Idream media
Idream media
పాకిస్తాన్ ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహం ఖాన్ ప్రయాణిస్తున్న కారుపై ఆదివారం రాత్రి ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఇస్లామాబాద్‌లోని షామ్స్ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తన మేనల్లుడి వివాహానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కారుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారని రేహం తెలిపారు. ఈ సమయంలో తన వ్యక్తిగత కార్యదర్శి, డ్రైవర్ కూడా ఉన్నారని… అయితే ఎవరికీ ఏమీ కాలేదన్నారు.
ఇదేనా ఇమ్రాన్ కొత్త పాకిస్తాన్?
కాల్పుల ఘటనపై తీవ్రంగా స్పందించిన రేహం.. ఇమ్రాన్ పాలనపై విరుచుకుపడ్డారు. ‘‘ఇదేనా ఇమ్రాన్ కొత్త పాకిస్తాన్ ..?’’ అని ప్రశ్నించారు. దేశంలో శాంతి భద్రతలు మృగ్యమయ్యాయనడానికి తన కారుపై జరిగిన కాల్పులే నిదర్శనమని ట్విట్టర్ వేదిగా దుయ్యబట్టారు. ‘‘నా మేనల్లుడి పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా బైక్ వచ్చిన ఇద్దరు దుండగులు కారుపై కాల్పులు జరిపారు. ఇదేనా ఇమ్రాన్ ఖాన్ కొత్త పాకిస్తాన్? పిరికివాళ్లు, దుండగులు, అత్యాశాపరులకు ఇదే స్వాగతం’’ అని ఆమె వరుస ట్వీట్లు చేశారు.
‘‘ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఒక సాధారణ పాకిస్తానీగా జీవించేందుకు, మరణించేందుకు నేను సిద్ధమే. కానీ, ప్రధాన హైవేపై జరిగిన ఈ ఘటన శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేయడం లేదా? దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని పేర్కొన్నారు. ‘‘తుపాకీ కాల్పులు జరిగిన సమయంలో ఇద్దరు సిబ్బంది కారులో ఉన్నారు. అదృష్టవశాత్తు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేశాను. ఎఫ్‌ఐఆర్ కాపీ కోసం ఎదురు చూస్తున్నా’’ అని మరో ట్వీట్ చేశారు. ‘‘నేను గాయపడినా.. మరణించినా.. ఫర్వాలేదు. కానీ, నా కోసం పనిచేసేవారి కోసమే ఆవేదన చెందుతున్నా. రాత్రంగా పోలీసులు మమ్మల్ని ప్రశ్నించారు’’ అని రేహం ఖాన్ తెలిపారు.
Also Read : నిపుణుల హెచ్చరికలు.. కేంద్ర, రాష్ట్రాల కీలక నిర్ణయాలు..