Krishna Kowshik
Krishna Kowshik
గజిబిజీ, ఉరుకుల పరుగుల జీవితంలో అంతా హడావుడిగానే జరుగుతుంది. ఇక ఏదైనా ఊరు వెళ్లాలంటే ముందు నుండి ప్రణాళికలు వేసుకున్నప్పటికీ.. ప్రయాణం చేసే సమయానికి మాత్రం కాస్త కంగారు పుడుతుంది. ఈ క్రమంలో మన చేతిలో ఉన్న లగేజీలను బస్సుల్లో, రైళ్లల్లో, ఆటోల్లో వదిలేస్తుంటాం. అయితే ఒకసారి పోయిన వస్తువులు, బ్యాగులు దొరకడం చాలా అరుదు. పొగొట్టుకున్న వస్తువులు తిరిగి మన వద్దకు రావాలంటే.. వాటిని చూసిన వ్యక్తుల్లో నిజాయితీ ఉండాలి. సాటి మనిషి మంచి మనస్సు ఉంటే కచ్చితంగా మన వస్తువులు మనకు లభిస్తాయి. అయితే అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆ కోవకే వస్తారు ఒంగోలుకు చెందిన కట్టా సుబ్బయ్య అనే ఆటో డ్రైవర్.
ఈ నెల 3న రాత్రి కిరాయి కోసం ఆటోలో వెళుతుండగా.. అద్దంకి బస్టాండ్ సెంటర్‌లోని సోనోవిజన్ దగ్గర రోడ్డుపై బ్యాగ్ పడి ఉండటాన్ని చూశాడు. వెంటనే సుబ్బయ్య గుర్తించి.. ఆ బ్యాగును తెరిచి చూస్తే బంగారు ఆభరణాలు ఉన్నాయి. వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ బ్యాగును అప్పగించారు. ఈ బ్యాగు గురించి ఆరా తీయగా ఒంగోలు మండలం కరవదికి చెందిన పొట్టేళ్ల భాస్కరరావుదిగా గుర్తించారు. పోలీసులు అతడ్ని స్టేషన్‌కు పిలిపించారు. కాగా, బ్యాగులో రూ. 8.50 లక్షల విలువైన 21 సవర్ల బంగారు ఆభరణాలున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌లో ఉండే తన కుమార్తె వద్దకు వెళ్లే క్రమంలో ఒంగోలులో బస్ ఎక్కేందుకు వెళుతున్న సమయంలో పడిపోయినట్లు భాస్కరరావు చెప్పారు. అనంతరం వాటిని భాస్కరరావుకు అప్పగించారు పోలీసులు. అంత బంగారం ఉన్నా.. మనస్సు చలించలేదు సరికదా.. వాటిని పోలీసులకు అప్పగించి..తన నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ సుబ్బయ్యను ఎస్పీ మలికా గర్గ్ ప్రత్యేకంగా అభినందించారు. అతడికి నగదు రివార్డు కూడా అందించారు. ప్రస్తుత సమాజంలో ఆటో డ్రైవర్ అంటే ఒక రకమైన నెగిటివి ఉంది. రోడ్డుపై దొరికిన బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి అతడి నిజాయితీ చాటుకోవడంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.