Idream media
Idream media
హీరో వల్ల ఒకరు చనిపోతారు. అతని ఇంటికి హీరో వెళ్లి వుండడం. మహేశ్‌బాబు “అతడు” గుర్తుకు వస్తోందా? ఇదొకటే కాదు అతడులో అనేక సినిమాలుంటాయి.
1988లో “ది టెన్త్ మ్యాన్” అనే సినిమా వచ్చింది. ఆంథోని హాప్కిన్స్ హీరో . గ్రాహంగ్రీన్ రాసిన చిన్న నవల దీనికి ఆధారం. గ్రాహం అనేకసార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. కానీ దురదృష్టం, రాలేదు.
Also Read: “మోసగాళ్లకి మోసగాడు”కి 50 ఏళ్లు
రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి కథ. పారిస్‌ని నాజీలు ఆక్రమించారు. పారిస్‌కి కొంచెం దూరంలో ఒక పల్లె. హీరో అక్కడ్నుంచి రైలులో పారిస్ వచ్చి లాయర్‌గా పనిచేస్తూ వుంటాడు. ఒక రోజు వీధిలో వెళుతున్న అతన్ని జర్మన్ సైనికులు అరెస్ట్ చేస్తారు. కారణం లేకుండానే పౌరుల్ని అరెస్ట్ చేసి శిబిరాలకి తరలించడం నాజీలకి అలవాటే. జర్మన్ సైనికుల మీద ఎవరైనా తిరుగుబాటుదారులు దాడి చేస్తే, అమాయకులైన పౌరుల్ని ప్రతీకారంగా చంపి రోడ్ల మీద పడేసేవాళ్లు.
జైలులో హీరోతో పాటు 30 మంది. బతుకుకి, చావుకి తేడా తెలియని స్థితి. ఒకరోజు అధికారి వచ్చి , ప్రతి 10 మందిలో ఒకరిని , అంటే మొత్తం ముగ్గుర్ని తెల్లారి కాల్చి చంపుతామని , ఎవరు చచ్చిపోవాలో తేల్చుకుని సిద్ధంగా వుండమని చెప్పి వెళ్తాడు.
Also Read: కులం కోణంలో శ్రీదేవి సోడా సెంటర్!
చచ్చిపోవడం ఎవరికి మాత్రం ఇష్టం. లాటరీ తీద్దామంటారు. 30 కాగితాల్లో 3 ఇంటూ మార్కు కాగితాలు. అవి వస్తే మృత్యువే. హీరో కాగితంలో మరణ గుర్తు. వణికిపోతాడు. తనకి బదులు ఎవరైనా మరణిస్తే ఆస్తి మొత్తం ఇచ్చేస్తానంటాడు. ఇల్లు, డబ్బు మూడు మిలియన్ ఫ్రాంక్స్. చచ్చిపోయిన తర్వాత డబ్బులెందుకు అంటారు. ఒక వ్యక్తి మాత్రం ఆశ పడతాడు. అతడికి చెల్లి, తల్లి ఉన్నారు. ఆ డబ్బుతో బతికినంత కాలం సుఖంగా ఉంటారు. అప్పటికప్పుడు హీరో ఒక కాగితంపై రాసి ఇస్తాడు. కాసేపటికి అతడిలో అపరాధ భావన. తన వల్ల ఒక మనిషి చనిపోవడమా? వద్దు, తానే చచ్చిపోతానంటాడు. కానీ అతను ఒప్పుకోడు. ఆ రాత్రంతా తన తల్లి, చెల్లి వుండబోయే పెద్ద ఇల్లు గురించి కబుర్లు చెప్పమంటాడు. తెల్లారి అతన్ని కాల్చేస్తారు.
మూడేళ్ల తర్వాత యుద్ధం అయిపోయింది. జైలు నుంచి విడుదల. పల్లెకి వెళ్తాడు. అక్కడ తన ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు. తన కోసం చనిపోయిన వ్యక్తి తల్లి, చెల్లి వాళ్లు సంతోషంగా లేరు. అన్యాయంగా చనిపోయిన బిడ్డ గురించి తల్లిలో దిగులు. చెల్లిలో దుక్కం. తాను వాళ్ల అబ్బాయిని స్నేహితున్ని అని చెప్పి ఆ ఇంట్లో పనివాడుగా కుదురుకుంటాడు. తానంటే వాళ్లకి విపరీతమైన ద్వేషం, అసహ్యం అని తెలుసుకుని ఎప్పటికీ తానెవరో చెప్పకూడదనుకుంటాడు. ఒకరోజు హీరో పేరుతో ఒకడు ప్రవేశిస్తాడు. వాడి ప్రాడ్ అని హీరోకి తెలుసు. అసలు మనిషి తానేనని చెప్పలేడు. చివరికి చనిపోతాడు. అద్భుతమైన ఎమోషనల్ డ్రామా. యూట్యూబ్‌లో వుంటుంది చూడండి.
Also Read: క్యారెక్టర్ లేని రాజరాజచోరుడు