iDreamPost
iDreamPost
చదివేస్తే ఉన్న మతి పోయిందన్నట్టు జనసేన పార్టీలో చేరాక మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఉన్న పరపతి పోతోంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దశాదిశా లేకుండా, అధ్యక్షుడి చిత్తానుసారం నడిచే పార్టీలో మనోహర్ ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వంపై చేసే విమర్శలు ఎటువంటి అధ్యయనం చేయకుండా చేస్తున్నారా అన్న అనుమానం కలిగేలా మరీ తీసికట్టుగా ఉంటున్నాయి. విద్యాధికుడు, స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి మరీ ఇంత నిరాధారమైన, లాజిక్‌కు అందని ఆరోపణలు చేస్తున్నారేమిటి? అన్న సందేహం కలుగుతోంది.
గతంలో గుంటూరు జిల్లా
చెరుకుపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన జమిందారీ వ్యవస్థను తలపిస్తోందని, వలంటీర్లను చూసి జనం భయపడుతున్నారని చౌకబారు విమర్శలు చేసి నవ్వులపాలయ్యారు. తాజాగా అమరావతిలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలను సృష్టించేది రాష్ట్ర ప్రభుత్వమేనని వ్యాఖ్యానించి విలేకరులను సైతం ఆశ్చర్యపరిచారు.
ప్రభుత్వం ఎందుకు సమస్యలు సృష్టిస్తుంది?
ఏ ప్రభుత్వమైనా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పాలన సజావుగా సాగాలని కోరుకుంటుంది. పరిష్కారానికి వీలుకాని చోట్ల బాధితులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపడుతుంది. అంతేకాని తానే సమస్యలను సృష్టించి, ప్రతిష్టను దిగజార్చుకుంటుందా? ఆ అవసరం ఏముంటుంది? అసలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏ సమస్యను సృష్టించిందో చెబితే మనోహర్ చేసిన ఆరోపణలో నిజం ఉందో లేదో అర్థమయ్యేది. అదేమీ లేకుండా చంద్రబాబు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ విద్యార్థిలా కామెంట్లు చేస్తే విశ్వసనీయత ఉంటుందా?
మాట్లాడితే మీనింగ్ ఉండొద్దా?
రెండు నెలలుగా ఉద్యోగులను హింసించి ఇబ్బందులు పెట్టారని ఆరోపించిన మనోహర్ వ్యాఖ్యలు గమనిస్తే ఆయన తెలుగు పదాలకు అర్థాలు తెలియకుండానే మాట్లాడేస్తున్నారేమోనన్న సందేహం కలుగుతోంది. చర్చలకు వచ్చిన ఉద్యోగ సంఘాల నాయకులను ప్రభుత్వం బెదిరించింది అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పగా, వారి పట్ల ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరించింది అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఉద్యోగులను ప్రభుత్వం భయపెట్టిందని అన్నారు. మనోహర్ ఏకంగా వారిని హింసించింది అంటున్నారు. ఈ లెక్కన మరో రెండు రోజులు పోతే చర్చల సందర్భంగా కొందరు ఉద్యోగులను ప్రభుత్వం చంపేసింది అని కూడా ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేసేలా ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు దుయ్యబడుతున్నారు.
ఆర్బీకేల ఏర్పాటు స్కాం అట!
రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పెద్ద స్కాం అని, రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితిని తీసుకువచ్చారని మనోహర్ చేసిన విమర్శను బట్టి పార్టీ అధ్యక్షుడు పవన్ మాదిరిగానే వర్తమాన పరిస్థితులపై కనీస అవగాహన లేకుండా ఈయన కూడా కామెంట్లు చేస్తున్నారని అర్థం అవుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆర్బీకే వ్యవస్థ వ్యవసాయంలో విప్లవాత్మకమైనది. రైతులకు కొండంత అండగా నిలబడింది. ఆర్బీకేల పనితీరును వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్, పలు రాష్ట్ర ప్రభుత్వాలు మెచ్చుకున్నాయి. తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఆ వ్యవస్థ ఒక స్కాం అని ఆరోపించేటప్పుడు అందుకు అధారాలు చూపాలి కదా? ఏ ఆధారం లేకుండా ప్రభుత్వానికి ఏయే అంశాల్లో పేరు వస్తోందో వాటిలో అవినీతి జరిగిపోతోందని ప్రచారం చేస్తే జనం నమ్ముతారా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్ట్ టైమ్ రాజకీయాలు చేసే జనసేనలో ఫుల్ టైమ్ వర్కర్ అయిన మనోహర్ ప్రభుత్వంపై ఇలా అర్థం లేని విమర్శలు చేయడంపై కాక ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : తమ్ముడి పార్టీ అన్నను అవమానిస్తోందా ?!