iDreamPost
android-app
ios-app

ఏపీకి అదెలా సాధ్య‌మ‌వుతోంది..?

ఏపీకి అదెలా సాధ్య‌మ‌వుతోంది..?

ఉమ్మ‌డి రాష్ట్రంలోను, విభ‌జ‌న అనంత‌రం చంద్ర‌బాబు అధికారంలో ఉన్న సంద‌ర్భంలోనూ ఏపీలో ఇప్పుడున్నంత స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు లేవు. అయిన‌ప్ప‌టికీ కొత్త‌గా ఎవ‌రికైనా పింఛ‌ను ఇవ్వాల‌న్నా, రేష‌న్ కార్డు మంజూరు చేయాల‌న్నా ఎంతో ఆలోచించే వారు. అదో పెద్ద ప్ర‌హ‌స‌నంగా ఉండేది. ఎప్పుడూ ఎలా తొల‌గించాలా అని చూసే వారే త‌ప్పా.. ఇంకా ఎంత మంది అవ‌స‌రార్ధులు ఉన్నారో వెదికేవారు అరుదు. కానీ, గ‌త ప్ర‌భుత్వ అనాలోచిత నిర్ణ‌యాలు, క‌రోనా, లాక్ డౌన్ కార‌ణాల వ‌ల్ల ప్ర‌భుత్వానికి కూడా ఆర్థిక ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. అయితే, సీఎం జ‌గ‌న్ చేప‌డుతున్న సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితంగా ఆ ప్ర‌భావం సంక్షేమ ప‌థ‌కాల మీద కానీ, ప్ర‌భుత్వ స‌హాయం కోసం కొత్త‌గా అర్జీలు పెట్టుకునేవారి మీద కానీ ప‌డ‌డం లేదు. ఆర్థిక ప‌రిస్థితులు ఎలాగున్నా ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ఇబ్బందులూ క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతోంది. అందుకు నిద‌ర్శ‌న‌మే రాష్ట్రంలో మరో 59,062 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేయ‌డం. అదీ క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో.

క‌రోనా కాలంలో ఉన్న వాళ్ల‌కే ప‌థ‌కాలు, పింఛ‌న్లు అందించ‌డానికి ప‌లు రాష్ట్రాలు అప‌సోపాలు ప‌డుతున్న ప‌రిస్థితుల్లో ఏపీలో మాత్రం అందుకు విరుద్ధ‌మైన పాల‌న సాగుతోంది. ఏ ఒక్క సంక్షేమ ప‌థ‌కం ఆగ‌కుండా చూడ‌డ‌మే కాదు.. కొత్త‌గా మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు తాజాగా 59,062 కొత్త పింఛ‌న్లు మంజూరు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొత్త‌గా న‌మోదైన ల‌బ్ధిదారులు అంద‌రికీ మే 1వ తేదీ నుంచి పింఛను డబ్బులు చెల్లించనున్నారు. 4,431 మంది దీర్ఘకాలిక అనారోగ్య బాధితులతోపాటు 54,631 మందికి వృద్దాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కొత్తగా మంజూరయ్యాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 23 నెలల్లో తాజాగా మంజూరు చేసిన వాటితో కలిపి 14.17 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో రాజాబాబు వెల్లడించారు.

2020 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు 13.58 లక్షల మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయగా తాజాగా మంజూరైన వాటితో కలిపి 14.17 లక్షలకుపైగా చేరుకున్నట్లు వివరించారు. పక్షవాతంతో మంచానికి/వీల్‌ చైర్‌కి పరిమితమైన 1,875 మందికి తాజాగా మే నెల నుంచి పింఛన్లు మంజూరయ్యాయి. కండరాల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న 594 మందికి, ఇతర అనారోగ్య సమస్యలున్న 124 మందికి కూడా పింఛన్లు మంజూరయ్యాయి. 29,042 వృద్ధాప్య, 17,023 వితంతు, 10,404 దివ్యాంగ పింఛన్లను కూడా ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మే 1న మొత్తం 61.45 లక్షల మందికి ప్రభుత్వం రూ.1,483.69 కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది. వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేస్తారు.

అటు క‌రోనా క‌ట్ట‌డిలోనూ, వ్యాక్సినేష‌న్ లోనూ, సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగించ‌డంలోనూ ఏపీ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఆర్థికంగా ప‌టిష్ట‌మైన స్థితిలో ఉన్న రాష్ట్రాల‌కు కూడా ఇది సాధ్యం కావ‌డం లేదు. అలాంటిది న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ కు ఎలా సాధ్యం అవుతోంది అనేది అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న ప్ర‌శ్న. నిరంతర ప‌ర్య‌వేక్ష‌ణ‌, శాఖ‌ల వారీగా త‌ర‌చూ స‌మీక్ష‌ల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు ఇబ్బందుల‌ను అధిగ‌మించే చ‌ర్య‌లు చేప‌డితే ఎవ‌రికైనా సాధ్య‌మే అని సీఎం జ‌గ‌న్ నిరూపిస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.