iDreamPost
iDreamPost
వందేళ్లకుపైగా ప్రస్థానం.. వేలాదిమందికి ఉపాధి చూపిన వైభవం. యజమానితోపాటు తానూ వృద్ధాప్యంలోకి జారుకుంది. దానికితోడు ఇతర అనేకానేక సమస్యలు చుట్టుముట్టడంతో చేసిన పరిశ్రమ చాలనుకుని శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ ఇన్నాళ్లు తనపై ఆధారపడిన ఉద్యోగ, కార్మికవర్గాలకు ఇవ్వాల్సినవి ఇచ్చే వెళ్లింది. కొన్ని దశాబ్దాలుగా తమకు కూడు, గూడు, గుడ్డ కల్పించి అండగా నిలిచిన పరిశ్రమ కాలగర్భంలో కలిసిపోతుంటే.. కార్మికులు కన్నీటితో వీడ్కోలు పలికారు. విశాఖ జిల్లాలో పురాతన పరిశ్రమల్లో ఒకటైన భీమిలి పరిధిలోని చిట్టివలస జ్యూట్ మిల్లు ప్రస్థానం ముగిసిపోయింది. అది ఇక చరిత్ర పుటల్లోనే మనకు కనిపిస్తుంది.
సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మెరుపులు, మరకలు
చిట్టివలస జ్యూట్ మిల్లును స్వాతంత్ర్యానికి పూర్వమే స్థాపించారు. మొదట్లో బెల్లం, నీలిమందు ఉత్పత్తి చేసేవారు. 1926లో డచ్ పాలన సమయంలో దీన్ని జ్యూట్(జనపనార) ఫ్యాక్టరీగా మార్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కోల్ కతాకు చెందిన పారిశ్రామిక వేత్త భజోరియా దీన్ని కొనుగోలు చేశారు. అప్పటి నుంచీ ఆ కుటుంబ యాజమాన్యంలోనే పరిశ్రమ మనుగడ సాగించింది. 68.02 ఎకరాల విస్తీర్ణంలో కర్మగారంతో పాటు ఉద్యోగులు, కార్మికులకు 500 నివాస గృహాలు, రిక్రియేషన్ క్లబ్, ఫుట్ బాల్ మైదానం, కార్మిక సంక్షేమ కేంద్రం, కళ్యాణ మండపం వంటి ఎన్నో సౌకర్యాలతో కార్మిక పెన్నిధిగా అలరారింది.
ప్రగతికి ప్రతిబంధకాలు
ఒకప్పుడు ఉపాధి కేంద్రంగా విలసిల్లిన జ్యూట్ మిల్లు క్రమంగా కష్టాల్లో చిక్కుకుంది. దీనికి ప్రధానమైన ముడిసరుకు జనపనార. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ పంట ఉత్పత్తులు ఏమాత్రం సరిపోని పరిస్థితుల్లో బంగ్లాదేశ్, బర్మా, ఉత్తరప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల రవాణా ఛార్జీల భారం పెరుగుతోంది. మరోవైపు ఏడాది పొడవునా ఉత్పత్తి జరగదు. పంట లేని వేసవికాలంలో మిల్లులో పని ఉండదు. అన్నింటికీ మించి ఫ్యాక్టరీ యజమానులు కోల్ కతాలో ఉంటారు. వారి తరఫున ఇక్కడ యాజమాన్య ప్రతినిధులు గా వ్యవహరించినవారు నిర్వహణ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడటం.. క్రమంగా కార్మిక సంఘాల ప్రాబల్యం పెరిగి తరచూ సమ్మెలు, ఆందోళనలతో ఉత్పత్తికి విఘాతం కలగడం వంటివి ఫ్యాక్టరీ మనుగడను దెబ్బతీశాయి.
Also Read : Vadapalli Venkateswara Swamy Temple – వాడపల్లి.. మరో జలియన్ వాలాబాగ్
ఈ పరిస్థితులకు తోడు ఫేక్టరీ యజమాని వృద్ధాప్యంలో ఉండటం, వారసులు పట్టించుకోకపోవడంతో 2009 తర్వాత మిల్లు చక్రాలు తిరగలేదు. కార్మిక ఉద్యమాలు, ముడిసరుకు కొరత పేరుతో 2009 ఏప్రిల్ 20న యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. అప్పటి నుంచి కార్మికులు మిల్లు తెరవాలని కోరుతూ చేసిన ఉద్యమాలు ఫలించలేదు.. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు సైతం పట్టించుకోలేదు.
వైఎస్సార్సీపీ వచ్చాక కార్మికులకు సెటిల్మెంట్
మిల్లు తెరుచుకోక, జీతాలు, ఫైనల్ సెటిల్మెంట్లు జరక్క తీవ్ర ఇబ్బందులు పడిన కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం జరిగింది. మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలుమార్లు యాజమాన్య, కార్మిక ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. ఫ్యాక్టరీని ఇక తెరిచే అవకాశం లేకపోవడంతో లాకౌట్ నాటికి ఉన్న 5 వేలకుపైగా కార్మికులకు ఫైనల్ సెటిల్మెంట్ గా ఆర్థిక పరిహారం ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఆ మేరకు చెల్లింపులు పూర్తి కావడంతో ఫ్యాక్టరీ స్థలాలు, ఇతర ఆస్తులను అమ్మేశారు. దాంతో కొనుగోలుదారులు గోడౌన్లు కులగొట్టి కలప, ఇతర స్క్రాప్ తరలిస్తున్నారు.
జాతీయస్థాయికి ఎదిగిన ఫ్యాక్టరీ కార్మిక నేతలు
గతమెంతో ఘనమైన చిట్టివలస జ్యూట్ ఫ్యాక్టరీ కార్మికులను గతంలో నాయకత్వం వహించిన పలువురు కార్మిక నేతలు జాతీయ స్థాయిలో ప్రముఖులుగా ఎదిగారు. 1942లో ఏఐటీయూసీకి అనుబంధంగా ఉన్న చిట్టివలస కార్మిక సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన వి.వి.గిరి తర్వాత కాలంలో రాష్ట్రపతి అయ్యారు. జీవీకే వల్లభరావు రాజ్యసభ సభ్యుడయ్యారు. సీఐటీయూ నేతలు పుచ్చలపల్లి సుందరయ్య, సీహెచ్ నరసింగరావు యూనియన్ గౌరవాధ్యక్షులుగా పనిచేశారు.
Also Read : Bhimavaram – ‘మావుళ్లమ్మ’ గురించి తెలుసా ..?