iDreamPost
android-app
ios-app

కేంద్ర బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది..?

కేంద్ర బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది..?

కరోనా ప్రభావంతో ప్రజల ఆదాయం తగ్గడం, ఆర్థిక వ్యవస్థకు ఊతం అవసరం అవడం, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆర్థిక కష్టాలలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలు.. ఇలా అనేక అంశాల నడుమ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభం అయిన తర్వాత నిర్మలమ్మ.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆమె బడ్జెట్‌ ప్రతులతో పార్లమెంట్‌కు చేరుకున్నారు. అంతకు ముందు ఆమె ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలసి రాష్ట్రపతిని కలిశారు. బడ్జెట్‌ గురించి రాష్ట్రపతికి వివరించారు.

బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు కేంద్ర మంత్రివర్గం కాసేపట్లో సమావేశం కానుంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత పార్లమెంట్‌ 11 గంటలకు ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతులను డిజిటల్‌ విధానంలో సభ్యులకు అందించనున్నారు. కొన్ని ప్రతులను మాత్రమే ప్రింట్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని ముఖ్యులు, మీడియా ప్రతినిధులకు అందించనుంది. నిర్మలా సీతారామన్‌ కూడా బడ్జెట్‌ వివరాలను ట్యాబ్‌లో చదివి వినిపించబోతున్నారు.

ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల నేపథ్యంలో.. తాజా బడ్జెట్‌ ప్రజారంజకంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ప్రజలపై వడ్డనలు ఉండబోవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆదాయపన్నులోనూ మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. వంట గ్యాస్‌ ధర వెయ్యి రూపాయలకు చేరుకున్న నేపథ్యంలో.. దాని ధరను తగ్గించే దిశగా నిర్ణయాలు ఉంటాయని సమాచారం. మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా తాజా బడ్జెట్‌ ఉంటుందనే తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ వివిధ వర్గాల ఆశలు, ఆకాంక్షలను ఏ మేరకు భర్తీ చేస్తుందో వెల్లడవుతుంది.

Also Read : జీడీపీ అభివృద్ధి భారీగా ఉంటుంది- ఎకనామిక్ సర్వే