కేసీఆర్ అంత స్పష్టంగా చెప్పినా వాళ్ళు లెక్క చేయటంలేదు

కరోనా వైరస్ నియంత్రణ, లాక్ డౌన్ నిబంధనల సడలింపు పై నిన్న ఆదివారం సుదీర్ఘ మంత్రివర్గ సమావేశం అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రివర్గ నిర్ణయాలను సవివరంగా వెల్లడించారు. ఇందులో ఇంటి అద్దె విషయం కూడా ఒకటి. లాక్ డౌన్ వల్ల సంపాదన లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొంటూ.. ఇళ్ల యజమానులు అద్దె కోసం తమ గృహాలలో అద్దెకు ఉంటున్న వారిని బలవంతం పెట్టొద్దని చెప్పారు.

అంతేకాదు చట్టప్రకారం ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఉపయోగించుకుని మార్చి, ఏప్రిల్ , మే.. మూడు నెలలపాటు వాయిదా వేసుకోవాలని మంత్రివర్గం తీర్మానించిందని తెలిపారు. మూడు నెలల తర్వాత పరిస్థితిని బట్టి అద్దె పెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ చెప్పారు. ఐతే దాని పై వడ్డీ కూడా వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. ఇది విజ్ఞప్తి కాదని, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశమని స్పష్టం చేశారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ ఎవరైనా అద్దె కోసం వేధిస్తే వన్ డబల్ జీరో కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

సీఎం కేసీఆర్ ఇంత స్పష్టంగా చెప్పి 24 గంటలు కాకముందే హైదరాబాద్ నగరంలో ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి తేవడం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ సూచనను మనసులో పెట్టుకున్న అద్దె జీవులు వెంటనే 100 ఫోన్ చేశారు. ఈ రోజు 100 కి 36 మంది ఫిర్యాదు చేశారని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. వారందరినీ పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

ఇళ్ల యజమానులు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మూడు నెలల అద్దెను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయలేదు. మూడు నెలల అద్దె ఆదాయాన్ని వదులుకోవాలని చెప్పలేదు. కేవలం మూడు నెలలపాటు వాయిదా వేసుకోవాలని మాత్రమే చెప్పింది. ఆ తరువాత ఎలాగూ అద్దె బకాయిలు వస్తాయి. ఐనా రెండు నెలల అడ్వాన్స్ ఎలాగూ ఉంది. ఇక పోతే ఒక్క నెల మాత్రమే వాయిదా వేసుకుంటున్నట్లు. ఇవన్నీ పెడచెవిన పెట్టి.. అద్దె కట్టాల్సిందే అంటే.. పోలీసుల కౌన్సెలింగ్ తప్పదు. ఆపత్కాలం లో మానవత్వం తో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Show comments