iDreamPost
iDreamPost
టాలీవుడ్ కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన సందిగ్ధం తొలగించేందుకు కీలక ప్రయత్నం జరిగింది. ఏపీ సీఎం చెంతకు టాలీవుడ్ స్టార్ హీరోలు వేంచేయడం, ఆ సందర్భంగా చర్చలు ఫలప్రదం కావడం సినీ ప్రముఖులను సంతృప్తి పరిచింది. తమ సమస్యలను సామరస్యంగా విన్నారంటూ సీఎం జగన్ ని హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ తో పాటుగా రాజమౌళి కూడా కొనియాడారు. అదే సమయంలో హీరోలు, దర్శకులంతా మెగాస్టార్ చిరంజీవిని మెచ్చుకున్నారు. రాజమౌళి అయితే ఓ అడుగు ముందుకేశారు. టాలీవుడ్ పెద్ద అనడం చిరంజీవికి ఇష్టం లేకపోయినా ఆయనే పెద్ద అంటూ ప్రశంసించారు. జగన్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి సమస్య సాధనలో ఆయన చూపిన చొరవను అభినందించారు. దాంతో ఈ మొత్తం ఎపిసోడ్ లో చిరంజీవి హీరోగా మారారు. ఆయనకు టాలీవుడ్ లో ఉన్న గుర్తింపు మరింత బలపడింది.
చిరంజీవి అనేక అంశాల్లో తన అనుభవాన్ని, పరిచయాలను ఉపయోగించుకుని సమర్థవంతంగా వ్యవహరించడం ఇటీవల స్సష్టంగా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వ విధాన నిర్ణయాల పట్ల ఆయన స్పందించిన తీరు దానికి తార్కాణం. ఇంగ్లీష్ మీడియం నుంచి మూడు రాజధానుల వరకూ ఆయన జగన్ ఆలోచనకు అండగా నిలిచారు. ఏపీ అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలుగా పేర్కొన్నారు. దాంతో చిరు ఇమేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. తాజాగా టాలీవుడ్ , ఏపీ ప్రభుత్వం మధ్య పెద్ద వివాదంగా కొందరు చిత్రీకరించినప్పటికీ చిరంజీవి మాత్రం చాలా సులువుగా సమస్యను చక్కదిద్దడంలో చాకచక్యాన్ని చాటుకున్నారు. జగన్ స్సందించిన తీరుతో పులకిస్తూనే టాలీవుడ్ ఇకపై విశాఖలో అభివృద్ధికి తోడ్పడుతుందనే సంకేతాలు కూడా ఇచ్చారు. సినీరంగం విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు విస్తృతం చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. తద్వారా అటు పరిశ్రమకు, ఇటు ఏపీకి మేలు చేసేందుకు పూనుకుంటున్నట్టు స్పష్టం చేశారు.
ఈ పరిణామాలు చిరంజీవి పట్ల ఉన్న గౌరవాన్ని మరింత పెంచడానికి దోహదపడతాయనడంలో సందేహం లేదు. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి మరింత దిగజారిందనే చెప్పవచ్చు. పెద్దరికంతో చిరంజీవి అడుగులు వేస్తే, పొలిటికల్ పార్టీ అధినేతగా ఉన్న జనసేనాని పూర్తిగా బైపాస్ అయిపోవడం విశేషం.
సహజంగా ఈ అంశంలో రాజకీయంగా చొరవ తీసుకుని పరిష్కారానికి ప్రయత్నించి ఉంటే పవన్ రాజకీయ భవితవ్యానికి తోడ్పడేది. అటు టాలీవుడ్ లోనూ, ఇటు ఏపీ ప్రజల్లోనూ మంచి పేరు వచ్చేది. కానీ అది చిరంజీవికి వెళ్లిపోయింది. పవన్ చేతగానితనం బయటపడింది. ఆవేశంగా మాట్లాడి, హడావిడి చేయడం తప్ప నిర్మాణాత్మకంగా వ్యవహరించం పవన్ వల్ల కాని పని అని తేలిపోయింది. గతంలో అనేక మంది ప్రతిపక్ష నేతలు వివిధ సమస్యలపై పాలక పెద్దలతో భేటీ అయిన సందర్భాలున్నాయి. ఆయా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం ద్వారా కీర్తి గడించిన సందర్భాలున్నాయి. కానీ పవన్ వల్ల ఇవేమీ సాధ్యం కాలేదు. అదే సమయంలో స్వయంగా తాను కూడా ఎదుర్కోవాల్సిన సమస్య మీద కూడా సమర్థవంతంగా వ్యవహరించలేకపోవడం పవన్ బలహీనతను బయటపెట్టేసింది.
చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి పేర్ని నాని పరోక్షంగా పవన్ ను ఉద్దేశించి విమర్శలు చేయడం దానికి కొలమానం. ఎవడెవడో నోటికొచ్చింది మాట్లాడారంటూ నాని వ్యాఖ్యానించడం విశేషంగా చెప్పవచ్చు. నిత్యం జగన్ మీద ఆక్రోశం చాటుకోవడమే తప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవడం చేతకాదని తేలిపోయింది. ఏమయినా ఏపీలో ప్రజా సమస్యల మీదనే కాకుండా, తన సొంత ప్రయోజనాలతో కూడిన విషయంలో కూడా పవన్ వల్ల ఉపయోగంలేదని తేలిపోయింది. సినీరంగంలో కూడా పవన్ కి గుర్తింపు అంతంత మాత్రమేనని స్పష్టమయ్యింది. రాజకీయంగానూ ఇది జనసేన అధినేతకు శుభసూచికం కాదనే చెప్పాల్సి ఉంటుంది. రాజకీయాల్లో కూడా చిరంజీవి స్థాయికి చేరలేక చతికిలపడిన పవన్ ఇప్పుడు సమస్యల విషయంలో కూడా చొరవలేని వ్యక్తిగా చాటుకోవడం విస్మయకరం.
Also Read : టికెట్ రేట్ల సమస్యకు శుభం కార్డు.. మూడో వారంలో జీవో : చిరంజీవి