు సాధించిన లక్షలకోట్ల పెట్టుబడులు ఏవీ?
2019కి ముందు ఐదేళ్లపాటు టీడీపీ అధికారంలో ఉంది. ఆ ఐదేళ్లు దావోస్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు వెళ్లి విదేశీ పెట్టుబడుల మూటలు తీసుకోస్తామని చంద్రబాబు, లోకేష్ పెద్ద పెద్ద బృందాలతో అక్కడ వాలిపోయేవారు. ఆహ్వానం అందకపోయినా కోట్లకు కోట్లు పెట్టి ఆహ్వాన పత్రికలు కొనుక్కొని మరీ వెళ్లేవారు. అప్పట్లో దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారన్నది ఇప్పటికీ బ్రహ్మపదార్థమే.
ఇక విశాఖలో ప్రతియేటా పెట్టుబడుల సదస్సు పేరుతో నాలుగేళ్లు అట్టహాసం చేశారు. రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అనేక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామన్నారు. ఈ లెక్కన ఆ ఐదేళ్లలో ఎంత తక్కువగా చూసినా రూ.50 లక్షల కోట్ల పెట్టుబడుల వరద రాష్ట్రాన్ని ముంచెత్తాలి. కానీ వాస్తవానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో అందరికీ తెలిసిందే. పైగా ఆ పెట్టుబడుల సదస్సుల పేరుతో ఏకంగా రూ. 120 కోట్లు మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు. పరిశ్రమల శాఖ చెప్పిన వాస్తవం. అధికారంలో ఉన్నప్పుడు ఇంత నిర్వాకం చేసిన చరిత్రను విస్మరించి.. ఏపీలో ఉన్న అవకాశాలను చెప్పి ఆకర్షించేందుకు ఒక స్టాల్ పెట్టడం పాపమన్నట్లు పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని విమర్శించడం ద్వారా లోకేష్ తన అవగాహన రాహిత్యాన్ని మరోమారు బయట పెట్టుకుంటున్నారు.
Also Read : విశాఖకు క్యూ కడుతున్నారు.. ఎందుకో తెలుసా..?