iDreamPost
android-app
ios-app

బెంగాల్ మంత్రి స‌న్నిహితురాలు అర్పితా ముఖర్జీ, 2 డబుల్ బెడ్ రూం ప్లాట్స్ లో రూ.50 కోట్లు ఎలా దాచారు?

  • Published Jul 28, 2022 | 7:31 PM Updated Updated Jul 28, 2022 | 7:31 PM
బెంగాల్ మంత్రి స‌న్నిహితురాలు అర్పితా ముఖర్జీ, 2 డబుల్ బెడ్ రూం ప్లాట్స్ లో రూ.50 కోట్లు ఎలా దాచారు?

బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన రెండు అపార్ట్‌మెంట్ల‌లో సోదాలు చేసిన‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అవినీతి సొమ్ము ఖ‌జానానే కనిపెట్టింది. రెండు రోజుల్లో రూ.50 కోట్ల డ‌బ్బు దొరికింది. మొదటి అపార్ట్‌మెంట్‌లో రూ.21.90 కోట్లు, నిన్న రాత్రి ఆమె మరో ఇంట్లో రూ.27.90 కోట్ల నగదు దొరికింది. అన్నీ నోట్ల క‌ట్ట‌లు. 50 కోట్లు అంటే మాట‌లు కాదు. వాటిని దాయ‌డానికి చాలా స్పేస్ కావాలి.

ED ఒక అల్మారా తెరిచింది. అక్క‌డ‌న్నీ బాగా త‌క్కువ రేటున్న బ్యాగ్ లు క‌నిపించాయి. వాటిని విప్పిచూస్తే, లోపల బ్రౌన్ టేప్‌తో పార్శిల్ చేసిన ప్యాకెట్ లున్నాయి.

వాటి లోపల ఏముందో చూసిన‌ అధికారులు నివ్వెరపోయారు. అన్నీ రూ.2000 నోట్లే. ఒక్క‌ ప్యాకెట్ లో రూ.50 లక్షలున్నాయి. అలాంటి బ్యాగుల‌న్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన అల్మారాల్లోనూ ఇలాంటి సంచులు చాలానే ఉన్నాయి.

న‌గదుతో పాటు సుమారు రూ.4.31 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, ఇటుకలను కూడా కప్‌బోర్డ్‌లోని లాకర్ల నుంచి ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. ఒక్కొక్కటి కేజీ బరువున్న మూడు బంగారు ఇటుకలు, అర‌కిలో ఉన్న‌ ఆరు కంగన్ (బ్రాస్లెట్లు), బంగారు పెన్ను సహా ఇతర బంగారు ఆభరణాలు దొరికాయి.

ఇక బంగారాన్ని రికవరీ చేసేందుకు లాకర్లను పగులగొట్టారంట‌. అందులో కేజీల కొద్దీ బంగార‌పు న‌గ‌లు.

టాప్‌స్కేల్ టోలీగంజ్ ప్రాంతంలో రెండు పడక గదుల అపార్ట్‌మెంట్‌పై ED అధికారులు దాడి చేస్తే ఒక గదికి తాళం వేసి ఉంది. కీని అడితే , ఆ గది లోపల ఏమీ లేదని అర్పిత చెప్పింది. కాని ఈడీకి డౌట్ ఉంది. అందుకే దాన్ని ప‌గ‌ల‌గొట్టి ఓపెన్ చేస్తే? సంచుల్లో ప్యాకెట్లు. కొన్ని ప్యాకెట్లు అల్మారాలో ఉంచితే, మిగిలిన వాటిని దాచ‌డానికి ప్లేస్ లేక గదిలో ఒక మూలలో ఉంచారు.

ఇదంతా డ‌బ్బు. బెల్గాచియా అపార్ట్‌మెంట్ లో డబ్బు కట్టలుగా, ప్యాకెట్లలో చక్కగా అర్పిత పేర్చింది. కాని టోలీగంజ్ ఫ్లాట్‌లో అల్మారాల నిండా నోట్ల క‌ట్ట‌లు. డ‌బ్బును దాయ‌డానికే ఈ ప్లాట్ ఉన్న‌ట్లుంది.

ఈ డ‌బ్బంతా త‌న‌దేన‌ని, వ్యాపారాల్లో సంపాదించాన‌ని అర్పితా ముఖర్జీ చెప్పింది. అయితే, అధికారులు గ‌ట్టిగా అడిగితే ఆ డ‌బ్బంతా మంత్రి పార్థ ఛటర్జీదేన‌ని ఒప్పుకుంది.