iDreamPost
iDreamPost
ప్రచారంతో ప్రజలను నమ్మించే విశ్వసించే నేతలకు, ప్రచారం లేకుండా కేవలం చేసిన పనులే ప్రజల్లో గుర్తింపునిస్తాయని భావించే నేతలకు వైరుధ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తోంది. రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వ హయంలో ఎంతో సందడిగా కనిపించేది. ఎప్పుడు చూసినా హంగామా ఉండేది. అది ప్రకృతి విపత్తులోనయినా, ప్రభుత్వ కార్యక్రమంలో అయినా ఆడంబరం అనివార్యంగా ఉండేది. కానీ గడిచిన 18 నెలలుగా పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అసాధారణ అంశాలను కూడా ప్రచారానికి దూరంగా పూర్తి చేస్తున్నారు. ప్రచారార్భాటాలకు దూరంగా పనులు చేస్తున్నారు. దాంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చేస్తున్న పనులకు తగిన ప్రచారం చేసుకోవడం లేదేంటి అని అడుగుతున్న వారు కూడా లేకపోలేదు.
ఒక్క అమరావతి అంశంలో దాదాపు అరడజను సార్లు శంకుస్థాపనలు, భూమి పూజలు జరిగాయి. ప్రారంభోత్సవాల గురించి అయితే చెప్పనవసరం లేదు. అది జరిగిన ప్రతీసారి పెద్ద మొత్తంలో ప్రభుత్వ వ్యయం ఖర్చయిపోయేది. ఒక్క రాజధాని శంకుస్థాపన ఖర్చే రూ. 500 కోట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది. ఓ భారీ ఈవెంట్ స్థాయిలో దానిని నిర్వహించారు. శంకుస్థాపన అత్యంత ఆడంబరంగా చేయడమే తప్ప ఆ తర్వాత అసలు పనుల విషయంలో చంద్రబాబు శ్రద్ధ పెట్టకపోవడంతో ప్రజలకు దూరమయ్యారు. ఫలితాలు అందరం చూశాం. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ లో అయితే చెప్పనవసరం లేదు. ఏకంగా గ్యాలరీ వాక్ పేరుతో చంద్రబాబు సకుటుంబ సమేతంగా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక పోలవరం చూసి రండీ అంటూ ప్రజలను తరలించడానికి రూ. 850 కోట్లు వెచ్చించారంటే ప్రచారానికిచ్చిన ప్రాధాన్యత తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే కేవలం ప్రచారంతోనే పబ్బం గడుపుకునే యత్నం ఆయన చేసినట్టు అర్థమవుతోంది.
జగన్ హయంలో తద్విరుద్ధంగా సాగుతోంది. అసలు పొంతనలేనట్టుగా భావించాల్సి ఉంటుంది. ప్రధానమైన పనులను కూడా హంగామా లేకుండా పూర్తి చేస్తున్నారు. చారిత్రక ఘట్టాలను కూడా సీఎం ప్రమేయం లేకుండా నిర్వహిస్తున్నారు. ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో కాకుండా పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తోంది. పోలవరంలో స్పిల్ వే పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. కానీ సీఎం జగన్ మాత్రం ఇన్నాళ్లలో కేవలం మూడు సార్లు మాత్రమే అక్కడికి వెళ్లారు. అధికారులకు దిశానిర్ధేశం చేశారు. సంబంధిత జలవనరుల మంత్రిని సమన్వయం చేసుకునే బాధ్యత అప్పగించారు. తాజాగా స్పిల్ వే గేట్లు పెట్టే కార్యక్రమం ప్రారంభమయ్యింది. 45వ పియర్ కు ఆర్మ్ గడ్డర్ల బిగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రాబోయే ఆరు నెలల్లో ఇవి మొత్తం పూర్తి చేస్తారు. కానీ ఇంతటి కీలక అంశంలో కూడా కేవలం కాంట్రాక్ట్ కంపెనీ, అధికారుల సమక్షంలోనే జరిగిపోయింది. అదే పాత సీఎం అయి ఉంటేనా అనే చర్చకు ఆస్కారమిచ్చింది. గతంలో పూర్తికాని స్పిల్ వే కి గేట్లు పెట్టినట్టు హంగామా చేసిన చంద్రబాబు ఇప్పుడు నిజంగా గేట్లు పెట్టే కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేవారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక ఉద్దానంలో కూడా అదే తీరు. సుదీర్ఘకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఉద్దానం ప్రాంతాన్ని ఉద్దరించే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 700 కోట్లతో తాగునీరు సరఫరా, పరిశోధనా సంస్థ ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించిన భూమి పూజను ఉప ముఖ్యమంత్రి ధర్మాన, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వంటి నేతలే పూర్తిచేశారు. ఇంతటి కీలకాంశం, రాష్ట్ర ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తుందని తెలిసినా సీఎం దూరంగా ఉన్నారు. తనకు దక్కే ప్రచార ప్రయోజనం కన్నా కేవలం ఉద్దాన ప్రాంత వాసుల సమస్య పరిష్కారం కావడమే కీలకమన్నట్టుగా ఆయన చేతల్లో చాటిచెప్పారు. తద్వారా తమది చేతల ప్రభుత్వం అంటూ గతంలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నట్టు అర్థమవుతోంది. అదే సమయంలో అవసరమైన మేరకు ప్రచారానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే వాదన కూడా ఉంది.