iDreamPost
iDreamPost
‘నదుల మీద నిర్మించే సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాల వంటివి’అని దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. ప్రాజెక్టులు ఒక్కటే కాదు… చిన్నచిన్న ఆనకట్టలు.. వాటికి అనుసంధానంగా ఉండే కాలువలు.. అక్విడెక్టులు.. ఇలా సాగునీటిపారుదల కోసం నిర్మించిన ఏ కట్టడమైనా ఆధునిక దేవాలయాలతో సమానమే.
దేశంలో అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాల్లో సాగునీటి పారుదల వ్యవస్థ గురించి చెప్పుకుంటే ముందుగా గుర్తుకు వచ్చేది కల్నల్ సర్ ఆర్థర్ కాటన్. ఆ మహానుభావుడు ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించడం ద్వారా కరువుతో అల్లాడుతున్న ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేశారు. ధవళేశ్వరం వద్ద అక్విడెక్టు నిర్మాణం ఒక్కటే కాదు.. గోదావరి డెల్టాలో చివర ఎకరా వరకు సాగునీరు అందించాలనే తలంపుతో ఆయన ఏర్పరిచిన కాలువ వ్యవస్థ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇందుకోసం ఆయన రేయనక, పగలనక శ్రమించారు. ఆయన చేపట్టిన డెల్టా కాలువ వ్యవస్థలో ‘గన్నవరం అక్విడెక్టు’ ఒకటి. ఇది రాజోలు (నగరం) దీవి చరిత్రనే ఈ అక్విడెక్టు మార్చివేసింది.
ఒకవైపు సముద్రం.. మరోవైపు వైనతేయ.. వశిష్ఠ నదీపాయల మధ్య ఒదిగి ఉండే దీవి ‘నగరం’. పచ్చని కోనసీమ ఒక దీవి అయితే అందులో ఉప దీవి రాజోలు. మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలు ఉన్నాయి. ఈ దీవికి కోనసీమకు మధ్య వైనతేయ నదీపాయ ఉంది. ఈ పాయను దాటితే కాని జిల్లాకు, ఈ దీవికి నేరుగా రాకపోకలు సాగవు. అలాగే గోదావరి డెల్టా సాగునీటి పారుదల వ్యవస్థ దీవిలోని రైతులకు అందదు. ఇందుకోసం ఇక్కడ అక్విడెక్టు (జలవాహిని) నిర్మాణం అవసరమని మొదట్లోనే గుర్తించారు కాటన్. ఇది జరిగితేనే ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన లక్ష్యం నెరవేరుతుందని ఆయన విశ్వసించారు. పైగా అప్పట్లో ఉన్న జలరవాణా వ్యవస్థ బలోపేతమవుతుందని భావించారు. దీనిలో భాగంగా పి.గన్నవరం వద్ద అక్విడెక్టు నిర్మిస్తే అన్ని విధాలుగాను మేలు జరుగుతుందని కాటన్ ఆశించారు. ఈ మేరకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి 1851 ఆగస్టు 16వ తేదీన తగిన అంచనాలతో ప్రతిపాదనలు పంపించారు.
Also Read : Antarvedi – సముద్రపు అలజడి… దేనికి సంకేతం?
తొలి అంచనా రూ.73 వేలు:..
ఒక్కొక్కటీ 40 అడుగులు చొప్పున 39 స్తంభాలతో ఆర్చిలు నిర్మించాలని, దానిపై 15 అడుగుల వెడల్పున కాలువ నిర్మాణం చేయాలని తొలుత ప్రతిపాదించారు. అలాగే ఒకవైపు పడవను తాళ్లతో లాగేందుకు సరంగులు నడిచే విధంగాను, మరోవైపు తొమ్మిది అడుగుల వెడల్పున రాకపోకలకు అనువుగా బాటను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గోదావరి వరద ఉప్పొంగినప్పుడు అక్విడెక్టు మీద నుంచి నీరు పారుతుందని గుర్తించి కాలువకు ఇరువైపులా వరదల సమయంలో నీరు కాలువ ద్వారా బయటకు రాకుండా లాకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వరదల సమయంలో స్తంభాల అడుగున పునాది దెబ్బతినకుండా నది ప్రవాహం వైపున 10 గజాలు, దిగువున సముద్రం వైపు 20గజాల బలమైన రాతితో చపటా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనిని తన వద్ద అసిస్టెంట్‌గా ఉన్న లెెఫ్టినెంట్ ఎఫ్.టి.హేగ్ అనే ఇంజనీరుకు అప్పగించి కాటన్ స్వయంగా పనులు పర్యవేక్షించారు.
