iDreamPost
iDreamPost
గడచిన కొద్ది రోజులుగా భారత్-చైనా మధ్య మొదలైన ఘర్షణ వాతావరణం వల్ల చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమండ్లు మొదలయ్యాయి. తాజాగా లడ్డాఖ్ ప్రాంతంలోని గాల్వన్ నది సమీపంలో డ్రాగన్ సైన్యం తీసిన దొంగదెబ్బతో నిషేధంపై డిమాండ్లు బాగా ఊపందుకుంది. ఈ డిమాండ్లకు తోడు కేంద్రమంత్రులు కూడా బహిరంగంగానే చైనా ఉత్పత్తులను బహిష్కరించండి అనే పిలుపివ్వటంతో దేశవ్యాప్తంగా ఇపుడు ఇదే అంశంపై చర్చలు పెరిగిపోతున్నాయి. చర్చలు, డిమాండ్లు బాగానే ఉన్నాయి కానీ అసలు చైనా ఉత్పత్తులపై ఇప్పటికప్పుడు నిషేధం, బహిష్కరణ సాధ్యమేనా ?
అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం చూస్తే ప్రపంచంలోని ప్రతి దేశం ఏదో ఓ రూపంలో చైనాపై ఆధారపడుతున్న విషయం కరోనా వైరస్ నేపధ్యంలో బయటపడింది.
మిగిలిన దేశాల విషయాన్ని వదిలేసినా మనదేశాన్ని 8146 చైనా ఉత్పత్తులు మార్కెట్ ను ముంచేత్తేస్తున్నాయి. చైనా నుండి మనదేశంలోకి మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్లలో వాడే ఉపకరణాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, టపాకాయలు, టివిలు, ఇంటెర్నెట్ ఆధారంగా పనిచేసే కంప్యూటర్ విడిభాగాలు, ల్యాప్ టాపులు, వైఫై రూటర్లు, దేవుడి బొమ్మలు, మెడికల్ ఎక్విప్మెంట్, ఆటోమొబైల్, టూ వీలర్లు, కొవ్వుత్తులు కూడా చివరకు చైనావే వాడుతున్నాం. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఏడాదికి చైనా నుండి దిగుమతుల విలువ సుమారు 5 లక్షల కోట్ల రూపాయలుంటుంది.
ప్రతి విషయంలోను చైనా దిగుమతులపై ఆధారపడుతున్న మనం చైనాకు చేస్తున్న ఎగుమతులు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. మనదేశం నుండి డ్రాగన్ దేశానికి కాటన్, దారం, ఇనుపఖనిజం, శుద్ది చేసిన రాగి ఎగుమతులవుతున్నాయి. వీటి విలువ ఏడాదికి సుమారు రూ. 1.25 లక్షల కోట్లుంటుందని అంచనా. మన దేశంలో చైనా పెట్టిన ప్రత్యక్ష పెట్టుబడులే సుమారు 20 వేల కోట్లు, పరోక్ష పెట్టుబడులు సుమారు రూ. 60 వేల కోట్లుంటుందని అంచనా. చైనాకు చెందిన ప్రముఖ సంస్ధలు ఆలీబాబా, షామీ, టెన్సెంట్, చైనా-యురేషియా ఎకనమిక్ కో ఆపరేటివ్ ఫండ్, దీదీ చుక్సింగ్, షున్ వెయ్ క్యాపిటల్ లాంటి సంస్ధలు మనదేశంలోని అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టున్నాయి.
అలాగే అందరికీ తెలిసిన పేటిఎం, స్నాప్ డీల్, ఓలా, స్విగ్గీ, జొమేటో, బిగ్ బాస్కెట్ లాంటి అనేక సంస్ధల్లో వేలాది కోట్ల రూపాయల చైనా పెట్టుబడులున్నాయి. ఇపుడిపుడే మనదేశం నుండి చైనాకు ఎగుమతులు పెరుగుతున్న విషయం గమనించాలి. అయితే అవేవీ చైనా దిగుమతుల విలువకు సమానం కావాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. చైనా ఉత్పత్తులను నిషేంధించాలని, బహిష్కరించాలనే డిమాండ్లు వినటానికి బాగానే ఉంటాయి కానీ ఆచరణలో అంత ఈజీకాదు. ఎందుకంటే డిమాండ్లు వ్యక్తిగతంగా ఉంటాయి. అదే ఆచరణలోకి రావాలంటే రెండు దేశాల మధ్య చేసుకున్న అనేక ఒప్పందాలు అడ్డంగా మారుతాయి.
చైనా నుండి మనదేశంలోకి దిగుమతులను మెల్లిగా తగ్గించటమే పరిష్కారం. చైనా వస్తువులను మనం నిషేధిస్తే మన ఎగుమతులను కూడా చైనా నిషేధిస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇపుడిపుడే ఆర్ధికంగా ఎదుగుతున్న మనదేశానికి ఇది చాలా ప్రమాదకరంగా మారుతుందని నిపుణులంటున్నారు. పైగా దిగుమతులను ఒక్కసారిగి నిషేధిస్తే మనకే నష్టం. ఎలాగంటే చైనా నుండి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులు మన దేశం నుండి మాయమైపోతే వాటికి ప్రత్యామ్నాయం కూడా మన దగ్గర లేదు. కాబట్టి మొదటికే మోసం వస్తుంది. చైనా ఉత్పత్తులకు మన దగ్గరే ప్రత్యామ్నాయ ఉత్పత్తులను మొదలుపెట్టాలి. టపాకాయల కొనుగోలు గడచిన రెండేళ్ళుగా తగ్గినా ఇంకా తగ్గాలి. ఇలాంటి వాటిని తక్షణమే నిషేధించినా నష్టంలేదు. అయితే ఏదో ఆవేశంలో వచ్చే డిమాండ్లపై ఆధారపడి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని అందరూ గ్రహించాలి.