iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్‌ కురువృద్ధుడు అస్తమయం

కాంగ్రెస్‌ కురువృద్ధుడు అస్తమయం

కాంగ్రెస్‌ పార్టీ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి, హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ (87) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వీరభద్రసింగ్‌ ఈ రోజు తెల్లవారుజామున ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన వీరభద్రసింగ్‌.. ఆ పార్టీ తరఫున కేంద్రం, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. పలుమార్లు కేంద్ర మంత్రిగా, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన వీరభద్రసింగ్‌ను.. ఆ రాష్ట్ర ప్రజలు అభిమానంతో.. రాజా సాహెబ్‌ అని సంబోధిస్తారు.

1983–1990 మధ్య తొలిసారిగా రాజా సాహెబ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1993–98, 2003–2007, 2012–2017 మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. మొత్తం నాలుగుసార్లు సీఎంగా పని చేసిన రాజా సాహెబ్‌.. అంతకు ముందు కేంద్ర మంత్రిగా పలుమార్లు పని చేశారు. 1962లో లోక్‌సభకు ఎంపిక కావడంతో రాజా సాహెబ్‌ రాజకీయ జీవితం మొదలైంది. 1967, 1971, 1980, 2009లలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 19976–77, 1980–83, 2009–2011 కాలంలో కేంద్రంలో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు.

2012లో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు 2012 నుంచి 2017 వరకు ముఖ్యమంత్రిగా వీరభద్రసింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రిగా పూర్తికాలం పని చేసిన రాజా సాహెబ్‌.. ఆ తర్వాత అనారోగ్యకారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం విషమించి.. ఈ రోజు తుది శ్వాస విడిచారు.

Also Read : అంత మంది రాజీనామా చేయ‌డ‌మా..?