సామాగ్రి అనుకున్న సమయానికి అందకపోవడం.. వరదల వల్ల నిర్మాణం అనుకున్న సమయానికి అవలేదు. వరదల వల్ల పలు సందర్భాల్లో నిర్మాణం కృంగిపోవడం, కొట్టుకుపోవడం జరిగింది. 1859లో నిర్మాణం పూర్తయింది. ఈ కారణంగా నిర్మాణ వ్యయం రూ.1 లక్ష 68 వేల 935కు చేరింది. దీనిపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం వివరణ కోరగా, కాటన్ వారికి కారణాలు వివరించి ఒప్పించారు. తరువాత దీనిని 1949లో నాటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం మరమ్మత్తులు చేసింది.
మారిన రాజోలు దీవి చరిత్ర..
దీని నిర్మాణంతో రాజోలు దీవి చరిత్ర మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. వరి చేలకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందింది. వేలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఆనకట్ట కట్టిన తొలినాళ్లలో పి.గన్నవరం కాలువ మీద సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టులో సాగు జరిగితే అందులో మూడింట రెండవ వంతు అనగా 26 వేల ఎకరాలు రాజోలు దీవిలోనే కావడం విశేషం. అక్విడెక్టు వల్ల కాలువ వ్యవస్థ ఏర్పడడం వస్తు, ప్రజా రవాణ వ్యవస్థ మెరుగు పడింది. రాజోలు, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల నుంచి పి.గన్నవరం మీదుగా బొబ్బర్లంక వరకు, అక్కడ నుంచి రాజమహేంద్రవరం వరకు సరుకు, ప్రజా రవాణ జరిగింది. 9 అడుగుల రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల ప్రజా రవాణా ఊపందుకుంది.
Also Read : నది మన జీవనం
141 ఏళ్ల పాటు సేవలు..
నిర్మాణ దశలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. వరదల వల్ల స్తంభాలు బీటులు వాటిల్లడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నా సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించిన అక్విడెక్టు 141 ఏళ్లకు పైగా సేవలందించింది. 1986లో గోదావరికి వచ్చిన అతిపెద్ద వరదను సైతం తట్టుకుంది. తొలి రోజుల్లో రాజోలు దీవిలో 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించిన ఈ అక్విడెక్టు తరువాత కాలంలో సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడింది. 1985లో ధవళేశ్వరం ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ నిర్మాణం జరిగింది. దీనితో సాగు విస్తీర్ణం మరింత పెరిగింది. బ్యారేజ్ నిర్మాణం తరువాత రాజోలు దీవిలో 64 వేల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. ఖరీఫ్, రబీ రెండు పంటలకు నీరందుతోంది. 30 వేల ఎకరాల్లో కొబ్బరిసాగవుతోంది. మరో పది వేల ఎకరాల్లో చేపల సాగు ఉంది. వీటన్నింటికీ పాత అక్విడెక్టు ద్వారానే నీరందేది.
1970ల నుంచి పడవ రవాణ నిలిచిపోయింది. దీని స్థానంలో మోటారు వాహనాలు వచ్చాయి. రాజోలు దీవిలో చమురు, సహజవాయుల కంపెనీల కార్యకలాపాలు పెరగడంతో భారీ వాహనాలు ఈ అక్విడెక్టు మీదగా రాకపోకలు సాగించాయి. వీటన్నింటినీ తట్టుకుని ఈ అక్విడెక్టు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. 2000లో ఈ అక్విడెక్టు స్థానంలో కొత్త అక్విడెక్టు నిర్మాణం చేశారు. నాటి నుంచి దీనిమీద రాకపోకలు నిలిపివేశారు. కొత్త అక్విడెక్టును నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆ సమయంలో పాత అక్విడెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పాత అక్విడెక్టు చెక్కుచెదరలేదు.
Also Read : పోల‘వర’మే.. డెల్టాకు ఎడారి అంటూ తప్పుడు ప్రచారం